ఎక్కువగా వాడితే వేపేస్తుంది
పరిపరిశోధన
చిన్నప్పటినుంచి మనం చదువుకున్న దాని ప్రకారం వేపతో మనకెంతో మేలు కలుగుతుంది. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం వేప మేలే కాదు, కీడు కూడా చేస్తుంది. ముఖ్యంగా వేపనూనెను చంటిపిల్లలకు ఉపయోగిస్తే వారిలో రియేస్ సిండ్రోమ్ తలెత్తి అది వారి ప్రాణాలకే ముప్పు కలిగిస్తుందట. అలాగే అలెర్జీ తీవ్రస్థాయిలో ఉంటే చాలామంది వేపాకును నూరి అదేపనిగా పట్టిస్తారు. దానివల్ల మరింత తీవ్రరూపం దాల్చి సమస్య జటిలం అవుతుందంటున్నారు పరిశోధకులు. చాలామంది ఉదయం లేవగానే వేపాకును నూరి ముద్దగా చేసుకుని మింగేస్తే రోగాలు తగ్గిపోతాయనుకుంటారు.
కాని ఇది నిర్ణీత మోతాదులో సేవిస్తేనే మంచి ఫలితం వస్తుంది. లేదంటే కడుపు గడబిడతో అల్లకల్లోలం అవుతుంది. బ్లడ్‌సుగర్‌తో బాధపడేవారికి, అలాగే శరీరావయవాలను మార్పిడి చేయించుకునేవారికి వేపనూనెను ఇస్తుంటారు వైద్యులు. అలా చేయడం చాలా అపాయకరమని పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. కాబట్టి వేపాకే కదా అని ఇష్టం వచ్చినట్లు వాడితే ప్రాణాలను వేపేస్తుంది మరి!