ఒకే శబ్దం... ఒకే లయ అల్లాహ్ | The same sound ... Allah is the same rhythm | Sakshi
Sakshi News home page

ఒకే శబ్దం... ఒకే లయ అల్లాహ్

Published Fri, Aug 23 2013 12:55 AM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM

ఒకే శబ్దం... ఒకే లయ అల్లాహ్ - Sakshi

ఒకే శబ్దం... ఒకే లయ అల్లాహ్

 శబ్దం ఒక అపూర్వమైన, అనిర్వచనీయమైన మధురానుభూతి. ఈ ప్రకృతిలోని ఏ శబ్దమూ ఒకేలా ఉండదు. సృష్టిలోని అసంఖ్యాక జీవుల్లో దేని శబ్ద ప్రత్యేకత దానిదే. ఒక రకంగా చెప్పాలంటే ఈ సృష్టే ఒక సంగీత జలధి. ప్రకృతిలోని శబ్దాల ఆధారంగానే మానవుడు వివిధ రకాల శబ్ద ప్రక్రియలకు శ్రీకారం చుట్టాడు. ప్రాకృతిక, ప్రాపంచిక, ఆధ్యాత్మికపరంగా వివిధ శబ్ద ప్రక్రియలు మనకు సుపరిచితమే. ఆధ్యాత్మికతతోపాటు భాషాపరంగా చూస్తే, అరబ్బీ భాషలోని శబ్ద ప్రక్రియకు ఒక ప్రత్యేకత ఉంది. అరబ్బీ భాషాపండితులు విశ్వవ్యాప్తంగా ఎక్కడ ఉన్నప్పటికీ, ఒకేవిధమైన శబ్దప్రక్రియను అనుసరిస్తారు. పలకవలసిన విధంగా పదాలను ఉచ్చరించడం, రకాత్‌లను పారాయణ చేసే తీరును బట్టి శబ్దానికి ఇంపైన అలంకారం చేకూరుతుంది. ఇలా నియమబద్ధంగా, లయబద్ధంగా పారాయణ చేయడాన్ని ధార్మిక పరిభాషలో ‘తజ్‌వీద్’అంటారు.
 
  పారాయణాన్ని ‘ఖిర త్’ అని, పారాయణ చేసేవారిని ‘ఖారీ’ అంటారు. ఇస్లామ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఏ భాష మాట్లాడేవారైనా ఇదే నియమాన్ని పాటిస్తారు. ఇదేవిధంగా అరబ్బీ భాషలోని అల్లాహ్ అనే పదం. దీనికి మరో నిర్వచనం గానీ, సరిపోలిన మరో పదంగానీ లేదు. విశ్వవ్యాప్తంగా ఎక్కడైనా ఇదే పదం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ‘అల్లాహ్’ అన్న పదాన్ని సాధారణంగా దేవుడు, దైవం అంటాం. ఆంగ్లంలో గాడ్ అంటాం. ఇస్లామీయుల ప్రకారం సర్వసృష్టికర్తను ఒక్కోభాషలో ఒక్కోపేరుతో పిలుస్తూ ఉండవచ్చు. కానీ అన్ని భాషాపదాల్లో ‘అల్లాహ్’ అన్నది అత్యంత విలక్షణమైన పదం. విశ్వప్రభువుకు ఇది మాత్రమే అన్నివిధాలా శోభించే పదం. ఎందుకంటే, దేవుడు అన్న పదానికి బహువచనం దేవుళ్లు అవుతుంది. స్త్రీలింగం అయితే దేవత అయిపోతుంది. కనుక అల్లాహ్ అన్న పదం విశ్వవ్యాప్తమైనది.
 
 ప్రపంచవ్యాప్తంగా మహమ్మదీయులు సృష్టికర్తను సూచించే, పలికే ఏకైకపదం అల్లాహ్! ఇస్లామ్ మతాన్ని అనుసరించేవారు విశ్వవ్యాప్తంగా ఎక్కడ ఏ భాష మాట్లాడేవారైనా సరే తమ ప్రభువును అల్లాహ్ అని మాత్రమే పిలుస్తారు. అలాగే ‘అజాన్’, ‘నమాజ్’లు కూడా! ప్రతిరోజూ ఐదు పూటలు పలికే అజాన్‌లో, ఆచరించే నమాజ్‌లో ఎక్కడా ఒక్క అక్షరం కాదుకదా, ఒక కొమ్ము, ఒక ఒత్తు, కనీసం కామా, ఫుల్‌స్టాప్‌లలో కూడా తేడా ఉండ దు. ఒకేవిధమైన శబ్ద, భాష, భావతరంగం విశ్వవ్యాప్తంగా ఒకే తీరుగా, ఒకే లయలో అనుక్షణం ప్రతిధ్వనిస్తూ పుడమిపైన, ప్రకృతిలోని ప్రాణికోటిని పులకింపజేస్తూ ఉంటుంది. ఈ శిష్ట, విశిష్టపదబంధాల్లోని సుమధుర సంగీతఝరి విశ్వవ్యాప్తంగా హృదయాలను రంజింపజేస్తూ సృష్టికర్తకు చేరువ చేస్తూ ఉంటుంది. ఈ విశ్వజనీన ఆధ్యాత్మిక సంగీత మకరందాన్ని ఆస్వాదించి, ఆఘ్రాణించినవారు నిజంగానే ధన్యులు.  
 - యండి. ఉస్మాన్‌ఖాన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement