
అనంతశక్తి సంపన్నుడైన భగవంతుని భక్తులు దర్శించుకోగలిగే మార్గం.. ఆలయద్వారం. ఈ ఆలయద్వారంలో ఒక్కో భాగానికీ పేరుంది. ఆ భాగంలో ఒక్కో దేవతకూ స్థానముంది. గుడివాకిలి గడపపై అష్టదళపద్మం ఉంటుంది. ఆ పద్మంలో ఎనిమిది మంది దేవతలుంటారు. ఇది దైవీశక్తికి ప్రతీక. ఈ అష్టదళపద్మాన్ని దాటి ఏ అసురశక్తులూ ఆలయంలోకి ప్రవేశించలేవు. ఈ పద్మం ఉన్న గడపను భువంగం అంటారు. భువంగుడు అనే దేవత దీనికి అధిదేవత. ద్వారపు పై భాగానికి పతంగం అని పేరు. పతంగుడు దీని అధిదేవత. భూమినుండి కిందికి ఉన్న ఏడులోకాలకూ భువంగుడు, భూమికి పైన ఉండే ఏడులోకాలకు పతంగుడూ ప్రతినిధులు. ఆయా లోకాల దేవతలు ఆ భాగాలనుండి దైవదర్శనం చేసుకుంటారు. ద్వారం దక్షిణశాఖ(కుడిపట్టె)కు యోగం అనీ, వామశాఖ(ఎడమపట్టె)కు భోగం అని పేర్లు.
వీరు కుడివైపు నుండి దర్శనం చేసుకునే వారికి యోగాన్ని, ఎడమవైపు నుంచి దర్శనం చేసుకునే వారికి భోగాన్ని అనుగ్రహిస్తారు. అలాగే ద్వారం లోపల కుడివైపు గంగ, ఎడమవైపు యమున వంటి నదీదేవతలుంటారు. ద్వారం ఈ నదీదేవతల ఉనికితో పరమపవిత్రతను సంతరించుకుని ఈ ద్వారం గుండా దర్శించుకునే భక్తులను పవిత్రులను చేస్తుంది. ద్వారం పైభాగం మధ్యలో ద్వారలక్ష్మి, ఆమెకు కుడివైపు గణపతి, ఎడమవైపు సరస్వతీదేవి ఉంటారు. ద్వారం కింది భాగంలో కుడివైపు సూర్యుడు, ఎడమవైపుచంద్రుడు ఉంటారు. విష్ణ్వాలయంలో కూడా ద్వారం పైన లక్ష్మీదేవి, మరికొన్నిచోట్ల శయనించిన రంగనాథస్వామి రూపం దర్శనమిస్తుంది.నిజానికి ద్వారం పైభాగంలో ఆలయంలో కొలువైన దేవతావిగ్రహం ఉండాలని ప్రాసాదమండనం అనే శిల్పశాస్త్రం చెప్పింది.
ఒకవేళ ఆలయం మూసి ఉన్నా ద్వారంపై ఉన్న దేవతను దర్శించుకొని భక్తులు తరించవచ్చు. గరుడ – హనుమ విగ్రహాలను, శంఖనిధి–పద్మనిధి విగ్రహాలను కూడా ద్వారానికి ఇరువైపులా ఉంచే సంప్రదాయం అక్కడక్కడా విష్ణ్వాలయాలలో ఉంది. వాకిలిలోనే కాక కవాటానికి అంటే తలుపులలో కూడా దేవతలు ఉంటారు. కుడితలుపుకు విమలుడు, ఎడమతలుపుకు సుబాహుడూ దేవతలు. ఈ తలుపులపై ఆయా దేవతా లీలారూపాలు, అవతారాలు, అష్టలక్ష్మీరూపాలు చెక్కి ఉంటాయి. అక్కడక్కడా చిరుగంటలు, కొన్నిచోట్ల తలుపులకు రంధ్రాలు కూడా ఉంటాయి. అర్గళం(గడియ)లో స్కందుడు, గడియపట్టికలలో సూర్యచంద్రులు, గడిపడే గుండ్రటి భాగంలో నవశక్తులు ఉంటారు. ఇంతటి శక్తిసంపన్నమైన ద్వారాన్ని దర్శించి భక్తులు అభీష్టాలను నెరవేర్చుకోవచ్చని ఆగమాలు చెబుతున్నాయి.
– కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య
ఆగమ, శిల్పశాస్త్ర పండితులు