ది స్టోరీ రిపీట్స్
బాలీవుడ్ శ్రీమంతుడు...
కోటీశ్వరుడైన తండ్రితో ఎడం పాటించే కొడుకుగా ఇటీవల ‘శ్రీమంతుడు’లో మహేష్‌బాబు కనిపిస్తాడు. కాని దీని కంటే ముందే బాలీవుడ్‌లో ‘షరాబీ’ (1984) ఇదే కథాంశంతో వచ్చింది. కోట్లాది ఆస్తికి వారసుడైన అమితాబ్ తండ్రి ప్రేమకు అలమటించి డబ్బు సంపాదనలో బిజీగా ఉండే ఆ తండ్రి (ప్రాణ్) పట్ల వ్యతిరేకత పెంచుకుని తాగుబోతుగా మారతాడు. దీనికి హాలీవుడ్‌లోని సూపర్ డూపర్ హిట్ సినిమా ‘ఆర్థ్రర్’ (1981) మూలం అని అంటారు. షరాబీలో మొదటిసారిగా జయప్రద అమితాబ్ పక్కన నటించింది. బప్పి లహరి చేసిన పాటలన్నీ భారీ హిట్స్‌గా మోగాయి. వీటిలో ‘దే దే ప్యార్ దే ’... ‘మంజిలే అప్‌నీ జగా’,.. ‘ఇంతెహా హోగయి ఇంతెజార్‌కీ’... పాటలు ఇప్పటికీ రేడియోలో మోగుతుంటాయి.
ఇంకో విశేషం కూడా ఉంది. దీని దర్శకుడైన ప్రకాష్ మెహ్రా ఈ కథను అమితాబ్‌కు చెప్పినప్పుడు చాలా బాగుంది కాని కొన్ని సీన్లు తగ్గించి తీసుకురా అన్నాడట అమితాబ్. ఎందుకు అని అడిగితే- ఇందులో నాది తాగుబోతు పాత్ర. ప్రతి డైలాగ్‌ను తాగిన మత్తులో ఉన్నవాడిలా నెమ్మదిగా చెప్పాలి. డ్యూరేషన్ పెరుగుతుంది. సీన్లు తక్కువ చేస్తే మొత్తం నిడివి సరిపోతుంది అన్నాట్ట. క్రాఫ్ట్ మీద అమితాబ్ కమాండ్‌కు అంత పెద్ద దర్శకుడు కూడా నోరెళ్లబెట్టక తప్పలేదు. అన్నట్టు ఈ సినిమాలోని ఫస్ట్‌హాఫ్‌ను చిరంజీవి నటించిన ‘కిరాతకుడు’కు ఉపయోగించుకున్నారు. ప్రాణ్ పాత్రను జగ్గయ్య పోషిస్తే తాగుబోతు అమితాబ్‌గా చిరంజీవి తెల్లజుబ్బాలో బాటిల్ పట్టుకుని కనిపిస్తారు. ఆ సినిమా ఫలితం ఏమయ్యిందో ప్రేక్షకులకు తెలుసు.