యువత ఆన్‌లైన్ ప్రపంచంలోకి....
పుస్తక పరిచయం
పుస్తకాన్ని రాసే క్రమంలో రిపోర్టర్, సామాజికవేత్త, సాంకేతిక నిపుణురాలు, మానసిక విశ్లేషకురాలు... ఇలా రకరకాల అవతారాలు ఎత్తారు రచయిత్రి.
‘‘వీళ్లను ఒక పట్టాన అర్థం చేసుకోలేం’’ అని అప్పుడప్పుడూ అంటుంటారు పెద్దలు యువత ధోరణులను పరిశీలిస్తూ. సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగిన తరువాత ఈ అర్థం చేసుకోవడమనే వ్యవహారం మరింత క్లిష్టంగా మారింది. సోషల్ మీడియా వల్ల యువతకు మంచి జరగుతుందా? చెడు జరుగుతుందా? అనే చర్చ తీవ్రమైంది. అయితే ఈ చర్చలో ఏకపక్ష వాదనలే ఎక్కువగా వినిపించేవి. సాధికారికమైన సమాచారం ఆధారంగా చేసే వాదన తక్కువగా ఉండేది. ఈ నేపథ్యంలో డోన బోయ్ రాసిన ‘ఇట్స్ కాంప్లికేటెడ్...ది సోషల్ లివ్స్ ఆఫ్ నెట్ వర్క్‌డ్ టీన్స్’ పుస్తకం యువత ఆన్‌లైన్ మనస్తత్వాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ఉపయోపడుతుంది.
న్యూయార్క్ యూనివర్శిటీ... డిపార్ట్‌మెంట్ ఆఫ్ మీడియా, కల్చర్ అండ్ కమ్యూనికేషన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు డోన. మైక్రోసాఫ్ట్‌లో ప్రిన్సిపల్ రిసెర్చర్‌గా కూడా ఆమెకు అనుభవం ఉంది.
ఏడు సంవత్సరాల పాటు ఎన్నో కోణాలలో అధ్యయనం చేసి డోన రాసిన పుస్తకం ఇది. దీనికోసం వందలాది మంది టీనేజర్లను ఇంటర్వ్యూ చేశారు. దినచర్య మొదలు మనస్తత్వ పరిశీలన వరకు యువతకు సంబంధించిన రకరకాల ధోరణులను లోతుగా అధ్యయనం చేశారు. టెక్ట్స్ మెసేజ్‌లు, యూ ట్యూబ్ సినిమాలు, ట్విట్టర్, ఫేస్‌బుక్ అప్‌డేట్‌లు, సెల్ఫీలు...ఇలా యువత ఆన్‌లైన్ జీవితాన్ని లోతుగా విశ్లేషించారు.
‘‘సోషల్ మీడియా వల్ల యువత నష్టపోతుందనే ప్రచారం... అవసరానికి మించి ఎక్కువగా జరుగుతోంది. సోషల్ మీడియా వల్ల లాభమే తప్ప నష్టమేది లేదు’’ అంటున్నాడు డోన ఇంటర్వ్యూ చేసిన స్టాన్ అనే విద్యార్థి. ఒకే కోణంలో కాకుండా సోషల్ మీడియా వల్ల యువతకు జరుగుతున్న నష్టాలతో పాటు ప్రయోజనాలను కూడా డోన చెప్పారు.
పుస్తకాన్ని రాసే క్రమంలో రిపోర్టర్, సామాజికవేత్త, సాంకేతికనిపుణురాలు, మానసిక విశ్లేషకురాలు...ఇలా రకరకాల అవతారాలు ఎత్తారు రచయిత్రి. అందుకే పుస్తకానికి నిండుదనం వచ్చింది. ‘ఇట్స్ కాంప్లికేటెడ్...’ పుస్తకానికి విమర్శకుల నుంచి ‘కనువిప్పు కలిగించే పుస్తకం’ (ఐ-ఓపెనింగ్ బుక్), ‘తల్లిదండ్రులు, యువత మాత్రమే కాదు, అన్ని వర్గాల వారు చదవాల్సిన పుస్తకం’ అనే ప్రశంసలు లభించాయి.