ఈ బామ్మకు 117 ఏళ్లు
నాట్ ఔట్
‘నా ఆయుష్షు కూడా పోసుకుని బతుకు’ అని ఆశీర్వదించడం మన సంప్రదాయం. చూడబోతే ఈ బామ్మ అందరి ఆయుష్షు పోసుకొని హాయిగా జీవిస్తున్నట్టుంది. కారణం ఆమె వయసు. ఎంతో తెలుసా? 117 సంవత్సరాలు. ప్రస్తుతం ప్రపంచంలో జీవించిన ఉన్న దీర్ఘాయిష్కుల్లో ఈమే ప్రపథమరాలు అని కొన్ని సంస్థలు నిర్థారిస్తున్నాయి. కరేబియన్ దీవుల్లో ఉండే జమైకా దేశానికి చెందిన ఈ బామ్మ పేరు కూడా గమ్మత్తుగా ఉంటుంది. రెండు రంగుల పేరు అది. ‘వయొలెట్ బ్రౌన్’.
చెరకు బట్టీల్లో పని చేసే తల్లిదండ్రులకు 1900 సంవత్సరంలో పుట్టిన ఈ బామ్మ తన పదమూడో ఏట నుంచి క్రిస్టియన్ మతం స్వీకరించి అందులో కొనసాగుతోంది. భర్త ద్వారా ఒక కుమార్తెకు తర్వాత తన సహజీవనంతో మరో ఐదు మంది సంతానానికి ఈమె జన్మనిచ్చింది. వీరిలో ఐదుగురు ఇంకా జీవించే ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే వయొలెట్ బ్రౌన్ తన ఆయుష్షుతో రికార్డు సృష్టిస్తే ‘తల్లి బతికున్న దీర్ఘవయస్కురాలిగా’ ఈమె 97 సంవత్సరాల కుమార్తె మరో రికార్డు సృష్టించింది. ఇప్పటికే మీడియాలో ‘ఆంట్ వి’గా ప్రసిద్ధురాలైన వయొలెట్ బ్రౌన్ ఈ రోజుకు కూడా పన్ను కదలకుండా కాలు బెణకకుండా హాయిగా జీవిస్తూ ఉంది.
ఆహారంలో చేపలు, మాంసం ఎక్కువ తీసుకోవడం చికెన్, పోర్క్ తక్కువ తినడం తన ఆరోగ్య రహస్యం కావచ్చని అంటోంది. ‘అది మీ భౌతిక ఆరోగ్యానికి కారణం కావచ్చు... మరి మానసిక ఆరోగ్యానికి’ అని అడిగితే చిర్నవ్వు నవ్వి ‘తల్లిదండ్రులని గౌరవించండి. మీ మనసు ఆయుష్షు బాగుంటాయి. నేను నా తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా ప్రేమించాను, గౌరవించాను’ అని బదులు చెప్పింది. తల్లిదండ్రులను పట్టించుకోని ఈ రోజుల్లో బామ్మ మాట బంగారుబాట అనిపిస్తోంది కదూ.