అవి కిడ్నీ ఇన్ఫెక్షన్‌కు సూచనలు కావచ్చు..! | They may be signs of kidney infections ..! | Sakshi
Sakshi News home page

అవి కిడ్నీ ఇన్ఫెక్షన్‌కు సూచనలు కావచ్చు..!

Published Tue, Apr 5 2016 10:57 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

They may be signs of kidney infections ..!

హోమియో కౌన్సెలింగ్

 

నా వయసు 45. నాది మార్కెటింగ్ జాబ్ కావడం వల్ల వృత్తిరీత్యా సిటీ అంతా తిరగవలసి వస్తుంది. ద్విచక్రవాహనంలో ప్రయాణం చేస్తుంటే తలనొప్పి, తలతిరగడం, నోరు ఎండిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. దయచేసి నా సమస్యలకు హోమియోలో ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పగలరు.  - టి.వి.ప్రమోద్, మహబూబ్‌నగర్

 వేసవిలో ఎండలో ఎక్కువగా తిరిగినప్పుడు అలా కావడం సహజమే. వడదెబ్బ తగిలిందంటే ఇంకా చాలా సమస్యలు వస్తాయి. మెదడులో థెర్మోరెగ్యులేటర్ అనే కేంద్రం ఉంటుంది. ఇది ఎండలోకి వెళ్లినప్పుడు శరీరాన్ని చల్లబరచే ప్రయత్నం చేస్తుంది. విఫలమై నప్పుడు శరీరం వేడెక్కి, ఒళ్లంతా చెమటలు పట్టడం మొదలవుతుంది. దాంతో శరీరంలోని నీరంతా బయటికి వెళ్లిపోతుంది. అలా ఒంట్లో ఉన్న నీటిలో 25 శాతానికి మించి నీరు బయటకు వెళ్లిపోవడాన్ని డీ హైడ్రేషన్ అంటారు. డీ హైడ్రేషన్ ప్రభావం అందరి మీదా ఒకేలా ఉండదు. వయసు పైబడిన వారు, పసిపిల్లలు, మధుమేహవ్యాధిగ్రస్థులు డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డీ హైడ్రేషన్‌కు గురయినప్పుడు పొటాషియం తగ్గిపోయి కండరాల నొప్పులు, కండరాల బలహీనత ఏర్పడుతుంది. ఒక్కోసారి కాళ్లూ చేతులూ చచ్చుబడిపోతాయి.


కారణాలు: మద్యపానం, కూల్ డ్రింక్స్, మసాలాలు అతిగా తీసుకోవడం, తగిన నీరు తాగకపోవడం వల్ల, రేడియేషన్, కీమోథెరపీ తీసుకుంటున్న క్యాన్సర్, హెచ్.ఐ.వి బాధితులు, మొండి జబ్బులు ఉన్న వారు కూడా డీ హైడ్రేషన్‌కు త్వరగా గురవుతారు.

 
లక్షణాలు: తలనొప్పి, కండరాలనొప్పి, అలసట, నీరసం, కొద్దిపాటి జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, కళ్లు మండటం, శరీరం వేడెక్కటం

జాగ్రత్తలు: బయటికి వెళ్లేటప్పుడు, నీరు, పళ్లరసాలు, ఓఆర్‌ఎస్ ద్రావణాలు వెంటపెట్టుకుంటే డీ హైడ్రేషన్ బారిన పడరు. పళ్లరసాలు, మజ్జిగ, కొబ్బరినీళ్లు వంటి ద్రవాలు తీసుకోవాలి. రెండు మూడు లీటర్ల నీటిని అదనంగా తాగాలి. లేత రంగులు, వదులు దుస్తులు, ప్రత్యేకించి కాటన్ దుస్తులు ధరించడం శ్రేయస్కరం.


నిర్ధారణ: రక్తపరీక్షలు, బిఎమ్‌ఐ, బియూఎన్, సీబిసి

 
హోమియో చికిత్స: డీహైడ్రేషన్‌కు హోమియోపతిలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి శారీరక, మానసిక లక్షణాలను అనుసరించి మందులను డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి.

 

డాక్టర్ మురళి  కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి హైదరాబాద్

 

పీడియాట్రిక్ కౌన్సెలింగ్

 

మా బాబుకు పన్నెండేళ్లు. ఇప్పటికీ పక్కతడుపుతూనే ఉన్నాడు. రాత్రిళ్లు ప్రతి రెండు గంటలకోసారి మూత్రవిసర్జనకంటూ మమ్మల్ని నిద్రలేపుతుంటాడు. పగలు కూడా చాలా ఎక్కువసార్లే మూత్రానికి వెళ్తున్నాడు. మాకు తగిన సలహా ఇవ్వండి. - దీప్తి, ఆదిలాబాద్


మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ బాబు కండిషన్‌ను ఇంక్రీజ్‌డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అని చెప్పవచ్చు. ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్తుంటే అతడికి పాలీయూరియా అన్న కండిషన్ కూడా ఉందేమోనని అనుమానించాలి. ఈ సమస్యకు  కారణాలూ ఎక్కువే. అందులో కొన్ని ముఖ్యమైనవి... నీళ్లు ఎక్కువగా తాగడం, యూరినరీ ఇన్ఫెక్షన్స్, మానసిక సమస్యలు, ఎండోక్రైన్ సమస్యలు, యూరినరీ బ్లాడర్ డిజ్‌ఫంక్షన్, దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు, మలబద్దకం వంటివి. అతడి సమస్యకు కచ్చితమైన కారణాన్ని తెలుసుకోడానికి కంప్లీట్ యూరిన్ అనాలిసిస్, 24 గంటల్లో అతడు విసర్జించే మూత్రపరిమాణం పరీక్షలతో పాటు యూరిన్ ఆస్మనాలిటీ, అల్ట్రాసౌండ్ ఆఫ్ కేయూబీ పరీక్షలు చేయించాలి. ఇలాంటి పిల్లల్లో సాధారణంగా సాయంత్రం నుంచి రాత్రివరకు నీళ్లు ఎక్కువగా తాగకుండా చూడటం, తియ్యటి పదార్థాలను ఎక్కువగా తీసుకోకుండా చూడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో పాటు యూరిన్ పాస్ చేసేటప్పుడు విసర్జన పూర్తిగా చేసేలా చూడటం ప్రధానం. ఇలాంటి మంచి విసర్జక అలవాట్లతో ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. అయితే పైన పేర్కొన్న కారణాలలో ఏవైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు అన్ని  మూత్రపరీక్షలు (కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్) చేయించండి. మీరు ఒకసారి మీ పిల్లల వైద్యనిపుణుడిని సంప్రదించండి.

డా. రమేశ్‌బాబు దాసరి  సీనియర్ పీడియాట్రీషియన్,\ రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ,   హైదరాబాద్

 

కిడ్నీ కౌన్సెలింగ్

నా వయసు 38 ఏళ్లు. నాకు గత కొన్నిరోజుల నుంచి మూత్రవిసర్జన సమయంలో మంటగానూ, నొప్పిగానూ ఉంటోంది. అప్పుడప్పుడూ జ్వరం వస్తోంది. వాంతి వచ్చేలా అనిపిస్తోంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని మందులు రాసిచ్చారు. ఒక వారం పాటు వాడినప్పటికీ ఎలాంటి మార్పూ లేదు. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి.    - భద్రం, రాజమండ్రి

మీరు తెలిపిన లక్షణాలను బట్టి చూస్తుంటే మీకు కిడ్నీలో గానీ, యూరినరీ బ్లాడర్‌లో గానీ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు అనిపిస్తోంది. మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు సాధారణంగా బ్యాక్టీరియా మన శరీరంలోకి దూరి ఇన్ఫెక్షన్‌ను కలిగిస్తుంది. ఒక్కోసారి కిడ్నీలోకి కూడా ప్రవేశిస్తుంది. ఈ క్రమంలో కిడ్నీ ఇన్ఫెక్షన్ చోటు చేసుకుంటుంది. అంతేకాకుండా శరీరక సంబంధాల ద్వారాగానీ, షుగర్ వ్యాధి వల్లగానీ ఈ కిడ్నీ లేదా యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒకవేళ ఈ సమస్య కొన్ని నెలలపాటు నుంచి మిమ్మల్ని బాధపెడోతందంటే మీ కిడ్నీలో రాళ్లు లేదా మూత్రనాళంలో సమస్య ఉన్నట్లు అనుమానించాల్సి ఉంటుంది. మీకు జ్వరం కూడా వస్తోందని రాశారు. వాంతులు అవ్వడం లేదంటున్నారు. మరి నడుం పైభాగంలో మీకు ఎలాంటి నొప్పి గానీ అనిపించడం లేదా? తరచూ మూత్రం రావడం, నొప్పి లేదా మంట పుట్టడం లాంటి లక్షణాలతో కిడ్నీ లేదా యూరినరీ బ్లాడర్ సమస్యను కనుగొనలేము. అలాగే మూత్రం, ఎక్స్‌రే లాంటి పరీక్షల ద్వారా కూడా తెలుసులేము. ఇక మీకు మామూలుగా జ్వరం ఉండి, కాస్త నొప్పి, మంటతో బాధపడుతూ ఉండి, బాగానే తింటూ, నీరు తాగుతూ, ద్రవాహారం తీసుకోగలుతున్నారంటే కొన్ని యాంటీబయాటిక్స్ వాడితే సరిపోతుంది. కానీ మీకు వంద డిగ్రీలపైగా జ్వరం ఉండి, విపరీతమైన నొప్పి లేదా మంటతో బాధపడుతూ, ఏమీ తినలేకపోవడం, తాగలేకపోవడం లాంటి లక్షణాలుంటే మాత్రం మిమ్మల్ని వెంటనే ఆసుపత్రిలో చేర్చి, మీకు డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందించాల్సి ఉంటుంది.


మీకు యాంటీబయాటిక్స్ ఇవ్వడంతో పాటు, ఐవీ ఫ్లుయిడ్స్ ఎక్కిస్తారు. కిడ్నీలో ఉండే ఇన్ఫెక్షన్‌ను సమూలంగా తీసేస్తారు. దీనికి రెండు వారాల సమయం పడుతుంది. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో ఉండే మలినాలు తొలగిపోతాయని ఇచ్చే సలహా మంచిదే గానీ బ్యాక్టీరియా ద్వారా కిడ్నీకి కలిగే తీవ్రమైన నష్టం గురించి చాలామందికి తెలియదు. అందుకే ఇలాంటి చిన్నపాటి హెచ్చరికలు వచ్చినప్పుడు సరైన పరీక్షలు చేయించుకొని తగిన చికిత్స తీసుకుంటే సరిపోతుంది. లేదా కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. అందరిలోనూ కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు తొందరగా బయటపడవు. రోగం ముదిరిన తర్వాత మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది. అప్పుడు చేయిదాటిపోయే పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి ఆరోగ్య సమస్యలు చిన్నవిగా ఉన్నప్పుడే మేల్కోవడం మంచిది. మీరు డాక్టర్‌ను సంప్రదించి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి.

 

డా.ఊర్మిళ ఆనంద్
సీనియర్ నెఫ్రాలజిస్ట్ -
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్
ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్

 

Advertisement
 
Advertisement
 
Advertisement