
అనుకోకుండా చేసే పనులు కొన్నిసార్లు ఆపదలోకి నెట్టేస్తాయి. ఇలియట్ బెంచెట్రిట్‌కు వచ్చింది ఆపద కాకున్నా.. అందుకు సమానమైనదే. అతడి ఇమేజ్ ఆపదలో పడిపోయింది. (గట్టెక్కే ప్రయత్నం చేశాడు లెండి). ఇలియట్ ఫ్రెంచ్ టెన్నిస్ క్రీడాకారుడు. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ పోటీలు జరుగుతుంటే అక్కడున్నాడు. తన ఆట మధ్యలో విరామం రావడంతో.. పక్కకు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అటుగా బాల్ గర్ల్ వస్తే దగ్గరకు రమ్మని ఆ అమ్మాయిని పిలిచాడు. (ఆట జరుగుతున్నప్పుడు ప్లేయర్ కొట్టిన బంతిని తెచ్చి ఇచ్చే అమ్మాయిల్ని బాల్ గర్ల్స్ అంటారు).
ఆ అమ్మాయి ఇలియట్ దగ్గరికి వచ్చింది. ఆమెకు అరటి పండు ఇచ్చి ఒలిచి ఇమ్మని అడిగాడు. ఆమె ఒలవబోతుంటే.. చెయిర్ అంపైర్ అడ్డుపడ్డాడు. ‘‘బాల్ గర్ల్ ఏమీ నీ బానిస కాదు’’ అని ఇలియట్‌పై కోప్పడ్డాడు. అతడు నివ్వెరపోయాడు. ‘తప్పేముందీ! నా రెండు చేతులకూ వ్యాక్స్ ఉంది. ఒలుచుకోలేక తనకు ఇచ్చాను’’ అన్నాడు. అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది. ఆ వీడియో వైరల్ అయి నెటిజన్‌లంతా ‘ఇలియట్ కాదు.. ఇడియట్’ అని తిట్టేస్తున్నారు. దీనికన్నా అరటితొక్క మీద నుంచి జారి పడటమే నయం అని ఇలియట్ అనుకుని ఉండాలి పాపం.
Comments
Please login to add a commentAdd a comment