![కర్ణుడి దానగుణం... నిరుపమానం!](/styles/webp/s3/article_images/2017/09/5/51501092851_625x300.jpg.webp?itok=hHs7AHvG)
కర్ణుడి దానగుణం... నిరుపమానం!
ఆత్మీయం
కర్ణుడికి దానకర్ణుడని గదా పేరు. ఒకనాడు శ్రీకృష్ణుడు తెలతెలవారుతుండగనే కర్ణుని భవనానికి వెళ్లాడట. అప్పుడు కర్ణుడు అభ్యంగన స్నానానికి తయారవుతున్నాడు. తలకు నూనె రాసుకుంటున్నాడు. కర్ణునికి ఎడమ వైపు రత్నాలు పొదిగిన బహువిలువైన గిన్నె నూనెతో వున్నది. కృష్ణుడు వస్తూనే కర్ణా ఆ గిన్నె చాలా బాగున్నది నాకిస్తావా? అని అడిగాడు. వెంటనే కర్ణుడు తీసుకో కృష్ణా అంటూ ఎడమ చేత్తో ఆ గిన్నె యిచ్చాడు. కృష్ణుడు అదేమిటి కర్ణా ఎడమచేత్తో ఇస్తున్నావు? కుడిచేత్తో ఈయరాదా? అన్నాడు. అందుకు కర్ణుడు కృష్ణా! ఎడమ చేతిలోని గిన్నె కుడిచేతి లోకి తీసుకునే లోపే ఏమవుతుందో తెలియదు. లక్ష్మి చంచలమైనది. యముడా దయలేనివాడు.
మనస్సా మరుక్షణంలో ఎలా మారుతుందో తెలియదు. కనుక గిన్నె ఈ చేతి నుంచి ఆ చేతికి పోయే లోపలే ఏ మార్పైనా రావచ్చు. అందుకనే ధర్మకార్యాన్ని ఆ క్షణమే చెయ్యాలనే హితోక్తిననుసరించి ఇలా చేశాను. అన్నాడు. దీన్ని బట్టి కర్ణుడి వ్యక్తిత్వం ఎంతటి మహోన్నతమైనదో అర్థమవుతుంది. దానం విషయంలో సదా సాత్వికమే ప్రధానం చెయ్యాలనే సంకల్పం కలుగగానే ఆదరణ భగవదర్పణబుద్ధితో ఎలాంటి ఫలాపేక్ష లేకుండా రెండవ చేతికి కూడా తెలియనంత రహస్యంగా దానం చెయ్యాలి. దానం చేసి నేను చేశానని డప్పు కొట్టుకోకూడదు. ఏదైనా మంచి పని చెయ్యాలని అనిపించిన వెంటనే చేసెయ్యాలి ఆలస్యం విషం లాంటిది. అంటారు జ్ఞానులు. మనము కర్ణుడిలాగా వ్యవహరించ లేకపోయినా మన శక్త్యానుసారం సత్పాత్ర దానం చేయడం అలవరుచుకోవాలి.