మనిషి అన్నాక వ్యాధి...
మెడీ మిస్టరీస్
పదిశోధన
మనిషి అన్నాక వ్యాధి వస్తుంది. దాన్ని వైద్యులు నయం చేస్తారు. కానీ వాళ్లు నయం చేయలేని వ్యాధులు కొన్ని ఉన్నాయి. కొందరికి వచ్చాయి. మహా మహా వైద్యులకు సైతం అంతుపట్టని మెడికల్ మిస్టిక్స్ కొన్ని ఈ ప్రపంచంలో జరిగాయి. వాటి గురించి వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇవి అలాంటివే...
1 జారా అబోతాలిబ్ 1955లో పురుటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లింది. డాక్టర్లు సిజేరియన్ చేసి బిడ్డను తీశారు. సంతోషంగా బిడ్డతో ఇంటికి వెళ్లిపోయింది జారా. చాలా యేళ్ల తర్వాత విపరీతమైన కడుపునొప్పితో మళ్లీ ఆస్పత్రికి వెళ్లింది జారా. అప్పటికామెకి డెబ్భై అయిదేళ్లు. స్కానింగ్ చేసిన డాక్టర్లు ఫాలోపియన్ ట్యూబ్స్‌లో చనిపోయిన బిడ్డ ఉండటం చూసి షాక్ తిన్నారు (ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ). అన్ని సంవత్సరాల పాటు చనిపోయిన బిడ్డను కడుపులో పెట్టుకుని జారా ఆరోగ్యంగా జీవించడం చాలా ఆశ్చర్యపర్చింది వారిని. అయితే అన్నేళ్లుగా ఉండటం వల్ల ఆ బిడ్డ ‘ఈజిప్షియన్ మమ్మీ’ మాదిరిగా అయిపోయింది. వెంటనే తీయలేకపోయారు. దాదాపు అయిదేళ్లు శ్రమ పడ్డాకే అది సాధ్యమయ్యింది.
2 ఎపిడెర్మోలిసిస్ బుల్లోసా డిస్ట్రోఫికా... ఎందుకొస్తుందో, ఎవరికి వస్తుందో, ఏం చేస్తే పోతుందో ఎవరికీ అర్థం కాని ఓ వ్యాధి. మిషిగన్‌కి చెందిన జాషువాకి వచ్చింది. చిన్నతనంలో ఉన్నట్టుండి కాలి మీద మంట పుట్టడంతో రుద్దుకున్నాడు జాషువా. దాంతో అక్కడ పుండు పడింది. తర్వాత ఒళ్లంతా పుండ్లలాగా ఏర్పడటం మొదలైంది. చర్మం పొలుసులు పొలుసులుగా ఊడిపోసాగింది. డాక్టర్లు ఈ వ్యాధికి పేరైతే పెట్టారు కానీ చికిత్స మాత్రం కనిపెట్టలేకపోయారు. దాంతో ఇదే వ్యాధి బారిన పడ్డ జాషువా చెల్లెలు శారా ప్రాణాలు కోల్పోయింది. ఇరవై ఏడేళ్ల జాషువా మాత్రం ఇప్పటికీ నరకం అనుభవిస్తున్నాడు.
3 జోల పాడితే నిద్రొస్తుంది. పుస్తకం చదివితే నిద్రొస్తుంది. వాతావరణం ఆహ్లాదంగా ఉంటే నిద్రొస్తుంది. కనీసం బాగా అలసిపోతేనయినా నిద్రొస్తుంది. ఇవన్నీ మిగతావాళ్ల విషయంలో. షెరిల్ డింగిస్ విషయంలో కాదు. ఆమెకు ఏం చేసినా నిద్ర రాదు. ఆమెకే కాదు, ఆమె కుటుంబంలో ఎవరికీ నిద్ర రాదు. అది వాళ్లకు వారసత్వంగా సంక్రమిస్తోన్న సమస్య. నిద్ర లేక, నాన్నా అవస్థలూ పడి, నీరసించిపోయి ఆమె తాత, తల్లి, చిన్నాన్న ప్రాణాలు కోల్పోయారు. మిగతావాళ్లు ఆ పరిస్థితి రాకుండా ఏవో జాగ్రత్తలు తీసుకుంటున్నారు తప్ప నిద్రపోవాలని చేస్తున్న ప్రయత్నాల్లో విజయం సాధించడం లేదు.
4 తిండి లేకపోయినా ఫర్వాలేదు నీళ్లు తాగి కొన్ని రోజులు బతకొచ్చు అంటారు. కానీ నీరు తగిలితేనే ప్రాణం పోతే? అలా ఎందుకు జరుగుతుంది అనుకోకండి. జరుగుతుంది. ఇంగ్లండ్‌కు చెందిన మిఖాయెలా డట్టన్ విషయంలో జరిగింది. మొదట్లో మిఖాయెలా అందరిలానే ఉండేది. కానీ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమెకు ‘ఆక్వాజెనిక్ యుర్టికారియా’ అనే విచిత్రమైన చర్మ వ్యాధి వచ్చింది. నీరు కానీ, నీరు ఉన్న పదార్థం కానీ ముట్టుకుంటే చాలు... ఒళ్లంతా ర్యాషెస్ రావడం మొదలైంది. చివరికి పండ్లు తిన్నా అలర్జీయే. బాగా దాహమేసి కొన్ని చుక్కలు నీళ్లు గొంతులో వేసుకుందో... ఇక గొంతు వాచిపోయి చిత్రవధ. తన కొడుకుని ఎత్తుకున్నప్పుడు వాడి చెమట అంటుకున్నా ఒళ్లంతా బొబ్బలు వచ్చేస్తాయి. డాక్టర్లు చాలా ప్రయోగాలు చేశారు కానీ దీన్ని నివారించలేకపోయారు. రకరకాల పరీక్షల తర్వాత డైట్ కోక్ తాగితే ఏమీ కావడం లేదని అర్థమైంది. దాంతో అది మాత్రమే తాగుతోంది మిఖాయెలా.
5 నొప్పి కలిగితే బాధగానే ఉంటుంది. కానీ నొప్పి అన్నదే తెలియకపోతే ఇంకా బాధగా ఉంటుంది. గ్యాబీ గింగ్రాస్‌ని చూస్తే ఆ సంగతి అర్థమవుతుంది. గ్యాబీకి అసలు నొప్పి అంటే ఏంటో తెలియదు. ఎంత పెద్ద దెబ్బ తగిలినా, రక్తం కారిపోతున్నా ఆమెకు తెలీదు. చిన్నప్పుడు రక్తం వచ్చేలా గోళ్లు కొరికేసుకుంది. దురద పెడుతున్న కంటిన నలిపి నలిపి కన్ను పోగొట్టుకుంది. అప్పటికిగానీ ఆమె ‘కంజైటల్ ఇన్‌సెన్సిటివిటీ టు పెయిన్ విత్ అన్‌హైడ్రోసిస్’ అన్న సమస్యతో బాధ పడుతోందని తెలియలేదు. దానికి పరిష్కారం ఏంటో డాక్టర్లకు కూడా అర్థం కాలేదు. దాంతో ఆమె నొప్పి తెలియని జీవితమే జీవిస్తోంది. కానీ దానివల్ల పైన చెప్పుకున్నట్టుగా ఎన్నో ప్రమాదాలకు గురై అవస్థలు పడుతోంది.
6 గుండెనొప్పి వచ్చి గుటుక్కుమన్నవాళ్లు ఎందరో ఉన్నారు. కానీ డిజానా సిమన్స్ అసలు గుండే లేకుండా 118 రోజులు జీవించింది. అమెరికాలోని సౌత్ కరొలినాకు చెందిన డిజానాకి పద్నాలుగేళ్ల వయసులో డైలేటెడ్ కార్డియో మయోపతీ అనే సమస్య ఉన్నట్టు తేలింది. గుండె బలహీనపడింది. రక్తసరఫరాలో సమస్య ఏర్పడింది. దాంతో డాక్టర్లు ఆపరేషన్ చేసి వేరే గుండె అమర్చారు. కానీ ఆ గుండె సెట్ కాక సమస్యలు తలెత్తడంతో వెంటనే తీసేశారు. కానీ అమర్చడానికి తగిన గుండె అందుబాటులో లేదు. దాంతో ఆర్టిఫీషియల్ బ్లడ్ పంపింగ్ డివైస్‌ను అమర్చారు. 118 రోజుల తర్వాత తగిన గుండె దొరకడంతో అప్పుడు అమర్చారు. ఇది వైద్య చరిత్రలోనే ఓ అద్బుతం!
7 నేలమీద నూకలుంటే మృత్యువు సైతం ముఖం తిప్పుకుని పోతుందట. అల్సిడెజ్ మోరెనోని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. 2008లో ఓరోజు అతను తన సోదరుడు ఎడ్జర్‌తో కలిసి ఓ భవంతిలోని 47వ అంతస్తు అద్దాలను శుభ్రం చేయడం మొదలెట్టాడు. కాసేపటికి వాళ్లు పని చేయడానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న ప్లాట్‌ఫామ్ కూలిపోయింది. దాంతో అంతెత్తు నుంచి ఇద్దరూ కింద పడిపోయారు. ఎడ్జర్ కన్నుమూశాడు. అల్సిడెజ్ కాళ్లు, చేతులు, వెన్నెముక, మెడ ఎముక, పక్కటెముకలు... అన్నీ విరిగిపోయాడు. పదహారు సర్జరీలు చేశారు. బతకడం కష్టమేనన్నారు. కానీ అతను బతికాడు. మూడేళ్లలోనే చక్కగా లేచి తిరగసాగాడు. అలా ఎలా జరిగిందా అని అతనికి వైద్యం చేసిన డాక్టర్లు ఈ రోజుకీ ఆశ్చర్యపోతున్నారు.
8 చిన్న కరెంట్ షాక్ కొడితేనే కెవ్వుమంటాం మనం. కానీ ప్యూర్టోరికాకు చెందిన జోస్ రఫీల్ మార్క్వెజ్ అయలాని కరెంటు ఏమీ చేయలేదు. వృత్తిపరంగా టీవీలు రిపేర్లు చేస్తుంటా డు అయలా. కరెంటు పని కూడా చేస్తాడు. ఓసారి కరెంటుతో ఏదో చేస్తుండగా షాక్ కొట్టింది. షాక్ కొట్టినట్టు తెలిసింది తప్ప నొప్పి కానీ, తిమ్మిరి కానీ ఎక్కలేదు. అలా పలుమార్లు జరిగాక అనుమానం వచ్చింది అయలాకి. దాంతో తనని తాను పరీక్షించుకున్నాడు. కరెంటు తననేమీ చేయలేదని కన్‌ఫార్మ్ చేసుకున్నాడు. అది అతణ్ని ఎందుకు ఏమీ చేయలేదో డాక్టర్స్‌కి, సైంటిస్టులకి కూడా అంతు పట్టలేదు.
9 మనిషి కోతి నుంచి వచ్చాడు అంటారు. కానీ ఆ మనిషిలో కోతి లక్షణాలు కనిపిస్తే మాత్రం విచిత్రంగా చూస్తారు. నవ్వుతారు. ఎగతాళి చేస్తారు. పృథ్విరాజ్ పాటిల్ ఇవన్నీ భరించాడు పాపం. ముంబై దగ్గర్లోని ఓ చిన్న గ్రామంలో పుట్టిన ఈ అబ్బాయికి ‘హైపర్‌ట్రైకోసిస్’ అనే జన్యు సంబంధిత వ్యాధి వచ్చింది. దాని కారణంగా అతని శరీరమంతా దట్టమైన రోమాలు మొలిచాయి. షేవ్ చేసినా, లేజర్ ట్రీట్‌మెంట్ చేయించినా ఫలితం లేదు. అవి అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. విదేశీ వైద్య నిపుణులు సైతం విశ్వప్రయత్నాలు చేసినా ఈ సమస్యలకు పరిష్కారాన్ని కానీ, కారణాన్ని కానీ కనుక్కోలేకపోయారు. దాంతో చివరికి ముఖం కూడా కనిపించని స్థితికి చేరుకున్నాడు పాపం పృథ్వీరాజ్.
10 కాసేపు నిద్రపోతేనే ప్రపంచం శూన్యమైపోయినట్టనిపిస్తూ ఉంటుంది. మెలకువ వచ్చాక కాసేపు అయోమయంగా అనిపి స్తుంది. అలాంటిది ఏకంగా పంతొమ్మిదేళ్లు నిద్రలోనే ఉంటే? పోలెండ్ రైల్వే ఉద్యోగి జాన్ జెబ్‌స్కీకి అలానే జరిగింది. 1980లో ఓరోజు ప్రమాదవశాత్తూ తీవ్రంగా గాయపడ్డాడు జాన్. అప్పటికతడు బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఇవన్నీ కలిసి జాన్ కోమాలోకి వెళ్లిపోయాడు. అలా పంతొమ్మి దేళ్లు కోమాలోనే ఉండిపోయి ఓరోజు ఉన్నట్టుండి కళ్లు తెరిచాడు. క్యాన్సర్‌ను సైతం జయించాడు. ఇది ఎలా సాధ్యమయ్యిందో వైద్యులకు సైతం అర్థం కాలేదు.