వారికది బతుకు చెట్టు!
ఇక్కడ కొబ్బరిచెట్లు ఎక్కుతున్న మహిళల్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ఎప్పుడూ అనిపించేదే... అక్కడ కూడా మగవారికి పోటీ ఇస్తున్నారని. అయితే ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కుతున్న అమ్మాయిలు పోటీల్లో భాగంగా ఎక్కడంలేదు. పొట్టకూటికోసం ఎక్కుతున్నారు. కొబ్బరికాయలు కోసేవారికి ప్రత్యేకంగా కూలీ ఇవ్వడం గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆ డబ్బులకోసమే కేరళ అమ్మాయిలు కొబ్బరిచెట్లు ఎక్కడం నేర్చుకుంటున్నారు.
నలభై మూడేళ్ల లిస్సి తొట్టియిల్ మొదట కొబ్బరిచెట్టు ఎక్కి తోటి మహిళలకు ఆదర్శంగా నిలిచింది. కొబ్బరిచెట్లనే నమ్ముకుని బతికే కేరళలో అమ్మాయిలు చెట్లు ఎక్కే అవసరం ఎందుకొచ్చిందంటే...‘‘ఏం చేస్తాం. కూటి కోసం కోటి విద్యలంటారు కదా! ప్రతీ పనిలో పోటీ పెరిగిపోయింది. కొబ్బరికాయల దింపు పని ఏడాదంతా ఉంటుంది. ఆ పని చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. కొబ్బరిచెట్లు ఎక్కడానికి శిక్షణ తీసుకుని పని మొదలుపెట్టాను. అలా వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాను’’ అని చెబుతుంది లిస్సి. ఆమె మాటలు అక్కడ చాలామంది అమ్మాయిలకు నచ్చాయి. ఇంకేముంది... శిక్షణ ఇచ్చేవారి చిరునామా కనుక్కుని చెట్లెక్కడం నేర్చుకుంటున్నారు. ఒక్కో కొబ్బరికాయకి ఇన్ని పైసలని ఇస్తారక్కడ. ఆ డబ్బుతో చదువుకోవచ్చు, కావాల్సిన అవసరాలు తీర్చుకోవచ్చు అనే ఆలోచనతో చదువుకున్న అమ్మాయిలు కూడా చెట్లెక్కడాన్ని పార్ట్‌టైమ్ జాబ్‌గా ఎంచుకున్నారు.
నిరుద్యోగులకు వరం...
ఇరవై ఏడేళ్ళ మరియాంబి పరీద్ మాటల్లో చెప్పాలంటే కొబ్బరిచెట్లు ఎక్కే అవకాశం నిరుద్యోగులకు వరంలాంటిది. ‘‘కొబ్బరి చెట్టు ఎక్కి కిందకి చూస్తే అందరికన్నా ఎత్తుకెదిగానన్న ఆ ఫీలింగ్ భలేగా ఉంటుంది. అంటే నా ఉద్దేశ్యం...ఈ పనిలో కూడా మగాళ్లకు తీసిపోలేదన్న భావన. ఫీలింగ్ సంగతి ఎలా ఉన్నా...నాలుగు పైసలు సంపాదించుకోడానికి అవకాశం దొరికింది’’ అని చెప్పిందామె. గత రెండేళ్లలో కేరళలో 600 మంది మహిళలు కొబ్బరిచెట్లు ఎక్కే శిక్షణ తీసుకున్నారు.
నిరుద్యోగమే కాక, విభిన్నంగా ఆలోచించి ముందుకెళ్లే మహిళల ఆలోచనలు కూడా కారణం అనుకోవచ్చు. కొబ్బరి చెట్టు ఎక్కడంకోసం కొత్తరకం తాళ్లు వచ్చాయి. అలాగని చెట్టు ఎక్కేయడం సులువేం కాదు. కొత్తలో కళ్లు తిరగడం వంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. చెట్టుపైకి ఎక్కాక కాయలు తీసేటప్పుడు పురుగు పుట్రా వంటివాటి నుంచి తప్పించుకోడానికి కూడా సిద్ధంగా ఉండాలి.