ఒక ఊరిలో ఓ పెద్దాయన ఉండేవాడు. విశ్రాంత ఉపాధ్యాయుడు కావడంతో అల్లరి చిల్లరగా తిరుగుతున్న పిల్లలను చేరదీసి వారికి నాలుగు అక్షరం ముక్కలు చెప్పి మంచిదారిలో పెట్టేందుకు ప్రయత్నించేవాడు.పూర్వులు ఆయుర్వేద వైద్యులు కావడంతో తన దగ్గరకు వచ్చే పేద వారి చిన్నాచితకా రోగాలకు ఉచితంగా మందులు ఇచ్చి, ఉపశమనంగా మంచిమాటలు చెప్పేవాడు. ఆయనిచ్చే మందులకన్నా, అనునయపూర్వకంగా ఆయన చెప్పే మాటలు వారికి ధైర్యాన్నిచ్చేవి. దాంతో ఆయా రోగాలు తొందరగా తగ్గిపోయేవి. ఓ రోజు ఆయన దగ్గరకు తేలుకుట్టిందని ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతున్న ఒక బాలుణ్ణి తీసుకొచ్చారు ఊరిలో జనం. పంతులుగారు పూజామందిరంలోకెళ్లి దేవుళ్ల పటాల ముందు రాలిపడి ఉన్న పసుపు, విభూది, గంధం వంటివాటిని పోగుచేసి, బాలుడికి తొందరగా తగ్గించమని కోరుతూ దేవుడికి దణ్ణం పెట్టుకుని వచ్చి ఏవో మంత్రాలు చదువుతున్నట్లు పెదవులు కదిలిస్తూ ఆ పిల్లాడికి తేలుకుట్టిన చోట రాసి, వెంటనే తగ్గిపోతుందిలే అంటూ ధైర్యం చెప్పాడు. నిజంగానే కాసేపటికల్లా ఆ పిల్లాడికి నొప్పి తగ్గిపోవడంతో పిల్లాడి తల్లి, కూడా వచ్చినవాళ్లు వెళ్లి ఆ విషయాన్ని ఊరంతా చెప్పారు.
అప్పటినుంచి ఆ పెద్దాయన తేలుకాటుకు మందు ఇస్తాడన్న పేరొచ్చింది. దాంతో ఎవరికి తేలుకుట్టినా సరే, ఆ పెద్దాయన దగ్గరకు తీసుకురావడం, ఆయన పూజామందిరంలోని విభూతి, పసుపు గాయానికి రాయడం, వాటినే ఓ చిటికెడు గ్లాసు నీటిలో కలిపి తాగించేవాడు. చిత్రంగా వారికి ఆ బాధ తగ్గిపోయేది. వారు ఆయనకు తృణమో పణమో ఇచ్చివెళ్లేవారు. ఆ మంత్రాన్ని తమకు చెప్పమని కొందరు, ఆ మందు తయారీ విధానాన్ని తమకు నేర్పమని పెద్దాయన చుట్టూ తిరిగేవారు. ఓ రోజున ఈ పెద్దాయనకు పాము కరిచింది. తనకు ఏ మంత్రమూ రాదని, ఏ మందూ తెలియదని, బాధితులకు త్వరగా నయం కావాలని కోరుకుంటూ ఉట్టి పసుపు నీళ్లే ఇస్తానని, తనను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లమని ఊరిలో వాళ్లని బతిమాలుకుంటేగానీ జనాలు ఆయనని ఆసుపత్రికి తీసుకువెళ్లలేదు. ఆస్పత్రిలో ఇచ్చిన మందులతో తొందరలోనే కోలుకుని ఇంటికి వచ్చాడు పెద్దాయన. ఆ తర్వాత ఎవరికైనా ఏదైనా జబ్బు వచ్చినా, తేలుకుట్టినా ఈయన దగ్గరకు తీసుకు వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. ఒకవేళ తీసుకు వచ్చినా కూడా వారికి తగ్గేది కాదు. అందుకే అన్నారు వైద్యం, మంత్రం, పూజ, జపం వంటివి నమ్మకం ఉంటేగానీ ఫలించవని...
– డి.వి.ఆర్.
పారని మంత్రం... లొంగని రోగం
Published Sat, Oct 20 2018 12:41 AM | Last Updated on Sat, Oct 20 2018 12:41 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment