హరిత విజయం... | The success of the green ... | Sakshi
Sakshi News home page

హరిత విజయం...

Published Wed, Apr 23 2014 10:25 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

హరిత విజయం... - Sakshi

హరిత విజయం...

ఒక సంస్థ నలుగురికీ తెలిసేందుకు నాలుగేళ్లు సరిపోయేంత సమయం కావచ్చు. కానీ గెలవడానికి అది సరిపోయే సమయమేనా? అది కూడా వినూత్న వ్యాపార పంధాలో వెళితే... అంత స్వల్ప కాలం ఏ మూలకు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తాడు సూర్యదేవర విజయ్ భాస్కర్.
 
కృష్ణా జిల్లాలోని మారుమూల ఘంటసాల మండలం కొడాలి గ్రామానికి చెందిన ఓ చిన్న రైతు కొడుకు ఈ మూడు పదుల యువకుడు. ఇతనికీ, హైదరాబాద్‌లోని  పలు ప్రతిష్ఠాత్మక నిర్మాణాలకీ మధ్య ఉన్న సంబంధం... ఓ వైవిధ్యభరితమైన ఆలోచనకూ, అది సాధించే విజయానికీ ఉన్న సంబంధం లాంటిది. ఈ విజయ ప్రస్థానం గురించి అతని మాటల్లోనే...
 
భారీ ప్యాకేజీని కాదనుకుని...

ఇంజినీరింగ్ పూర్తి చేసిన వెంటనే బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా మంచి ప్యాకేజీతో ఉద్యోగం. ఆ తర్వాత షార్ట్‌టైమ్‌లోనే అమెరికాలో నాలుగురెట్లు జీతంతో మరో ఉద్యోగం. ఇలాంటి పరిస్థితుల్లో మరొకరైతే ఇంతకన్నా ఏం కావాలనుకునేవారో, అంతకన్నా మరింత జీతం ఇచ్చే కంపెనీని అన్వేషించేవారో కానీ నేను మాత్రం అలా అనుకోలేదు. నెలకు లక్షల రూపాయల జీతం గొప్పగా అనిపించక ఉద్యోగానికి రాజీనామా చేశాను. అమెరికా వదిలేశాను.
 
తిరిగి విద్యార్థిగా...
 
విజయవంతమైన వ్యాపార వేత్తగా రాణించడానికి అందరూ ముందు పెట్టుబడి కావాలనుకుంటారు. నేను మాత్రం వ్యాపార పరిజ్ఞానం కావాలనుకున్నాను. ఎందుకంటే కొత్త ఆలోచన ఉంటే పెట్టుబడి అదే నడిచొస్తుంది. ఒక కొత్త ఆలోచన అంకురించాలంటే నడుస్తున్న వ్యాపార విధానాలపై పూర్తి అవగాహన అవసరం.  హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జేరాను. కోర్సు పూర్తవుతుండగానే ఆలోచనలకు ఓ రూపం వచ్చింది. దాని పేరే ‘గ్రీన్ బిల్డింగ్ మెటీరియల్’.
 
నగరాలను కాంక్రీట్ భవనాల కీకారణ్యాలుగా పిలుస్తున్నారంటే దానికి కారణం ప్రస్తుత నిర్మాణశైలి. దీన్నే మార్చాలనుకున్నాను. పర్యావరణానికి హాని కలిగించని ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్ మెటీరియల్‌ను అందించే మార్గంలో వేసిన తొలి అడుగే ఎఎసి బ్లాక్స్ ఇటుకలు. సంప్రదాయ ఇటుకల తయారీ వల్ల అత్యధికంగా విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ ఈ ఇటుకల తయారీలో కనీసస్థాయికి పరిమితం అవుతుంది.  మేము తయారు చేసే పర్యావరణహిత ఇటుకలు ఫ్లైయాష్‌తో తయారవుతాయి. దీంతో పరిశ్రమలు వెలువరించే కాలుష్యాన్ని అరికట్టేందుకు కూడా ఇది ఉపకరిస్తుంది. మరోవైపు భవనాలలో చల్లదనాన్ని కాపాడుతాయి, వీటి జీవితకాలం కూడా మెరుగ్గా ఉంటుంది. అనేక అంతస్థులతో కూడిన ఎత్తై భవనాలకు ఈ రకమైన ఇటుకలు వాడడం అవసరం కూడా. దీంతో బ్యాంకులు, సన్నిహితులు అందించిన ఆర్థిక సహకారంతో వీటి తయారీకి శ్రీకారం చుట్టాం.
 
‘విజయ’బావుటా...

వైవిధ్యభరితమైన ఆలోచనకు ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్ (టై) ఐఎస్‌బీ కనెక్ట్ ‘బిజ్‌క్వెస్ట్’ అవార్డుల లాంటి పురస్కారాలను అందుకోగలిగాం. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో సంప్రదాయ ధోరణికి భిన్నంగా ఉత్పత్తి చేసిన తక్కువ బరువున్న ఎఎసి బ్లాక్స్ వినియోగదారుల ఆదరణ చూరగొన్నాయి. నందిగామలో మా పరిశ్రమ శరవేగంగా విస్తరించింది. చెన్నై, బెంగుళూరు వంటి నగరాలకూ ఎగుమతి చేస్తున్నాం. హైదరాబాద్ ఎల్ అండ్ టి తమ మెట్రోరైల్ నిర్మాణాల కోసం మా ఇటుకలను వినియోగించడం గొప్ప విజయం. దేశంలోనే ఒక పౌర సదుపాయ ప్రాజెక్ట్‌కు ఈ తరహా ఇటుకలు వాడడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రత్యక్షంగా, పరోక్షంగా 300 మందికి ఉపాధి కల్పిస్తున్నాం.  
 
ఉచిత పత్రిక పంపిణీ...
 
వ్యాపారం, లాభాలు ఇదొక్కటే ధ్యేయం కాదు. రేపటి తరాలపై పర్యావరణ కాలుష్య దుష్ర్పభావాలు పడకుండా చూడాలనేది మాకు మేము పెట్టుకున్న స్వచ్ఛంద లక్ష్యం. పర్యావరణ హిత భవన నిర్మాణాలు పెరగాలంటే ముందుగా వినియోగదారుల్లో  అవగాహన పెరగాలి. అందుకే ప్రైమ్ ఇన్‌సైట్స్ పేరుతో నిర్మాణ రంగానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో  మేగజైన్‌ను ప్రచురించి పూర్తి ఉచితంగా పంపిణీ చేయనున్నాం. ఇటుకలు మాత్రమే కాకుండా హరిత భవనాల నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల ముడి ఉత్పత్తులనూ  అందించే పూర్తిస్థాయి పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమవుతున్నాం’’ అంటూ ముగించారు విజయ్. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తన కార్పొరేట్ ఆఫీసులో  కంపెనీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న విజయ్... నవతరం కలలకే కాదు, కష్టపడేతత్వానికీ నిదర్శనంలా కనిపించారు.
 - ఎస్.సత్యబాబు
 
 విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణించడానికి అందరూ ముందు పెట్టుబడి కావాలనుకుంటారు. నేను మాత్రం వ్యాపార పరిజ్ఞానం కావాలనుకున్నాను. ఎందుకంటే కొత్త ఆలోచన ఉంటే పెట్టుబడి అదే నడిచొస్తుంది.
 - విజయ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement