ఈ వారం యూట్యూబ్ హిట్స్
ది రెవెనెంట్ : టీజర్
నిడివి : 2 ని. 25 సె.
హిట్స్ : 1,29,69,755
లియోనార్డో డికాప్రియో నటించిన ఈ చిత్రం టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ఒక సంచలనం. బర్డ్‌మ్యాన్ చిత్ర దర్శకుడే ఈ చిత్రాన్నీ డెరైక్ట్ చేస్తున్నారు. వన్యప్రాణులను అన్వేషించే లియో ఒక ఎలుగుబంటి దాడిలో చనిపోతాడు. అన్వేషణ బృందం సభ్యులు అతడి చావుకు అతణ్ణి వదిలేసి వెళ్లిపోతారు. తిరిగి అతడు బతికాక ఏమౌతుందన్నదే కథ. ‘చావంటే నాకు భయం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకసారి చనిపోయినవాణ్ణి’ అనే డైలాగ్ చెబుతున్నప్పుడు లియో ఎక్స్‌ప్రెషన్స్ చూసి తీరాల్సిందే. అందుకు క్రిస్మస్ వరకు ఆగాల్సిందే. రెవెనెంట్ అంటే చనిపోయి, తిరిగి బతికినవాడు. ఈవారం హిట్స్‌లో రెవెనెంట్ టాప్‌లో ఉన్నాడు.
స్పెక్టర్ : ట్రైలర్
నిడివి : 2 ని. 32 సె.
హిట్స్ : 91,12,624
ఇరవై నాల్గవ జేమ్స్‌బాండ్ మూవీ ‘స్పెక్టర్’ ట్రైలర్ హిట్‌లమీద హిట్‌లు కొడుతోంది. డేనియల్ క్రెయిగ్ జేమ్స్‌బాండ్‌గా నటిస్తున్నారు. డెరైక్టర్ శ్యామ్ మెండెస్. చిత్రాన్ని నిర్మిస్తున్నది సోనీ పిక్చర్స్. స్కై ఫాల్ చిత్రం తర్వాత రెండేళ్ల విరామంతో రాబోతోంది కనుక జేమ్స్‌బాండ్ 007 అభిమానులు ఎంతో ఆసక్తిగా స్పెక్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ సరే.. బాండ్ గాళ్ ఎవరనేగా మీ సందేహం! ఫ్రెంచ్ నటి లీయా సెడ్యూక్స్. బాండ్ గాళ్‌గా తొలిసారి నటిస్తున్న ఈ ముప్పై ఏళ్ల యువతి డేనియల్‌కు దీటుగా ఉంటుందా? లేక అతడిని మించిపోతుందా అన్నది అక్టోబర్ 26న తేలిపోతుంది.
రయీస్ : టీజర్
నిడివి 1 ని. 05 సె.
హిట్స్ : 42,53,190
బూట్‌లెగ్గర్‌గా (చట్టవ్యతిరేక పదార్థాల విక్రేతగా) మొదలై, డాన్‌గా ఎదిగిన పాత్రధారిగా షారుఖ్‌ఖాన్‌ని ‘రయీస్’ చిత్రంలో చూడవచ్చు. ఆయన లుక్ అందులో డిఫరెంట్‌గా ఉండబోతోందని ఈ టీజర్ చూస్తే అర్థమౌతుంది. మాస్టారు కాస్త ‘ఛక్ దే’ స్టెయిల్‌లో కూడా కనిపిస్తారు. కళ్లకు సుర్మా ఉంటుంది. గడ్డం సరేసరి. మనిషి బక్కగా... అంటే స్లిమ్‌గా, రఫ్‌గా ఉంటాడు. ‘దందే సె బడా కోయీ ధరమ్ నహీ హోతా’ వంటి ఆయన మాత్రమే డెలివరీ చెయ్యగల డైలాగుల్ని శాంపిల్‌గా విసిరారు. చిత్రం 2016 ఈద్‌కి విడుదల అవుతోంది. అదే రోజు విడుదల కానున్న ఇంకో సినిమా సల్మాన్‌ఖాన్ నటిస్తున్న ‘సుల్తాన్’.
అహల్య : షార్ట్ ఫిల్మ్
నిడివి : 14 ని.
హిట్స్ : 31,68,792
ఇదొక ఎపిక్ థ్రిల్లర్. రామాయణంలోని అహల్య కథను తీసుకుని, దానికి ఆధునికతను మిక్స్ చేసి సుజయ్ ఘోష్ తీసిన థ్రిల్లర్ ఈ లఘుచిత్రం. వృద్ధుడైన భర్త, యవ్వనవతి అయిన భార్య, ఒక పోలీస్ ఆఫీసర్, కొన్ని రాతి బొమ్మలతో స్టోరీ సాగుతుంది. భర్త సౌమిత్ర చటర్జీ. భార్య రాధికా ఆప్టే. తోతారాయ్ చౌదరి పోలీస్ ఇన్‌స్పెక్టర్. మొదట ఇన్‌స్పెక్టర్ తలుపు తట్టడంతో కథ మొదలౌతుంది. అదే ఇన్‌స్పెక్టర్ ప్రాణంతో పెనుగులాడుతూ పెడబొబ్బలు పెడుతుండగా (మనిషి కనిపించడు. అరుపులు మాత్రమే వినిపిస్తాయి) కథ ఎండ్ అవుతుంది. అసలేం జరిగిందన్నది ఫిల్మ్ చూస్తే తెలుస్తుంది.
బాజీరావ్ మస్తానీ : టీజర్ ట్రైలర్
నిడివి : 3 ని. 06 సె.
హిట్స్ : 29,63,867
సంజయ్ లీలాబన్సాలీ దర్శకత్వం వహించి, నిర్మిస్తున్న బాజీరావ్ మస్తానీ టీజర్ ట్రైలర్ కనువిందుగా ఉంది. భావోద్వేగమూ, భయానకమూ అయిన చరిత్ర ఘట్టాలతో సిద్ధమౌతున్న ఈ చిత్రంలో రణ్‌వీర్‌సింగ్ మరాఠా పీష్వా బాజీరావ్ ఐ గా నటిస్తున్నారు. ప్రియాంకా చోప్రా ఆయన మొదటి భార్యగా కనిపిస్తున్నారు. అయితే అందరి దృష్టీ బాజీరావ్ రెండో భార్యగా నటిస్తున్న దీపికా పదుకొనే మీదే (కథాపరంగా) ఉంటుందన్న సంగతి ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. సాధారణ భార్య స్థానం నుంచి పరిణతి చెందిన ఒక యోధురాలిగా దీపిక అసమాన నటన ప్రదర్శించారు. చిత్రం విడుదల డిసెంబర్ 18.
జీ క్రయింగ్
ఫర్ సల్మాన్‌ఖాన్
నిడివి : 15 సె.
హిట్స్ : 5,53,494
ఇది మూవీ ట్రైలర్ కాదు. టీజర్ కాదు. షార్టెస్ట్ ఫిల్మూ కాదు. రియాలిటీ. తల్లితో కలిసి భజ్‌రంగి భాయ్‌జాన్ సినిమా చూస్తున్న చిన్నారి సుజీ... ఎండింగ్‌లో ‘ఐ వాంట్ సల్మాన్’ అని బుగ్గలపైకి కన్నీరు జారేలా ఏడుస్తూ తల్లి ఒడిలో వాలిపోవడాన్ని లక్షల మంది భారమైన హృదయాలతో వీక్షిస్తున్నారు. తల్లి మదీహా ఆ చిన్నారిని బుజ్జగిస్తూ ‘ఎందుకు నీకు సల్మాన్‌ని చూడాలనిపిస్తుంది’ అని అడిగినప్పుడు ‘ఐ లవ్ సల్మాన్’ అని మళ్లీ గుక్కపెట్టి ఏడుస్తుంది. భజ్‌రంగి భాయ్‌జాన్ ఎంతగా కదిలించిందో చాలా రివ్యూలు చెప్పాయి. అంత కన్నా గొప్పగా పాప కన్నీళు ఆ సినిమాను రివ్యూ చేశాయి!