పది పాసైతే షేవింగ్ చేసుకుంటాడట!
వృద్ధహాసం
సృష్టిలో అన్నింటికంటే భయంకరమైనది ఒంటరితనం. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారిలో 63 శాతం మంది ఒంటరితనాన్ని భరించలేకే తనువుచాలిస్తున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే మనం చదవబోతున్న దుర్గా కామి కూడా ఒంటరివాడే. అలాగని కుంగిపోలేదు. దానికి అద్భుతమైన మందును కనుగొన్నాడు. ఇప్పుడు ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఇంతకీ కామి ఎందుకు ఒంటరివాడయ్యాడు? దానికి ఆయన కనుగొన్న పరిష్కారమేంటి? తెలుసుకోవాలంటే ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్దాం..
నేపాల్‌లోని స్యాంగ్జా జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో ఎత్తయిన కొండపై కామి ఇల్లుంది. ఎండకు ఎండి, వానకు తడిసేలా చాలా చోట్ల చిల్లులున్న ఇల్లు., ఎప్పుడోగానీ రాని కరెంటు రాని పరిస్థితి. దీంతో నలుగురు పిల్లలకు తండ్రి, ఎనిమిది మంది మనవలు, మనవరాళ్లకు తాత అయిన కామిని వారంతా విడిచిపెట్టి వెళ్లిపోయారు. భార్య చనిపోవడంతో ఒంటరిగా బతకాల్సిన పరిస్థితి ఎదురైంది. అయినా కామి ధైర్యాన్ని కోల్పోలేదు. ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి బడిమెట్లు ఎక్కాడు. పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే ఓ టీచర్ సాయంతో వాటినీ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఎంచక్కా చదువుకుంటున్నాడు. వయసులో పెద్ద అయినా అన్ని కార్యక్రమాల్లో మిగిలిన విద్యార్థులతో పోటీ పడుతున్నాడు. ముఖ్యంగా వాలీబాల్ ఆడే సమయంలో ఎక్కడున్నా టక్కున వాలిపోతుంటాడు. ప్రస్తుతం పదోతరగతి చదువుతున్న అతణ్ని క్లాస్‌మేట్స్ సరదాగా కామి ‘బా’ (తండ్రి) అని పిలుస్తుంటారు. మరి అంతపాటి గడ్డంతో స్కూల్‌కు రావడం బాగుంటుందా? అని అడిగితే.. ‘పదోతరగతి పాసైతే కచ్చితంగా షేవింగ్ చేసుకుంటాన’ని చెబుతున్నాడు.