లో ఫోడ్‌మ్యాప్ ఆహారంతో ఇవీ ప్రయోజనాలు...
పరిపరి శోధన
కొందరిని ఐబీఎస్, కింది నుంచి గ్యాస్ పోవడం సమస్యలు విపరీతంగా బాధిస్తుంటాయి. ఈ రెండు సమస్యలను చాలావరకు ఆహారంతోనే నివారించవచ్చు అంటున్నారు అధ్యయన వేత్తలు. తిన్న వెంటనే విరేచనానికి వెళ్లాల్సి రావడం, కడుపునొప్పిగా అనిపించడం వంటి సమస్య అయిన ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ , నలుగురిలో చాలా ఇబ్బందిగా అనిపించే కింది నుంచి మాటిమాటికీ గ్యాస్ పోతుండటం వంటి సమస్యలకు ‘లో ఫోడ్‌మ్యాప్’ డైట్ సమర్థంగా పనిచేస్తుందంటున్నారు పరిశోధకులు. ‘ఫర్మెంటబుల్ ఆలిగోశాకరైడ్స్ , డైశాకరైడ్స్ , మోనో శాకరైడ్స్ అండ్ పాలీయాల్స్ ’ అనే రకాల ఆహార పదార్థాల మొదటి అక్షరాలను (ఇంగ్లిష్‌లోని) చేర్చడం ద్వారా ‘ఫోడ్‌మ్యాప్’ అనే మాటను రూపొందించారు.
ఆయా పోషకాల నిర్మాణాన్ని బట్టి, వాటిలోని చక్కెర పదార్థాలను బట్టి ఆ ఆహారాలను అలా పిలుస్తుంటారు. లో ఫోడ్ మ్యాప్ ఆహారం అంటే ఫర్మెంటబుల్ ఆలిగోశాకరైడ్స్, డై శాకరైడ్స్, మోనోశాకరైడ్స్, పాలీయాల్స్ తక్కువగా ఉండే ఆహారాలు అన్నమాట. ఐబీఎస్, కింగడినుంచి గ్యాస్ పోయేవారికోసం ఫోడ్‌మ్యాప్ తక్కువగా ఉండేలా డైట్ చార్ట్ రూపొందించారు ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌కు చెందిన మోనాష్ యూనివర్సిటీ ఆహార నిపుణులు. ఫోడ్‌మ్యాప్ డైట్ చార్ట్ ప్రకారం...
మనం అసలు తీసుకోకూడని ఆహారాలు... పాస్తా, కేక్స్, బిస్కెట్లు, పండ్లలో పీయర్స్, ప్రూన్, పీచెస్, చెర్రీస్ వంటివి, ఆకుకూరలలో బ్రకోలీ, కాలీఫ్లవర్, ఉల్లి, వెల్లుల్లి, బీట్‌రూట్, పప్పులలో బీన్స్, సోయాబీన్స్ మొదలైనవి.
తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు... వరి అన్నం, ఓట్స్, గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ (ఇక్కడ గ్లూటెన్ ఫ్రీ అంటే లో ఫోడ్‌మ్యాప్ అని పొరబడకూడదు); పండ్లలో అరటి, నేరేడు, ద్రాక్ష, కీవీ, నిమ్మ, బత్తాయి, నారింజ, బొప్పాయి, పైనాపిల్, స్ట్రాబెర్రీలు; ఆకుకూరలలో క్యారట్, దోస, అల్లం, మిరియాలు, లెట్యూస్, ఆలూ, పాలకూర, టొమాటో వంటివి. ప్రోటీన్లలో చికెన్, ఫిష్, టోఫూ, నట్స్‌లో పల్లీలు, వాల్‌నట్స్ తీసుకోవచ్చు. ఐబీఎస్, కింది నుంచి గ్యాస్‌పోవడం ద్వారా బాధపడేవారిని ఎంపికచేసిన ఆస్ట్రేలియా పరిశోధకులు పైన పేర్కొన్న ‘లో-ఫోడ్‌మ్యాప్ డైట్’ ఇవ్వడం వల్ల 74 శాతం మందిలో మంచి ఫలితాలు కనిపించాయని పేర్కొన్నారు. ఈ అధ్యయన ఫలితాలు లండన్ కింగ్స్ కాలేజీ నిపుణులనూ ప్రభావితం చేయడంతో బ్రిటన్‌లోని చాలా మందికి సైతం లో ఫ్యాడ్‌మ్యాప్ ఆహారం సిఫార్సు చేశారు. యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్ నిర్వహించిన మరో అధ్యయనంలో సైతం కూడా పై సమస్యలకు లో ఫాడ్‌మ్యాప్ మంచి రిలీఫ్‌ను ఇచ్చిందని తేలింది. ఈ డైట్‌ప్లాన్‌ను అనుసరించడంతో పాటు ఎక్కువ మొత్తాలలో అదేపనిగా తినడం, కెఫిన్, ఆల్కహాల్‌ను తగ్గించడం అవసరమని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. ఈ అధ్యయన ఫలితాలన్నీ ‘జర్నల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురిత మయ్యాయి.