మొదటి నమస్కారం అమ్మకే! | The first sale of Hello! | Sakshi
Sakshi News home page

మొదటి నమస్కారం అమ్మకే!

Published Sat, Nov 26 2016 10:59 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM

మొదటి   నమస్కారం అమ్మకే!

మొదటి నమస్కారం అమ్మకే!

ధర్మసోపానాలు

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ - ఇవి వేదం చెప్పిన నియమాలు. వేదాల చివర ఉండేవాటిని ఉపనిషత్తులు అంటారు. ఇవి జ్ఞానాన్ని ప్రబోధిస్తాయి. వీటిలో ప్రధానమైనవి పది. ఆ దశోపనిషత్తుల్లో ‘తైత్తిరీయోపనిషత్’ ఒకటి. తిత్తిరి మహర్షి అనుగ్రహంతో ప్రకాశించిన ఈ ఉపనిషత్తులో ప్రధానంగా ‘శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి’ అని మూడు భాగాలున్నాయి. శిక్షావల్లిలోని 11వ అనువాకంలోనిదే ‘మాతృదేవోభవ’ అనే మంత్రం. ఈ పాఠాన్నంతటినీ కలిపి మళ్ళీ ‘స్నాతక ప్రకరణ’మని వివాహంలో వరుడికి గురువుగారు ప్రబోధం చేస్తారు. అప్పుడు గురువుగారితో మొట్టమొదట ఇవ్వబడే ఆజ్ఞ- మాతృదేవోభవ.

అమ్మ- పరమేశ్వరుని స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం. మనం ‘ప్రార్థన’ అని ఒక మాట రోజూ వాడుతుంటాం. జీవుడు, కాలం, దురితం (గత జన్మలో చేసుకున్న పాపం) అన్న మూడు మాటల స్వరూపానికి అందని దుష్ఫలితాల నుండి తప్పించుకోవడానికీ, తనను తాను రక్షించుకోవడానికీ జీవుడు చేసే ప్రయత్నానికే ‘ప్రార్థన’ అని పేరు. కాలం ఒకరితో ఆపబడేదీ కాదు, ఒకరికొరకు ఎదురు చూసేదీ కాదు. ‘కాలోహి బలవాన్ కర్తా సతతం సుఖదుఃఖయో, నరాణాం పరతంత్రాణాం పుణ్యపాపాను యోగతః’. కాలం పరమ బలవత్తరమైన స్వరూపం. కాలం నడిచి వెళ్ళిపోతూనే ఉంటుంది. వెనక్కి వచ్చే లక్షణం ఉండదు. కాలప్రవాహంలో జీవులందరూ పడిపోతూంటారు. నా చేతిలో లేని కాలానికీ, తెలియక గతంలో నేను చేసుకున్న పాపాలను ఇప్పుడు లెక్కపెట్టి దాని ఫలితాన్ని ఇవ్వాలనుకుంటున్న పరమేశ్వరుడికీ మధ్య నలిగిపోలేక, ఆయన శక్తిని గుర్తెరిగి, ‘ఈశ్వరా! నన్ను అనుగ్రహించి పాపాల దుష్ఫలితం తీవ్ర రూపంలో లేకుండా కాపాడు’ అని అడగడానికి రోజూ ప్రార్థన చేస్తాం. ‘పరమేశ్వరుడు సర్వజ్ఞుడు. నా పాప పుణ్యాలు తెలిసున్నవాడు. కాలరూపంగా ఉన్నవాడు. ఫలితాలను ఇవ్వగలిగిన వాడు. ఆయనను ఎదిరించగలవారెవరూ లేరు. ఆయన ఇచ్చిన ఫలితాన్ని అనుభవించాల్సిందే’ అంటాడు శ్రీరామచంద్రుడు ‘శ్రీమద్రామాయణం’లోని అయోధ్యకాండలో! ‘ఈశ్వరా! నేనీ రోజున ఒక మంగళకరమైన కార్యం మీద బయల్దేరుతున్నాను. కచ్చితంగా నేను గత జన్మలో పాపాలు చేసి ఉంటాను. కానీ దాని ఫలితాలు నేను తలపెట్టిన కార్యానికి ప్రతిబంధకం కాకుండా, నా మనసు విచలితమైపోయేటట్లు కాకుండా, నేను తట్టుకోగల్గిన శక్తిని నాకిచ్చి, నేను చేపట్టిన శుభకార్యాలను నా చేత చేయించు’ అని ప్రార్థిస్తాం.

ఇలా చేసేటప్పుడు ‘త్వమేవ మాతా చ  పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణమ్ త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ’ అంటాం. ‘తల్లివి నీవే, తండ్రివి నీవే, బంధువువు నీవే, ద్రవ్యమూ నీవే, నాకు సమస్తమూ నీవే’ అంటాం. అంటే మనం తల్లినీ, తండ్రినీ ఈశ్వరునిలోనే చూస్తాం. అందుకే ప్రార్థనలన్నీ ఇలానే ఉంటాయి. కానీ తల్లి, తండ్రి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళలో ఈశ్వరుడిని చూస్తాం. అందుకే మాతృదేవోభవ. అన్నగారినో, తమ్ముడినో ఈశ్వరుడని అనం. కానీ తల్లి విషయంలో ఈశ్వరతత్త్వాన్ని చూస్తాం. అమ్మలో ఈశ్వరుని చూడడం కాదు. అమ్మే... పరబ్రహ్మం. మాంస నేత్రంతో చూడడానికి యోగ్యమై, పరబ్రహ్మ స్వరూపమై - ఈ లోకంలో తిరగగలిగిన వ్యక్తి - అమ్మ ఒక్కతే! అందుకే వేదం ప్రథమ నమస్కారం అమ్మకే చేయించింది.

అమ్మ పర్రబహ్మం ఎలా అవుతుంది?  అమ్మ కావాలంటే ప్రాథమికంగా ఒక స్త్రీ అయి ఉండాలి. తెలుగులో ఆడపిల్ల అనడంలోనే ఆమెలో లక్ష్మీతత్త్వముందని చెబుతారు. ఆమె ఈడపిల్ల కాదు, ఇక్కడుండిపోయే పిల్ల కాదు. ఇక్కడ ఉండాలని మనం కోరుకోం కూడా. పోతన గారు ‘వీరభద్ర విజయం’ రాస్తూ, పార్వతీ దేవిని చూసి, ‘నీకు తండ్రినైతి నాకింత చాలదే మహాద్భుతంబు ఇందువదనా’ అంటాడు. ఆడపిల్ల పుట్టింది అంటే లక్ష్మీదేవి తన కడుపున పుట్టిందని గుర్తు. ఆమె నారాయణుడిని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఆమె అతని సొత్తు. అతనితో కలిసి ఉండడం తప్ప మరొకలా ఉండడం ఆమెకు సుఖప్రదమూ కాదు, సంతోషదాయకమూ కాదు. శ్రీమద్రామాయణంలోనే సీతమ్మ ఓ మాట అంటుంది... ‘నా తంత్రీ వాద్యతే వీణా, నా చక్రో వర్తతే రథః, నా పతిస్సుఖమే ధేత యాస్యాదాపి శతాత్మజా’ (అయోధ్య. 39-29). ‘అమ్మా ! నీ కాలు నేల మీద పడకూడదు. మా అరచేతుల్లో పాదాలుంచి నడువమ్మా’ అనే స్థాయిలో పరమ ప్రేమమూర్తులైన నూర్గురు కొడుకుల వల్ల కలిగిన సుఖం కన్నా, స్త్రీకి భర్త వల్ల కలిగే సుఖం లెక్కపెట్టడానికి శక్యం కానిది అంటుంది. నా భర్త ఇచ్చిన సుఖాన్ని ఇవ్వగలిగినవాడు లేడు. అందుకని నేను నీతోనే ఉంటానంటుంది సీతమ్మ.

అటువంటి నారాయణుడిని వెతుక్కుంటూ పోయే ఆడపిల్ల - అక్కడి పిల్ల. ఆమె ఆ ఇంటి పేరు పెట్టుకుంటుంది. ఆ గోత్రంలోకి వెళ్ళిపోతుంది. ఆ వంశాన్ని ఉద్ధరిస్తుంది. మగపిల్లవాడైతే పుట్టిన వంశాన్నే ఉద్ధరిస్తాడు. కానీ తన నడవడి చేత కన్నవారి వంశాన్నీ, కట్టుకున్న వారి వంశాన్నీ కూడా ఆడపిల్ల ఉద్ధరించగలదు. ఆమె లక్ష్మీస్వరూపే. కానీ, తల్లి, తండ్రి బిడ్డకు నమస్కారం చేయరు. అక్క, చెల్లెలు, పినతల్లి, పెదతల్లి, కోడలు... ఇలా బంధుత్వరీత్యా ఆమె ఎన్నో స్థానాలలో నిలబడినప్పటికీ, ఒక స్త్రీ పరబ్రహ్మంగా నమస్కారం అందుకునేది తల్లిగా నిలబడినప్పుడు మాత్రమే!అందుకే - మాతృదేవోభవ. ఆమే... పరమేశ్వర స్వరూపం. ఆమే... పరబ్రహ్మం.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement