ప్రియంగా...ప్రీతికరంగా..! | they recieved father's legacy | Sakshi
Sakshi News home page

ప్రియంగా...ప్రీతికరంగా..!

Published Tue, Aug 26 2014 10:22 PM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM

ప్రియంగా...ప్రీతికరంగా..!

ప్రియంగా...ప్రీతికరంగా..!

అపీజే సురేంద్ర గ్రూప్...1500 కోట్ల టర్నోవర్  ఉన్న కంపెనీ... ఆ వంశంలో రెండవ తరం వారైన ప్రియా పాల్, ప్రీతీ పాల్ తండ్రి వారసత్వాన్ని అంది పుచ్చుకున్నారు... పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు...  వారు రోజుకి 24 గంటలు కాదు... 36 గ ంటలు పని చేస్తారు. నిత్యం మీటింగులతో, బేరసారాలతో, అత్యవసర ఫోన్ కాల్స్‌తో, ప్రయాణాలతో... వారి జీవితం చాలా బిజీగా ఉంటుంది. ఆరు పార్క్ హోటల్స్‌ను ప్రియ విజయవంతంగా నడుపుతున్నారు... 16 న్యూలుక్ ఆక్స్‌ఫర్డ్ బుక్ స్టోర్స్ స్థాపించి... రిటైల్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చురుకుగా ఉన్నారు ప్రీతి... ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు వ్యాపార రంగంలో విజయవంతంగా దూసుకుపోతున్నారు...
 
1988లో అమెరికాలో వెస్లీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన ప్రియా పాల్, ఫ్యామిలీ బిజినెస్‌లో చేరవలసి వస్తుందని ముందే అనుకున్నారు. డిగ్రీ అయిన వెంటనే ఢిల్లీ పార్క్ హోటల్‌కి మేనేజర్ అయ్యారు. అప్పటికి... కంపెనీ ఆదాయం రెసిషన్ కారణంగా పది శాతం తగ్గింది. ‘‘మా హోటల్స్‌లో కూల్ మ్యూజిక్, ఫ్యాషన్, ఈవెంట్స్ ఏర్పాటుచేశాం. వెంటనే ఎంతో మార్పు కనిపించింది. దాంతో 1995 నాటికి లగ్జరీ బొటిక్స్ కూడా ప్రారంభించాం. మా హోటల్స్‌ను కేవలం ట్రావెలర్స్‌కి మాత్రమే కాకుండా, నగరంలో అందరూ కలవడానికి అనువైన ప్రదేశంగా తీర్చిదిద్దాం’’ అంటారు ఆమె.
 
ప్రీతి పాల్ ఆఫీసులో ఆఫీస్ ఫైల్స్ తర్వాత ఉండేది పిల్లలకు సంబంధించిన ఫైల్స్. ఆ ఫైల్స్‌కి ఈ ఫైల్స్‌కి ఎంతో తేడా ఉంటుంది. వేటికి ఇవ్వవలసిన ప్రాధాన్యత వాటికి ఇస్తారు ఆమె. ‘‘నేను ఇప్పటికి 25 సంవత్సరాలుగా ఆక్స్‌ఫర్డ్ బుక్ స్టోర్స్ నడుపుతున్నాను. నేను చేసే అన్ని వ్యాపారాలలో నాకిష్టమైన వ్యాపారం ఇదే. ప్రతిసారి నాకు ఇందులో కొత్తదనం కనిపిస్తుంది’’ అని చెప్పే ప్రీతి, ఇప్పటికి 30 బుక్ స్టోర్స్ స్థాపించారు.
 
1990లో ఉల్ఫా తీవ్రవాదులు ప్రీతి, ప్రియల తండ్రి సురేంద్రపాల్‌ని కాల్చి చంపారు. ఇది జరిగిన కొద్దికాలానికే వీరి సోదరుడు ఆనంద్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ సంఘటన జరిగేనాటికి ప్రియకు 23 సంవత్సరాలు. ‘‘ఇంత భయానక సంఘటనలు జరిగిన తర్వాత మేం కోలుకోవడం చాలా కష్టమయ్యింది. బహుశ ఆ కష్టం వల్లే కాబోలు మేం తప్పనిసరిగా కంపెనీ బాధ్యతలు చేపట్టవలసి వచ్చింది’’ అంటారు వీరు. కంపెనీ బాధ్యతలు చేపట్టే నాటికి ప్రియాపాల్ కి కేవలం రెండు సంవత్సరాల అనుభవం మాత్రమే ఉంది. అయినా 220 గదులున్న ఢిల్లీలోని పార్క్ హోటల్ నిర్వహణ బాధ్యతను తన భుజాల మీదికి ఎత్తుకుంది. నాటి నుంచి, దాని అభివృద్ధి కోసం అహర్నిశలూ కష్టపడుతూనే ఉంది. 17 సంవత్సరాలుగా చేస్తున్న కృషి ఫలితంగా ఆమెకు ఆత్మవిశ్వాసం, ధైర్యం అలవడ్డాయి.
 
తండ్రి మరణించేనాటికి ప్రీతి, అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆర్కిటెక్చర్ అండ్ ఎకనామిక్స్ చదువుతోంది. ‘‘ఆ సమయంలో మాకు సహాయపడవలసిన మా మేనమామ ఏమీ పట్టనట్టు మమ్మల్ని వదిలేశారు. మా అమ్మ చాలా నిబ్బరంగా ఉంది. అన్ని ఇబ్బందులనూ ఎదుర్కొంటూ మా అమ్మ మమ్మల్ని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దింది’’ అంటూ గుర్తు చేసుకున్నారు అక్కాచెల్లెళ్లు.
 
కలకత్తా, విశాఖపట్టణం, ఢిల్లీలలో ఉన్న హోటల్స్ బాధ్యతను ప్రియ చేపడితే, పురుషుల ఆధిపత్యం ఉన్న షిప్పింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ప్రీతి ఎంతో డైనమిక్‌గా పని చేసి, విజయం సాధించారు. ‘‘నేను బాస్‌గా ఉన్న మోస్ట్ జూనియర్‌ని. అక్కడున్న పెద్ద పెద్ద సీనియర్ల కంటె, మిగతా జూనియర్లు నన్ను బాస్‌గా అంగీకరించలేకపోవడం చిత్రంగా అనిపించింది’’ అంటారు ప్రీతి.
 
ప్రియా ఎదుర్కొన్న సవాళ్లు వేరేరకంగా ఉన్నాయి. కోలకతా, విశాఖపట్టణాలలో ఉన్న హోటళ్లలో చాలా కాలంగా వస్తున్న యూనియన్ సమస్యలు అలాగే ఉన్నాయి. వాటిని ఎదుర్కోవడానికి కొందరు నిపుణుల సలహాలు, సహాయం తీసుకుని అన్నిటినీ ఒక కొలిక్కి తీసుకువచ్చారు. 1990 లో ఉన్న పార్క్ హోటల్స్‌కీ, ఇప్పటి పార్క్ హోటల్స్‌కీ ఎంతో తేడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఆరు హోటళ్లు లగ్జరీకి మారుపేరుగా మారిపోయాయి. ప్రీతి ఆ తరువాత షిప్పింగ్ నుంచి రిటైల్ అండ్ రియల్  ఎస్టేట్‌లోకి మారిపోయారు. దానితోపాటు ఆక్స్‌ఫర్డ్ బుక్ స్టోర్స్ కూడా నడుపుతున్నారు. కలకత్తాలో స్థాపించిన అపీజే ఆనంద్ చిల్డ్రన్స్ లైబ్రరీకి ‘డ్యూక్ ఎడిన్‌బరో ప్రైజ్ ఫర్ సోషల్ సర్వీస్’ బహుమతి సంపాదించారు.
 
ఇరవై సంవత్సరాలుగా ఈ అక్కాచెల్లెళ్లతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న ప్రముఖ డిజైనర్ వివేక్ సహానీ, ‘‘పట్టుదల, క్రమశిక్షణతో పనిచేయడమేగాక నిరంతరం కొత్తదనాన్ని ఆహ్వానించడమే వారి విజయానికి కారణం’’ అంటారు. ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు పారిశ్రామిక రంగంలో ఇంత ఎత్తుకు ఎదగడం మహిళలందరికీ స్ఫూర్తిదాయకం.
 - డా. వైజయంతి
 
మహిళలే మంచి ప్రయాణికులు..!
ట్రావెలింగ్ సంస్థలు మహిళలను ఉత్తమ ప్రయాణికులు అంటూ కీర్తిస్తున్నాయి. ప్రయాణ సమయంలో పురుష ప్రయాణికుల తీరు కంటే.. మహిళల నడవడిక, వారు వ్యవహరించే తీరు ఎన్నో రెట్లు మెరుగు అని ఆ సంస్థలు పేర్కొన్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ అధ్యయనంలో  సకాలంలో స్టేషన్‌కు చేరుకోవడం, లగేజ్‌ను సరిచూసుకోవటం, టికెట్లను జాగ్రత్తగా పెట్టుకోవడం... వంటి విషయాల్లో మహిళలకు పూర్తి మార్కులు పడతాయని తేలింది. ప్రపంచవ్యాప్తంగా అనేక ట్రావెల్స్ సంస్థల వారితో, వివిధ ఎయిర్‌పోర్టుల్లో, రైల్వేస్టేషన్‌ల వారితో మాట్లాడి ఈ అధ్యయనాన్ని చేశారట. సెలవుల్లో విహార యాత్రలకు వెళుతున్నా... లేక అత్యవసరమైన జర్నీలు చేస్తున్నా... పురుష ప్రయాణికుల్లో టి కెట్లు పారేసుకోవడం, వేరే ప్లాట్‌ఫారమ్‌లలో నిలుచుని ఇబ్బందులు పడటం, లగేజ్‌ను పోగొట్టుకోవడం ఎక్కువగా జరుగుతుంటుంది.
 
అదే మహిళలు అయితే చాలా జాగ్రత్తగా ఉంటారని... ప్రయాణాల సమయంలో కేవలం జర్నీ మీదే దృష్టి నిలిపి ఎలాంటి సమస్యా రాకుండా చూసుకొంటారని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. స్టేషన్లలో పురుషుల నుంచి అందే ఫిర్యాదులతో పోలిస్తే మహిళా ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదులు చాలా తక్కువగా ఉన్నాయని వారు విశ్లేషించారు. ప్రయాణాల్లో పిల్లల బాధ్యతలను చూసుకోవడం, వారి అవసరాలను కనుక్కొని ఎవరికీ ఇబ్బంది లేకుండా చేసే మహిళలను ఉత్తమ ప్రయాణికులనవచ్చని అధ్యయనకర్తలు అభిప్రాయపడ్డారు.
 
ప్రయాణాలను జాగ్రత్తగా చేయడంలోనే కాదు.. ప్లాన్‌చేయడంలో కూడా మహిళలు చాలా బెటర్ అట. ఈ విషయంలో మహిళలు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారని అధ్యయన కర్తలు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement