ప్రపంచంలోనే అత్యంత సంపన్న నటి ఎవరో తెలుసా? | Who is world's richest actress; full details here | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ రిచెస్ట్‌ యాక్ట్రస్‌ ఎవరో ఊహించగలరా.. టాప్ 10లో ఉన్న భారతీయ నటి ఎవరంటే?

Published Wed, Oct 9 2024 4:09 PM | Last Updated on Wed, Oct 9 2024 4:31 PM

Who is world's richest actress; full details here

ప్రపంచంలోనే అత్యంత సంపన్న నటి ఎవరో చెప్పగలరా? మీరు ఊహించినట్టు టేలర్ స్విఫ్ట్, రిహన్న, సెలీనా గోమెజ్ అయితే కాదు. ఎందుకంటే ఈ ముగ్గురి మొత్తం సంపద కలిపినా కూడా ఆ నటి సంపదకు సరితూగదు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది అక్షరాల నిజం. అంతేకాదు అందరి కంటే ఎక్కువ సంపద కలిగివున్నప్పటికీ ఆమె ఏమీ పాపులర్‌ నటి కాదు. ఆమె ఖాతాలో ఒక్క బాక్సాఫీస్ విజయం కూడా లేదు. మరి ఆమెకు అంత సంపద ఎలా వచ్చింది?

ఫోర్బ్స్ ప్రకారం.. అత్యంత సంపన్న నటుడు టైలర్ పెర్రీ. అమెరికాకు చెందిన ఆయన నటుడిగా, నిర్మాతగా, నాటక రచయితగా ప్రసిద్ధుడు. ఆయనకు సొంత స్టూడియోతో పాటు, మాడియా హిట్ ఫ్రాంచైజీ ఉండడంతో అతడు 1.4  బిలియన్‌ డాలర్ల సంపద కలిగివున్నాడు. అత్యంత సంపన్న నటిగా ఈ జాబితాలో ముందున్న అమెరికన్ యాక్ట్రస్‌-ఆంట్రప్రెన్యూర్ జామీ గెర్టజ్‌.. ఆస్తుల ఎంతో తెలిస్తే అవాక్కవడం పక్కా. టైలర్ పెర్రీ సంపద కంటే 5 రెట్లు కంటే ఎక్కువని ఫోర్బ్స్ అంచనా వేసింది. జామీ గెర్టజ్‌ ఆస్తుల నికర విలువ 8 బిలియన్‌ డాలర్లు. అంటే 66 వేల కోట్ల రూపాయల పైమాటే. ప్రపంచంలోని సెలబ్రిటీలందరిలోనూ ఆమె అత్యంత సంపన్నురాలు. టేలర్ స్విఫ్ట్‌ (1.6 బిలియన్ డాలర్లు), రిహన్న (1.4 బిలియన్ డాలర్లు), సెలీనా గోమెజ్ (1.3 బిలియన్ డార్లు) తరువాతి స్థానంలో ఉన్నారు. మడోన్నా.. నాన్-బిలియనీర్‌గా టాప్‌-5లో చోటు దక్కించుకుంది.

టాప్ 10లో జూహీ చావ్లా
టాప్‌-5లో మిగిలిన నలుగురి మొత్తం సంపద కంటే కూడా జామీ గెర్టజ్‌ సంపదే ఎక్కువని ఫోర్బ్స్ అంచనా వేసింది. టాప్‌-5లో నిలిచిన ఐదుగురు నటీమణులు నటనతో పాటు ఇతర వ్యాపకాలతో ఆస్తులు కూడబెట్టారు. టేలర్ స్విఫ్ట్‌, రిహన్న, సెలీనా గోమెజ్, మడోన్నా.. యాక్టింగ్‌తో పాటు మ్యూజిక్‌ కెరీర్‌, మేకప్ బ్రాండ్‌లతో సంపద పోగేశారు. జామీ గెర్టజ్‌ విషయానికి వస్తే ఆమె వ్యాపార పెట్టుబడులతో అందరి కంటే ఎక్కువగా సంపాదించారు. మెయిన్‌ స్ట్రీమ్ నటి రీస్ విథర్‌స్పూన్ ఏడవ స్థానంలో ఉంది. టాప్ 10లో ఉన్న ఏకైక భారతీయ నటి జూహీ చావ్లా మాత్రమే. హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం ఆమె సంపద సుమారు రూ.4600 కోట్లు.

చ‌ద‌వండి: టిన్‌ అండ్ టీనా మూవీ రివ్యూ

ఎవరీ జామీ గెర్టజ్‌?
జామీ గెర్టజ్.. అమెరికాలోని షికాగోలో 1965లో జన్మించారు. 80వ దశకంలో నటనా జీవితాన్ని ప్రారంభించారు. 1981లో ఎండ్‌లెస్ లవ్‌తో సినీ రంగ ప్రవేశం చేశారు. 1987లో లెస్ దేన్ జీరో సినిమాలో రాబర్ట్ డౌనీ జూనియర్‌కి జోడీగా నటించడంతో ఆమెకు గుర్తింపు దక్కింది. అదే సంవత్సరం ది లాస్ట్ బాయ్స్‌ సినిమాలో ప్రముఖ పాత్రను పోషించి ప్రశంసలు అందుకున్నారు. 90 దశకంలో ట్విస్టర్ వంటి  సినిమాల్లో నటించారు. ప్రధాన నటిగా విజయాలు దక్కకపోవడంతో తర్వాత సహాయ పాత్రలకు పరిమితమయ్యారు. అల్లీ మెక్‌బీల్ టీవీ షోతో ప్రేక్షుకులకు దగ్గరయి ఎమ్మీ నామినేషన్‌ సాధించారు. చివరిసారిగా 2022 చిత్రం ఐ వాంట్ యు బ్యాక్‌ సినిమాలో అతిథి పాత్రలో ఆమె కనిపించారు.

చ‌ద‌వండి: ఓటీటీలో హాలీవుడ్‌ రొమాంటిక్‌ మూవీ.. 20 భాషల్లో స్ట్రీమింగ్‌

అంత సంపద ఎలా వచ్చింది?
జామీ గెర్టజ్‌ నటనా జీవితంలో పెద్దగా విజయాలు లేకపోయినా ఆమె అత్యంత సంపన్న నటిగా ఎలా ఎదిగారనేది అందరికీ ఆసక్తి కలిగించే విషయం. అమెరికన్ బిలియనీర్ వ్యాపారవేత్త టోనీ రెస్లర్‌ను వివాహం చేసుకోవడంతో ఆమె దశ తిరిగింది. భర్తతో కలిసి వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడంతో ఆమె సంపద బాగా పెరిగింది. వీరిద్దరూ నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (NBA)లో అట్లాంటా హాక్స్, మేజర్ లీగ్ బేస్‌బాల్‌లో  మిల్వాకీ బ్రూవర్స్ జట్లకు సహ-యజమానులుగా ఉన్నారు. వీటితో పాటు ఇతర వ్యాపారాల్లోనూ జామీ గెర్టజ్‌ పెట్టుబడులు కలిగివుండడంతో రిచెస్ట్‌ యాక్ట్రస్‌గా ఆమె టాప్‌లో ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement