ఈ దేశపు రాకుమారుడిని ఆ దేశపు రాకుమారి, ఆ దేశపు రాకుమారుడిని ఈ దేశం రాకుమారిని వివాహమాడడం సాధారణంగా జరిగేదే. అయితే రాజకుటుంబాల వాళ్లు సామాన్య పౌరుల్ని పెళ్లి చేసుకోవడమే విశేషంగా కనిపిస్తుంది. అటువంటి విశేష వివాహబంధాలలో కొన్ని.
కేట్ మిడిల్టన్ – ప్రిన్స్ విలియం (ఇంగ్లండ్)
కేట్ కామన్ గర్ల్. విలియమ్ ది రాజుల ఫ్యామిలీ. స్కాట్లండ్‌లోని సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు చూపులు కలిశాయి. ప్రేమలేఖలు పూశాయి. పెళ్లితో అవి పరిమళించాయి. 2011లో కేట్ రాజప్రాసాదంలోకి విలియమ్ భార్యగా అడుగుపెట్టింది.
గ్రేస్ కెల్లీ – ప్రిన్స్ రైనర్ ఐఐఐ (మొనాకో–యూరప్)
గ్రేస్ కెల్లీ హాలీవుడ్ నటి. పుట్టి పెరిగింది ఫిలడెల్ఫియాలో. 1955లో ఆమెకు ‘ది కంట్రీ గర్ల్’ అనే చిత్రానికి ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు వచ్చింది. అదే ఏడాది ఆమె అనుకోకుండా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మోనాకో రాకుమారుడు రెయినర్ ఐఐఐ ని కలుసుకున్నారు. ఆ మరుసటి ఏడాదే ఆమె రాకుమారుడిని పెళ్లి చేసుకున్నారు. సినిమాలు మానేశారు. మోనాకో వెళ్లిపోయారు. చనిపోయేవరకు ఆ దేశంలోనే ఉండిపోయారు.
లెటీజియా ఆర్టిజ్ రొకాసొలానో – కింగ్ ఫెలిపే vi (స్పెయిన్)
ప్రస్తుత స్పెయిన్ రాణి లెటీజియా ఆర్టిజ్ ఒకప్పుడు జర్నలిస్ట్. న్యూస్ బ్రాడ్‌కాస్టర్. 2000 యు.ఎస్.అధ్యక్ష ఎన్నికల కవరేజీతో, ‘టెలీడైరియో’ అనే న్యూస్‌ప్రోగ్రామ్‌తో ఆమె పాపులర్ అయ్యారు. అలా అప్పటి ఆస్ట్రూరియస్ (స్పెయిన్‌లో ఒక భాగం) యువరాజు కంట్లో పడ్డారు. పెళ్లి చేసుకున్నారు. ఈ జంటను చూసి స్పెయిన్ ముక్కుమీద వేలేసుకుంది. అందుకు కారణం లెటీజియా అతి సామాన్యురాలు కావడం ఒక్కటే కాదు, అప్పటికే ఆమెకు ఒకసారి పెళ్లి అయి ఉండడం!
రానియా అల్ యస్సీన్ – కింగ్ అబ్దుల్లా ఐఐ ఆఫ్ జోర్డాన్
జోర్డాన్ ప్రస్తుత రాణి రానియా తన 22 ఏళ్ల వయసులో జోర్డాన్ రాకుమారుడు అబ్దుల్లాను కలుసుకున్నారు. రానియా కువైట్‌లోని పాలస్తీనా తల్లిదండ్రులకు పుట్టింది. సద్దాం హుస్సేన్ కువైట్‌ను ఆక్రమించుకుంటున్న సమయంలో వీళ్ల కుటుంబం జోర్డాన్ వెళ్లిపోయింది. జోర్డాన్‌లోని అమెరికన్ యూనివర్సిటీలో రానియా చదువుకుంది. అక్కడే కొంతకాలం సిటీబ్యాంక్‌లో, ఆపిల్ సంస్థలో పనిచేసింది. 1999లో వీళ్ల పెళ్లి జరిగింది.
మాక్సిమా జొర్రెంగీటా సెర్రూటి – కింగ్ విలియమ్ అలెగ్జాండర్ ఆఫ్ నెదర్లాండ్స్
మాక్సిమా జన్మస్థలం అర్జెంటీనా. న్యూయార్క్ లోని డ్యూచే బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు ఆమె 1999లో ఆమెకు ప్రిన్స్ అలెగ్జాండర్‌తో పరిచయం అయింది. తొలిసారి వీళ్లద్దరూ స్పెయిన్‌లోని ఒక వస్తుప్రదర్శన శాలలో కలుసుకున్నారు. అప్పుడు ప్రిన్స్ అలెగ్జాండర్.. తనను తను అలెగ్జాండర్ అని మాత్రమే తెలియజేసుకున్నాడు. తర్వాత వాళ్ల పెళ్లవడం, మాక్సిమా నెదర్లాండ్స్ క్వీన్ అవడం మామూలే.
మేరీ షాంటాల్ మిల్లర్ – పావ్‌లోస్, క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ గ్రీస్
మేరీ గ్రీస్‌లో ఒక ప్రసిద్ధ వ్యాపారవేత్త కూతురు. ఆయన పేరు రాబర్ట్ వారెన్ మిల్లర్. డ్యూటీ–ఫ్రీ దుకాణ సముదాయాలతో ఒక మహా సామ్రాజ్యాన్నే నిర్మించుకున్నాడు. ఆయన ద్వారా ఏర్పడిన రాజకుటుంబ సాన్నిహిత్యం మేరీకి, పావ్‌లోస్‌కి పెళ్లి కుదిర్చింది. 1995లో ఈ వీళ్ల పెళ్లి జరిగింది. ఇప్పుడామె గ్రీసుకు కాబోయే మహారాణి.
రాజులు రాణులు సామాన్య పౌరులు
Published Fri, May 19 2017 12:28 AM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM
Advertisement
Advertisement