టైటిల్: టిన్ & టీనా
కథ
లోలా - అడాల్ఫొ దంపతులు పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తారు. కానీ వారి కలలను నీరుగారుస్తూ పెళ్లిరోజే లోలాకు గర్భస్రావం అవుతుంది. అంతేకాదు, ఇంకెప్పుడూ తను తల్లి కాలేదని వైద్యులు నిర్ధారిస్తారు. దీంతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంది. తననలా చూడలేకపోయిన భర్త దగ్గర్లో ఓ కాన్వెంట్ ఉందని, అందులో ఎవర్నైనా దత్తత తీసుకుందామని చెప్తాడు. మొదట లోలా అందుకు అంగీకరించదు. కానీ తర్వాత ఒప్పుకుని ఏడేళ్ల వయసున్న కవలలు టిన్ అండ్ టీనాను దత్తత తీసుకుంటారు.
అప్పుడు అసలు కథ మొదలవుతుంది. పిల్లలు అందరిలా కాకుండా వింతగా ప్రవర్తిస్తుంటారు. భగవంతుడిపై ఎక్కువ విశ్వాసంతో తానేం చేసినా దేవుడిపైనే భారం వేస్తారు. అప్పుడే ఒక మిరాకిల్ జరుగుతుంది. లోలా మల్లీ ప్రెగ్నెంట్ అవుతుంది. పిల్లల వింత ప్రవర్తనతో భయపడిపోయిన ఆమె కడుపులో బిడ్డను వారి నుంచి కాపాడుకోవాలని చూస్తుంది. డెలివరీ తర్వాత కూడా క్షణక్షణం భయంగానే గడుపుతుంది. ఆమె భయానికి కారణం ఏంటి? ఆ పిల్లలు ఏం చేశారు? వారిని తిరిగి ఎందుకు కాన్వెంట్‌లో వదిలేశారు? అనేది తెలియాలంటే ఓటీటీలో మూవీ చూడాల్సిందే!
విశ్లేషణ
లోలాకు దేవుడంటే నమ్మకం ఉండదు. కానీ తను పెంచుకుంటున్న కవలలకు అపారమైన భక్తి. బైబిల్‌లో ఉన్నవన్నీ యదాతథంగా అమలు చేయాలనుకుంటారు. ఈ క్రమంలోనే పెంపుడు కుక్కను చంపేస్తారు. స్కూలులో తమను ఆటపట్టిస్తున్న కుర్రాడిని సైతం దారుణంగా టార్చర్ పెట్టి చంపుతారు. వీటిని సహించని లోలా చివరకు వారిని అమాయకులుగా భావించడం వింతగా అనిపిస్తుంది. పిల్లల రాక్షస ప్రవర్తనకు ఇంకేమైనా కారణాలున్నాయా? అని అనిపించకమానదు. క్లైమాక్స్‌లో లోలా భర్తను కోల్పోవడం... ఎవరివల్లయితే తన కొడుక్కి హాని అనుకుందో ఆ కవలల్ని ఇంటికి తీసుకురావడం అందరికీ మింగుడుపడకపోవచ్చు.
లోలాగా మెలీనా స్మిత్, టిన్ అండ్ టీనాగా కార్లోస్ జి మోరోలాన్, అనటాసియా రుస్సో నటించారు. వీరి పర్ఫామెన్స్ బాగుంది. కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు మనకే కంగారు వచ్చేస్తుంటుంది. బిడ్డను కాపాడుకోవడానికి తల్లి పడే ఆరాటం మనల్ని కదిలించివేస్తుంది. వీకెండ్‌లో ఓసారి చూసేయొచ్చు! టిన్ అండ్ టీనా మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment