
ప్రసవం వరకూ గర్భిణికి చేసే పరీక్షలివి...
పరీక్షలు
గర్భధారణ జరిగినప్పటినుంచి ప్రసవం అయ్యే వరకు గర్భిణికి అనేక రకాల పరీక్షలు చేయాల్సి ఉంటుంది. వాటిలో ప్రధానమైనవి...
న్యూకల్ ట్రాన్స్‌లుయెన్సీ (ఎన్‌టీ) అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ద్వారా పిండం ఏర్పడిన తీరు, దాని చుట్టూ ఉండాల్సిన ద్రవాల పరిమాణం, చిక్కదనాలను తెలుసుకుంటారు.
ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ ప్లాస్మా ప్రొటీన్ స్క్రీనింగ్ (పిఎపిపి-ఎ), హ్యూమన్ క్రానిక్ గొనాడోట్రోపిన్ (హెచ్‌సిజి) పరీక్షలు. వీటి ద్వారా ప్లాసెంటా నుంచి విడుదలయ్యే ప్రొటీన్ సరిగ్గా విడుదలవుతోందా లేదా క్రోమోజోమ్‌లలో ఏవైనా అపసవ్యతలు ఉన్నాయా అనే వివరాలను తెలుసుకోవచ్చు, ఇవి రెండూ రక్త పరీక్షలు.
అల్ఫా ఫీటోప్రొటీన్ స్క్రీనింగ్ (ఎఎఫ్‌పి)... ఈ రక్తపరీక్ష ద్వారా ఉమ్మనీటిలో అల్ఫా ఫీటోప్రోటీన్ స్థాయులు తగినంత ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు. బిడ్డకు జన్యుపరమైన లోపాలు వచ్చే ప్రమాదం ఉంటే దానిని ముందుగానే గ్రహించవచ్చు.
గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్... రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తెలుసుకోవచ్చు. అందులో తేడా ఉన్నట్లు గమనిస్తే దానిని జస్టేషనల్ డయాబెటిస్ (గర్భిణిగా ఉన్నప్పుడు వచ్చే మధుమేహ వ్యాధి)గా పరిగణించి చికిత్స చేయాల్సి ఉంటుంది.
జెనెటిక్ స్క్రీనింగ్... ఈ పరీక్షను కుటుంబ ఆరోగ్య చరిత్రను బట్టి అవసరమైతేనే చేస్తారు. సిస్టిక్ ఫైబ్రోసిస్, హీమోఫీలియా, థలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా, పాలీ సిస్టిక్ కిడ్నీ డిసీజ్‌లు వచ్చే అవకాశాలను గమనిస్తారు.
అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా ప్రసవం అయ్యే తేదీని నిర్ధారణ చేయడం, గర్భంలో ఒకటికంటే ఎక్కువ పిండాలు ఏర్పడిన పరిస్థితిని గమనించడంతోపాటు పిండం ఎదుగుదలను పర్యవేక్షిస్తారు. గర్భిణి ఆరోగ్యస్థితిని బట్టి మరికొన్ని పరీక్షలు కూడా చేయాల్సి రావచ్చు.