ఈ వారం యు ట్యూబ్ హిట్స్
టేలర్ స్విఫ్ట్ - అవుటాప్ ది ఉడ్స్
నిడివి : 4 ని. 16 సె.
హిట్స్ : 69,42,867
టేలర్ స్విఫ్ట్ అమెరికా అమ్మాయి. సింగర్. సాంగ్ రైటర్. పద్నాలుగేళ్లకే పాపులర్ అయిన స్విఫ్ట్.. ఇప్పుడు తన 26 వ యేట ‘అవుటాఫ్ ది ఉడ్స్’ అనే ఇంకో కొత్త వీడియోతో సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తున్నారు. ఈ వీడియో డిసెంబర్ 31 విడుదలైంది. హిట్లు కోటికి చేరుకోబోతున్నాయి! ‘అప్పుడది చిన్న విషయంగా తోచింది కానీ, ఆలోచిస్తుంటే మనం తీసుకున్న ఫొటోలో నువ్వు నేను తప్ప మిగతా ప్రపంచమంతా బ్లాక్ అండ్ వైట్‌లో ఉండిపోయింది’ అంటూ ఈ సాంగ్ మొదల వుతుంది.
ది వాకింగ్ డెడ్ : ట్రైలర్
నిడివి : 29 సె.
హిట్స్ : 31,77,421
అమెరికన్ టెలివిజన్ చానెల్ ఎ.ఎం.సి (అమెరికన్ మూవీ క్లాసిక్స్)లో ఫిబ్రవరి 14నుంచి ప్రారంభం కాబోతున్న టీవీ సీరియల్ ‘ది వాకింగ్ డెడ్’ ట్రైలర్ ఇది. 6 వ సీజన్‌లో 10 ఎపిసోడ్‌గా ఈ హారర్ డ్రామా మొదలవుతోంది. ‘ది వాకింగ్ డెడ్’ అనే కామిక్ సీరీస్ ఆధారంగా అదే పేరుతో 2010 నుంచి ప్రసారం అవుతోంది. విలయం నుంచి బయటపడిన కొందరు వ్యక్తులు పోలీస్ అధికారి రిక్స్ గ్రిమ్స్ నాయకత్వంలో సురక్షితమైన నివాస ప్రదేశాన్ని అన్వేషించే పనిలో పడతారు. ఆ ప్రయత్నంలో వికృత మానవులతో వారు జరిపే పోరాట సన్నివేశాలకు ఒళ్లు గగుర్పొడుస్తుంది.
అరెథా ఫ్రాంక్లిన్ : ఎ నేచురల్ ఉమన్
నిడివి : 4 ని. 16 సె.
హిట్స్ : 65,13,073
అరెథా ఫ్రాంక్లిన్ (73) అమెరికన్ సింగర్, మ్యుజీషియన్. అంతే వయసున్న తన సహ గాయని కరోల్ కింగ్ గౌరవార్థం కెన్నెడీ సెంటర్‌లో అరెథా ఇచ్చిన కచేరి ఎంతలా మంత్ర ముగ్ధుల్ని చేసిందో ఈ వీడియోలో చూడొచ్చు. కచేరికి హాజరైన కరోల్.. అరెథా గొంతులోంచి తన పాట విని ఉద్వేగానికి లోనయ్యారు. ‘యు మేక్ మి ఫీల్ లైక్ ఎ నేచురల్ ఉమన్’ అంటూ అరెథా పాడిన ఆ పాటను 1967లో కరోల్ కింగ్ రాశారు. అప్పట్లో అరెథాకో అదో పెద్ద హిట్. ఆ గానామృతాన్ని మళ్లీ అనుభూతి చెందుతూ కచేరీకి హాజరైన ఒబామా కంట తడి పెట్టారు!
మిరుథన్ : ట్రైలర్
నిడివి : 1 ని. 58 సె.
హిట్స్ : 4,48,364
తమిళ్‌లో మొట్టమొదటిసారిగా వస్తున్న జాంబీ థ్రిల్లర్ మూవీ ‘మిరుథన్’ ట్రైలర్ డిసెంబర్ 31న విడుదలైంది. శక్తి సౌందర్ రాజన్ డెరైక్షన్‌లో జయం రవి, లక్ష్మీ మీనన్ హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 15న విడుదల అవుతోంది. జాంబీ అంటే మతి స్థిమితం తప్పిన వ్యక్తి. అతడు సృష్టించే అల్లకల్లోలం నుంచి జయం రవి సిటీని కాపాడే పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడా లేక ఒక పౌరుడిగా నటిస్తున్నాడా అన్న విషయంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ బీభత్స, భయానక చిత్రంలో కాస్త రొమాన్స్ కూడా ఉన్నట్టు మాత్రం ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది.