తాషీ మాలిక్, నాంగ్‌షి మాలిక్... అక్కాచెల్లెళ్లు... ఇంకా వివరంగా చెప్పాలంటే కవలలు... అయితే ఏమిటంట... అంటారా?...ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ అనూహ్యమైన ఎత్తులకు చేరుతున్నారు... సంకల్పబలంతో ప్రపంచంలోని ఎత్తై శిఖరాలను ధైర్యంగా అధిరోహిస్తున్నారు.
అది 1991, జూన్ 21వ తేదీ. ఉత్తరప్రదేశ్‌లో మీరట్ పట్టణంలో మిలటరీ హాస్పిటల్. మిలటరీ అధికారి వీరేంద్రసింగ్ మాలిక్ భార్య అంజు తాపా మాలిక్‌కు తాషీ, నాంగ్‌షి పుట్టారు. కొండెక్కినంత సంతోషపడ్డారు ఆ దంపతులు. ఆ పిల్లలు కూడా పెద్దయ్యాక ‘కొండలెక్కుతాం’ అన్నారు. తల్లి ససేమిరా అంది కానీ తండ్రి మాత్రం ‘మీ ప్రతి అడుగు వెనుక నేనున్నట్లే. ముందు అడుగు వేయండి’ అన్నాడు. ఈ కవల సోదరీమణులు ఇప్పటికే వివిధ ఖండాల్లోని నాలుగు ఎత్తై శిఖరాల మీద భారతీయ పతాకాన్ని ఎగురవేశారు.
ఇదీ నేపథ్యం!
హర్యానాకు చెందిన వీరేంద్రసింగ్ ఉద్యోగరీత్యా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, కేరళ, మణిపూర్‌లు చుట్టి డెహ్రాడూన్‌లో రిటైరయ్యారు. తండ్రితోపాటు ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ ఈ రాష్ట్రాలన్నీ తిరిగారు. వీటితోపాటు ఎడ్యుకేషన్ టూర్‌లు, యూత్ ఈవెంట్‌ల కోసం విదేశాల్లోనూ పర్యటించారు. భరతనాట్యం, పంజాబీ నాట్యం, సల్సా డాన్సు నేర్చుకున్నారు. ఇన్ని సరదాల్లో సరదాగా పర్వతారోహణలోనూ శిక్షణ తీసుకున్నారు.
జమ్ముకాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో సాహసక్రీడలైన స్కీయింగ్‌లో శిక్షణపొందారు. రెట్టించిన ఉత్సాహంతో శిఖరాల వైపు పయనాన్ని మొదలుపెట్టారు. ఇప్పటికి వేర్వేరు ఖండాల్లోని నాలుగు పర్వత శిఖరాలను అధిరోహించారు, మరో రెండు పర్వత శిఖరాలు వీళ్ల జాబితాలో ఉన్నాయి. ఆరు శిఖరాల అంచులను తాకిన తరవాత అంటార్కిటికా వైపు దృష్టి సారించనున్నారు.
భారత మహిళ శక్తికి ప్రతిరూపం!
నిండా పాతికేళ్లు లేవు, సాహస యాత్రలే లక్ష్యంగా సాగిపోతున్నారు తాషీ, నాంగ్‌షి. ‘ఈ శిఖరారోహణ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు’ అని అడిగితే ‘‘భారతీయ మహిళ లో అసమాన శక్తిసామర్థ్యాలు ఉన్నాయని ప్రపంచ దేశాలకు నిరూపించాలి. మేము సాధించిన లక్ష్యాలను చూసి భారతీయ మహిళ పెదవులపై చిరునవ్వు విచ్చుకోవాలి. ఆ స్ఫూర్తితో ముందుకు రావాలనేది మా కోరిక’’ అంటారు.
ఆహారపానీయాలు ఇలా!
ఎత్తుకి వెళ్లేకొద్దీ వాతావరణం అనేక మార్పులకు లోనవుతుంది. ఆ ప్రభావం దేహం మీద తప్పకుండా ఉంటుంది. వాతావరణానికి అనుగుణంగా అన్నపానీయాలలో మార్పులు తప్పనిసరి. ‘‘బేస్ క్యాంపు నుంచి పైకి వెళ్లే కొద్దీ ఘనాహారం తగ్గించి ద్రవాహారం పెంచుకోవాలి. ప్రోటీన్ బార్‌లు దగ్గరుంచుకోవాలి. ఆక్సిజన్ తగ్గేకొద్దీ శరీరం సహకరించడం మానేస్తుంటుంది. డయామాక్స్ లేదా ఆక్సిజన్ బార్ దగ్గర ఉంచుకోవాలి’’ అంటూ పర్వతారోహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారీ కవలలు.
వివక్ష ఉన్న చోట నుంచే ప్రతిభ!
‘‘మా నాన్నకు ముందు ముగ్గురు అమ్మాయిలు పుట్టారు. మా నాన్న పుట్టే వరకు అబ్బాయి కోసం ఎదురు చూశారట మా నానమ్మ, తాతయ్యలు. అలాగే నాన్నకు మేము పుట్టిన తర్వాత కూడా అబ్బాయి కోసం ఎదురుచూడమని ఒత్తిడి చేశారట. మా నాన్న ఆ ఒత్తిడికి తలవంచలేదు. నాన్నకు దూరదృష్టి, విశాల దృక్పథం ఉన్నాయి. ఆడపిల్ల అనే కారణంగా పరిమితులు విధించడం ఆయనకు నచ్చదు. ‘స్త్రీశక్తిని నిరూపించే అవకాశం మీ చేతిలో ఉంది, నిరూపించుకోండి’ అంటారు. ప్రసారమాధ్యమాలు సహకరిస్తే లింగవివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలనేదే మా ఆకాంక్ష’’ అంటున్నారు ఈ సోదరీమణులు.
ఈ పర్వతారోహకులిద్దరూ ‘మేము సాధించాం, మీరూ అడుగు ముందుకు వేయండి’ అంటూ యువతులలో స్ఫూర్తిని నింపుతున్నారు. వివక్షరహిత సమాజం కావాలంటూ సమాజాన్ని ఆలోచింపచేస్తున్నారు.
- వాకా మంజులారెడ్డి
అధిరోహించిన శిఖరాలు...
మౌంట్ ఎల్‌బ్రస్ (18,541 అడుగులు), యూరప్‌లో ఎత్తై శిఖరం
మౌంట్ అకాంకాగువా (22, 837 అడుగులు) దక్షిణ అమెరికాలో ఉంది. రెండు అమెరికాల్లోనూ ఇదే ఎత్తై శిఖరం.
మౌంట్ ఎవరెస్టు ఎత్తు 29, 029 అడుగులు
మౌంట్ కిలిమంజారో (ఆఫ్రికాలో ఎత్తై శిఖరం) 19, 640 అడుగులు
అధిరోహించనున్న శిఖరాలు...
మౌంట్ కార్సెంటెంజ్ పిరమిడ్ (16, 024) ఇండోనేసియా
మౌంట్ మెక్‌కిన్లె (20,234 అడుగులు) అలాస్కా, అమెరికా
మౌంట్ విన్‌సన్ మాసిఫ్ (16, 050) అంటార్కిటికా
ఈ అక్కాచెల్లెళ్లు ఎక్కని ఎత్తుల్లేవు!
Published Thu, Mar 27 2014 10:26 PM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM
Advertisement
Advertisement