ఎడారిలో నందనవనం
వాది హనిఫా
మధ్య సౌదీ అరేబియాలో రియాద్‌కి అతి సమీపంలో అత్యంత కాలుష్యానికి లోనైన లోయ ఒకటుంది. దానిని పునరుద్ధరించి ఇటీవలే పూర్వ వైభవం తీసుకువచ్చారు అక్కడి అధికారులు. ఎడారిలో ఆకుపచ్చని అందాలను విరబూయించారు. ఏ మాత్రం నివాసయోగ్యం కాని ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చేశారు. ప్రతి పట్టణం ఈ ప్రాంతం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆర్.ఎన్.ఆర్
నీరు మనిషికి ప్రాణాధారం. నాగరికతలన్నీ నది తీరాననే ఊపిరిపోసుకున్నాయి. నీరు ఎంత తక్కువ ఉంటే అక్కడ అభివృద్ధి కూడా అంతగా కుంటుపడుతున్నది తెలిసినదే! సౌదీ అరేబియా ఎడారి దేశం. దీనికి రియాద్ ముఖ్య పట్టణం. రాజధాని కూడా! రియాద్ సమీపంలో 120 కిలోమీటర్ల వైశాల్యంలో ‘వాది హనిఫా’ ఒక లోయ ప్రాంతం. ఈ లోయ ప్రాంతంలో చిన్న గ్రామాల నుంచి పెద్ద పట్టణాల వరకు ఉన్నాయి. సాంస్కృతిక పరంగానూ ఎంతో చరిత్ర ఉంది ఈ ప్రాంతానికి. ప్రాచీన కాలంలో ఈ లోయలో విస్తారంగా వర్షాలు పడేవి. ఇక్కడ సారవంతమైన భూములు వ్యవసాయానికి అనువుగా ఉండేవి. మానవ ఆవాసాలకు అత్యంత యోగ్యంగా ఉండేది. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదిగిన నగరంగా రియాద్ అభివృద్ధి ‘వాది హనిఫా’ వల్లే సాధ్యమైంది. అయితే అంతే వేగంగా ‘వాది హనిఫా’ కాలుష్యానికి లోనైంది. నీరు, గాలి కాలుష్యం వల్ల ప్రజల జీవనశైలి దెబ్బతింది. అనారోగ్యాల కారణంగా ఎంతో మంది మృత్యువాత పడ్డారు. 2001 నుంచి అపరిమిత కాలుష్యం కారణంగా ఇక్కడ అమితమైన వేడి పెరిగిపోవడంతో ఏడాదిలో కొన్ని వారాలు మాత్రమే ఇక్కడ జనం నివసించే పరిస్థితులు ఏర్పడాయి. ఈ విషమ పరిస్థితుల నుంచి ‘వాది’ని నివాస యోగ్యంగా మార్చడానికి ఎఆర్-రియాద్ అభివృద్ధి అధికార బృందం (ఎడిఎ) నడుం బిగించి, విజయవంతంగా ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసింది. పర్యావరణాన్ని పునరుద్ధరించడంలో ఇప్పుడీ పట్టణం ఎన్నో దేశాలకు కొత్త దారులు చూపుతోంది.
ఒక అందమైన నగరం...
పరిశ్రమల నుండి విడుదలయ్యే మురుగుకు ‘వాది’ లోయ డంప్‌యార్డ్‌గా మారింది. నిజానికి ‘వాది’ అంటే అరబిక్ సాహిత్యంలో ‘తోట’ అనే అర్థం ఉంది. 14వ శతాబ్దపు అరబ్ యాత్రికుడు ఇబ్నె మటుటా తన సాహిత్య గ్రంథంలో ఈ లోయ ప్రాంతంలో ఉన్న నగరాన్ని ‘ఒక అందమైన నగరం’గా అభివర్ణించారు. ఆ అందమైన నగరమే ఆ తర్వాత కాలంలో అంధవికారంగా మారింది. ఎడిఎ పునరుద్ధరణ ప్రాజెక్టు అమలు వల్ల ఈ ప్రాంతానికి పూర్వవైభవం వచ్చింది.
పూర్వ వైభవాన్ని ఇలా తెచ్చిన వైనం..
ఎడిఎతో పాటు మొరియా, తెషిమా, కెనడాకు చెందిన నెల్సన్ పర్యావరణ కేంద్రం రిస్టోరేషన్ ప్రాజెక్ట్ కింద ‘వాది హనిఫా’ (డబ్ల్యుహెచ్‌ఆర్‌పి) పునరుద్ధరణ పనులను చేపట్టాయి. వర్షాకాలంలో వచ్చే వరద నీరు పల్లానికి పోకుండా ముందుగా అడ్డంకులు ఏర్పరిచారు. ఈ లోయ భూభాగం చుట్టూర 50,000 రకాల మొక్కలు నాటి తోట పనులు మొదలుపెట్టారు. చెత్తను తొలగించి, నీటి శుద్ధి కార్య క్రమాలను చేపట్టారు. మూడు పెద్ద కొలనులలో విషపదార్థాలు, హానికరమైన బ్యాక్టీరియాను ఆహారంగా స్వీకరించే జీవ మొక్కలను ఏర్పాటు చేశారు. మానవ నివాసానికి నీటిపారుదల వసతులు కల్పించడానికి సురక్షిత చర్యలు చేపట్టారు. రియాద్ నదికి 35 కిలోమీటర్ల దిగువన వరదలను అడ్డుకోవడానికి చిన్న చిన్న ఆనకట్టలను ఏర్పాటు చేశారు. గుర్రపు డెక్క ఆకారంలో కుటుంబాల కోసం ‘పిక్నిక్ ప్యాడ్లు’ ఏర్పాటు చేశారు. సబ్‌మెర్జిడ్ ఏరియేషన్ వ్యవస్థను, ఫౌంటేయిన్లను ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకోవడానికి ప్రతి పాడ్‌కు ఒక పెద్ద కోర్టు, నీడలో విశ్రాంతికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లతో కిలోమీటర్ల పరిధిలో ‘వాది’ లోయలో పట్టణ విస్తరణ పునరుద్ధరించబడింది. పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నాలు వేగంవంతం చేశారు. దీంతో ఇక్కడకు పర్యాటకులు తమ కుటుంబాలతో సంవత్సరం పొడవునా సందర్శనకు వస్తున్నారు. అందవికారంగా మారిన లోయను అత్యద్భుతంగా మార్చడం వెనక జరిగిన కృషిని అందరూ ప్రశంసిస్తున్నారు.
‘వాదీ హనిఫా’ పునరుద్ధరణ పనులు దాదాపు పదేళ్లలో అద్బుతమైన ఫలితాన్ని చూపెట్టాయి. ఇప్పుడు వాదిలో 62 ఎకరాలలో 30,000 పామ్ చెట్లు ఏపుగా పెరిగాయి. దారంతా పచ్చని పచ్చిక, తొమ్మిది పార్కులు, 7.4 కి.మీ లలో ఐదు సరస్సులతో నేడు వాది హనీఫా అందరూ నివసించడానికి యోగ్యతను పొందింది. పర్యాటకులకు ఆకర్షణీయ స్థలంగా మారింది.