ఈ వారం యూట్యూబ్ హిట్స్
పెంటాటానిక్స్ అండ్ డాలీ పార్టన్ : జోలిన్
‘ప్లీజ్ డోన్ట్ టేక్ మై మ్యాన్’! పాత పాట. 43 ఏళ్లనాటి పాట. మళ్లీ ఇప్పుడు ఫ్రెష్‌గా! ప్లీజ్ డోన్ట్ టేక్ మై మ్యాన్. పాత ఏడుపే. ప్రేమలో ఉండే ఏడుపు. ‘నా భర్తను పట్టుకెళ్లిపోవద్దు. నా ప్రియుణ్ణి వలలో వేసుకోవద్దు. ప్లీజ్.. ప్లీజ్ జోలీన్’ అని వేడుకోలు. కొత్తగా పెళ్లయిన ఒక అమ్మాయి.. తన భర్త పనిచేసే చోట, ఆయనతో కలిసి పనిచేసే జోలీన్ అనే అందమైన అమ్మాయిని వేడుకునే పాట! అప్పట్లో ఈ పాటను రాసి, పాడింది డాలీ పార్టన్. ఆ తర్వాత చాలామంది పాప్ సింగర్‌లు ఈ పాటను పాడారు. పాడుతూనే ఉన్నారు. ఇప్పుడు అదే పాటను అదే డాలీ పార్టన్ ఈ 70 ఏళ్ల వయసులో మళ్లీ ఫ్రెష్‌గా పాడారు. డాలీ అనుభవంలోంచి వచ్చిన పాట ఇది. 1973 అక్టోబర్‌లో రిలీజ్ అయిన డాలీ ఫస్ట్ సింగిల్ ఇది.
‘ఆఫ్ ద సేమ్ నేమ్’ అనే ట్రాక్‌లోనిది. 2004లో ‘రోలింగ్ స్టోన్’ మ్యాగజీన్ విడుదల చేసిన ‘ది 500 గ్రేటెస్ట్ సాంగ్స్ ఆఫ్ ఆల్ టైమ్’ జాబితాలో ‘ప్లీజ్ డోన్ట్..’ 217వ స్థానంలో నిలిచింది. ఇంతకీ ఈ జోలిన్ ఎవరు? డాలీ అభిమాని. డాలీ కెరియర్ ప్రారంభంలో ఆమె దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్న అమ్మాయి! తన భర్తను వలలో వేసుకుంటుందేమోనని డాలీ భయపడిన స్టన్నింగ్ బ్యూటీ క్యారెక్టర్‌కు ఈ అభిమాని పేరే పెట్టుకున్నారు డాలీ. తన హృదయేశ్వరుడిని ఎవరైనా ఎగరేసుకెళతారేమోనన్న అభద్రతలో ఉన్న అమ్మాయిలు ఈ పాటను విని కొంత ఊరటను పొందవచ్చు. వాళ్ల హృదయేశ్వరులను ఎగరేసుకుపోయే ఉద్దేశంలో ఉన్న అందమైన అమ్మాయిలు కూడా ఈ పాటను విని, అభద్రతలో ఉన్న అమ్మాయిల ఆవేదనను అర్థం చేసుకోవచ్చు.
కెన్ యు సింగ్ యువర్ ఎబిసి ఫర్ మి?
‘‘గుడ్మాణింగ్’’ (టీచర్ చెప్పింది)
‘‘గుడ్మాణింగ్ మిస్ సీసీ’’ (నవ్వుతూ చెప్పాడు)
‘‘హౌ యు డూయింగ్’’ (టీచర్ అడిగింది)
‘‘హౌ యు డూయింగ్’’ (వీడూ నవ్వుతూ చెప్పాడు)
‘‘ఐ యామ్ డూయింగ్ గుడ్. యు డూయింగ్ గుడ్’’(టీచర్)
‘‘ఎస్’’ (నవ్వుతూ చెప్పాడు)
‘‘ఓ.. కెన్ యు సింగ్ యువర్ ఎబిసీస్ ఫర్ మీ?’’ (టీచర్ అడిగింది)
వీడు ఏబీసీడులు ఎత్తుకున్నాడు. ఎలా ఎత్తుకున్నాడు? ఎలా కంటిన్యూ చేశాడు? ఎలా ది ఎండ్ చెప్పాడు? వీడియో చూడండి. చూశాక మీ ఫ్రెండ్స్‌కి చెప్పండి. దీన్ని బట్టి మీకేం అర్థమయిందో?
పార్చ్‌డ్ : అఫీషియల్ ట్రైలర్
పార్చ్‌డ్ అంటే ‘ఎండిపోయిన’ అని అర్థం. లీలాయాదవ్ డెరైక్షన్‌లో అజయ్‌దేవగణ్ నిర్మించిన ఈ చిత్రం ఇండియా బయట విడుదలై ఏడాది అవుతోంది. ఇండియాలో ఈ నెల 23న రిలీజ్ అవుతోంది. ఇప్పటికి ఈ మూవీకి 24 ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయి. అలాగని ఇది పూర్తిగా అవార్డు చిత్రమనో, ఆర్ట్ కావ్యమనో అనుకోనక్కర్లేదు. ప్రాచీన ఆచారాలను పాటించే భారతదేశపు గ్రామాల్లో స్త్రీల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో రాణి, లజ్జో, బిజిలీ అనే ముగ్గురు అమ్మాయిల జీవితాల ద్వారా డెరైక్టర్ చూపించారు. చిత్రం మనసును కదిలిస్తుంది. చివరికి ముగ్గురూ విముక్తి పొందుతారు. విముక్తి కోసం ఆడపిల్లలు ఎంత పోరాటాం చెయ్యాలో ఇందులో చూస్తే కనుక ప్రతి ఇంటి ఆడపిల్లకూ చెయ్యెత్తి నమస్కరించాలనిపిస్తుంది. రాధికా ఆప్టే, తన్నిష్ణా చటర్జీ, సుర్వీన్ చావ్లా.. ఈ చిత్రంలోని ఆ ముగ్గురు అమ్మాయిలు.
మొవానా : అఫీషియల్ ట్రైలర్
నవంబర్ 24 ‘థాంక్స్‌గివింగ్ డే’! చాలా దూరమే ఉంది. బట్, గుర్తుంచుకోవలసిన సంగతి.. ఈ ఏడాది ప్రపంచ సినీ అభిమానులంతా వాల్ట్ డిస్నీకి థాంక్స్ చెప్పుకోవాలి. వాల్డ్ డిస్నీ నిర్మిస్తున్న హాలీవుడ్ ఏనిమేటెడ్ మూవీ ‘మొవానా’.. థాంక్స్‌గివింగ్ డేకి ముందురోజే విడుదలవుతోంది. ఇందులో మొవానా అనే కొండజాతి టీనేజర్ అసలు తను ఎవరో తెలుసుకోడానికి తన పూర్వీకుల జాడలను అన్వేషిస్తూ, సముద్రజలాల మీద సాహసయాత్ర ప్రారంభిస్తుంది. సముద్రం మీద అమెకు ‘మాయీ’ అనే డెమిగాడ్ (సగం మనిషి, సగం దేవుడు) తోడవుతాడు. మొవానాకు దారి చూపుతూ ఉంటాడు. మధ్యలో ప్రమాదాలు ఎదురౌతాయి. భయంకరమైన ఆకారాలు పీడించడానికి వస్తాయి. ఇద్దరూ కలిసి అన్నిటినీ ఎదుర్కొంటారు. ఈ అప్‌కమింగ్ 3డి కంప్యూటర్ ఏనిమేటెడ్ మ్యూజికల్ ఫ్యాంటసీ కామెడీ ఎడ్వంచరస్ ఫిల్మ్.. మనల్ని ఊరిసి సలపనివ్వకుండా వినోదంలో ముంచెత్తబోతోందని వీడియోలో వండర్‌ఫుల్ ఇండికేషన్స్ ఉన్నాయి. అందుకే వాల్ట్ డిస్నీకి థాంక్స్ చెప్పుకోవాలి.