వాకర్స్ బాటకు ఇరువైపులా పోకచెట్లు, పార్కులో పెంచుతున్న విదేశీ తాళ జాతి మొక్కలు
చాదర్‌ఘాట్: నగరంలో తాటి చెట్టును చూడగలమా..! అంటే మాత్రం కాంక్రీట్ జంగిల్‌లో అదెలా సాధ్యం అంటారు ఎవరైనా. కానీ ఓల్డ్ మలక్‌పేట్‌లో మాత్రం ఒక్క తాటి చెట్టే కాదు.. ఆ జాతి మొక్కలతో ఓ అద్భుతమైన వనమే ఉంది. పచ్చని వాతావరణంలో ఆ వనంలో సేదతీరేందుకు ఏర్పాట్లు కూడా ఉన్నాయి. నిటారుగా పెరిగిన ఆ మొక్కలు ప్రకృతి ప్రేమికులను ఆహ్వానిస్తున్నట్టున్నాయి. గజిబిజి గందరగోళంగా ఉండే నగరంలో పచ్చదనం విస్తరించిన ఓ పల్లె వాతావరణం సందర్శకులను పరవశింపచేస్తుంది.
ఓల్డ్ మలక్‌పేటలోని ఈసేవా కార్యాలయం వెనుక వైపు తీర్చిదిద్దిన ఈ తాటివనంలో 103 దేశాలకు చెందిన తాళజాతి మొక్కలు పెంచుతున్నారు. సౌత్ ఈస్ట్ ఆసియాకు చెందిన టారాఫామ్ ఈత చెట్టు, నార్త్ ఆఫ్రికాకు చెందిన పోకచెట్లు ఈ పార్కులో ఆకర్షణ. జీహెచ్‌ఎంసీ ప్రత్యేక శ్రద్ధతో రూపొందించిన ఈ వనం స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల మదినిండా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని నింపుతోంది. ఇక్కడ దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బర్ముడా, నార్త్ అమెరికా, సౌత్ ఈస్ట్ ఆసియా, బ్రెజిల్, క్యూబా, ఆస్ట్రేలియా, డెన్మార్క్, జర్మనీ తదితర దేశాల నుంచి తెచ్చిన మొక్కలు ఈ వనంలో ఉన్నాయి. గాలికి అటూ ఇటూ ఊగుతూ ఉదయం, సాయంత్రం వేళల్లో వచ్చే వాకర్స్‌ను పలుకరిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఈ పార్కులో ఉదయం 6 నుంచి 10, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు విహరించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment