టీ షర్ట్ ఖరీదు నాలుగు లక్షలు!
మానవత్వానికి చిరునామా టేలర్ స్విఫ్ట్ అని హాలీవుడ్‌లో అంటుంటారు. గాయనిగా, రచయిత్రిగా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్విఫ్ట్ సేవా కార్యక్రమాల ద్వారా మంచి మనిషి అనిపించుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే.. సహాయం చేయడానికి ముందుంటారామె. ఎంతోమంది పేద పిల్లలను చదివిస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలకు భారీ ఎత్తున విరాళాలు ఇస్తుంటారు. ఇటీవల ఎయిడ్స్ బాధితుల సహాయార్థం జరిగిన ఓ వేలం పాట కార్యక్రమంలో పాల్గొన్నారు స్విఫ్ట్.
నటుడు, నిర్మాత హగ్ జాక్‌మాన్ వాడిన టీ షర్ట్, బెల్ట్‌తో పాటు మరికొన్ని వస్తువులను వేలానికి పెట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొని, జాక్‌మాన్ టీ షర్ట్‌ని నాలుగు లక్షలకు కొన్నారు స్విఫ్ట్. ఆ నాలుగు లక్షలకు అదనంగా ఇంకొంత డబ్బు చేర్చి, ఎయిడ్స్ బాధితుల సహాయార్థం ఇచ్చేశారు. ఇలా సేవా కార్యక్రమల కోసమే బోల్డంత డబ్బు ఖర్చుపెడుతుంటారట. అందుకే రెండేళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడి సతీమణి మిచెలీ ఒబామా ‘డెడికేషన్ టు హెల్పింగ్ అదర్స్’ అనే అవార్డుని టేలర్ స్విఫ్ట్‌కి ఇచ్చారు.