మగాడు ఏడవడా? ఏడవకూడదా? | thousand reasons for women tears | Sakshi
Sakshi News home page

మగాడు ఏడవడా? ఏడవకూడదా?

Published Wed, Apr 16 2014 12:58 AM | Last Updated on Tue, Oct 2 2018 2:44 PM

మగాడు ఏడవడా?  ఏడవకూడదా? - Sakshi

మగాడు ఏడవడా? ఏడవకూడదా?

 ఈ మధ్యనే టీవీ చూస్తుండగా ఓ పాత సినిమాలో డైలాగ్ వినపడింది... ‘ఆడవారి కన్నీటికి వెయ్యి కారణాలుండొచ్చు. కానీ మగాడి కన్నీటికి మాత్రమే ఆడది కారణం’ అని.

 సినిమాలోని ఈ పంచ్ డైలాగ్ ఉద్దేశమేమిటన్నది వేరే కథ. దాన్ని పక్కన పెడితే ఆడాళ్ల కంటే మగాళ్ళు చాలా తక్కువ సార్లు ఏడుస్తారనే కోణంలో దీన్ని చూడాలి. మగాడు చాలా అరుదుగా మాత్రమే ఏడుస్తాడనే విషయాన్ని స్త్రీ సమాజంతో సహా అందరూ అంగీకరిస్తారు. అవును, ఎందుకు? ఏడుపు రాకనా? ఏడవ లేకనా? ఏడవ కూడదనా?
 
 ఏదైనా ఒక పనిని సమాజం అంగీకరించకపోతే అది క్రమంగా నిబంధన అయి కూర్చుంటుంది. బహుశా మగాడి నుంచి ఏడుపును మైనస్ చేసింది ఇటువంటి చర్యే కావచ్చు. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ‘ఏరా ఆడదానిలా ఏడుస్తున్నావేంటి’ అనే తిట్టుతో కూడిన వెక్కిరింపు ప్రశ్న వినకుండా బహుశా ఏ పురుషుడూ పెరిగిపెద్దయి ఉండడు.

మగాడు ఏడవటాన్ని సమాజం అంతగా వ్యతిరేకించబట్టే ఏడ్చే మగాళ్ల సంఖ్య కనుమరుగైంది. కాదు..కాదు, మగాడి నుంచి ఏడుపు కనుమరుగైంది. దీన్ని సమాజం ఎన్ని కోణాల్లో అణచివేస్తుందంటే, ‘ఏడ్చే మగాణ్ణి నమ్మకూడదు’ అంటారు. ఇన్ని మాటలన్నాక ఎట్లా ఏడుపొస్తుంది?
 
అంతేకాదు, టెక్నికల్‌గా కూడా మగాడు ఏడవటానికి ఏనాడూ అనుకూలమైన పరిస్థితులు లేవు. ఇంట్లో ఏదైనా  మరణం సంభవిస్తే స్త్రీలు తీవ్రంగా రోదిస్తుంటారు. వారితో పాటు మగాళ్లు కూడా ఏడుస్తూ కూర్చుంటే తదనంతర కార్యక్రమాలు చేసేదెవరు? అపుడు కూడా సెలైన్సర్ పెట్టిన తుపాకిలా లోలోపల ఏడుస్తూ మరో పనిచేసుకుంటూ ఉంటాడు.

అంటే గగ్గోలు పెట్టి ఏడవనంత మాత్రాన ఏడ్చేంత బాధ వారిలో లేదని కాదు కదా. ఇలాంటి మరో సందర్భమే చూస్తే పిల్లలకు ఏమైనా అయితే తల్లి కడుపుకోతతో బాధపడుతూ రోదిస్తుంది. భర్త తనూ ఏడుస్తూ కూర్చోలేడు. తనను తాను సముదాయించుకుని భార్యను ఓదార్చాలి. అంటే మగాడు ఏడుపును త్యాగం చేస్తూ ఉన్నాడు.
 
 ఇది ఒకటీ రెండు సందర్భాల్లో కాదు, అనేక సందర్భాల్లో, అనేక తరాలుగా! ఏడుపును ఎందుకు త్యాగం చేయాలి. చేయొద్దు. కన్నీరు పెడితే తప్పు కాదు, పాపం అంతకన్నా కాదు. ముందు మగాళ్లు ఈ భావన పోనిచ్చుకోవాలి. స్త్రీ ప్రతి చిన్నదానికీ పెద్దదానికీ ఏడిస్తే, మగాడు ఏడుపు వచ్చినపుడన్నా ఏడవకపోతే ఎలా? ఇదేదో వారితో పోటీపడడం కోసమని కాదు. మనసు తేలిక చేసుకోమని.
 
 కానీ, ఎవరూ చెప్పక్కర్లేకుండానే ఒక్కచోట మాత్రం (కూతురున్న) ప్రతి మగాడూ తప్పకుండా ఏడుస్తాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి పెళ్లి చేసి పంపే ప్రతి తండ్రీ కచ్చితంగా కన్నీళ్ళు పెట్టుకుంటాడు. అవతల అద్భుతమైన సంబంధమే కావచ్చు. మంచి అల్లుడే కావచ్చు...కానీ కచ్చితంగా కన్నీళ్ళు పెడతాడు. అది తన జీవితంలో భాగం అనుకున్నది తనకు దూరమైపోతుందేమోనన్న బాధలో నుంచి పొంగుకొచ్చే కన్నీరు. ఆ ఏడుపును మాత్రం ఎవరూ కించపరచరు. ఎవరూ ఎగతాళి చేయరు.
 
 శాస్త్రాల పరంగా చూస్తే మగాళ్లు తరచుగా ఏడవకపోవడానికి కొన్ని సైకలాజికల్ కారణాలు కూడా ఉన్నాయి. ఆడవాళ్లకు ఎమోషన్స్ ముందుంటే మగాళ్లకు వెనకుంటాయి. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా సెంటిమెంట్లకు, భావోద్వేగాలకు గురవడం వారి హార్మోన్ల ప్రభావమే. స్త్రీలలో లెఫ్ట్‌బ్రెయిన్‌కూ, రైట్ బ్రెయిన్‌కూ మధ్య సంబంధాలు గాడంగా ఉంటాయి.
 
 దీంతో లెఫ్ట్ (లాజిక్) రైట్ (ఎమోషన్స్) రెండింటి సమన్వయం స్త్రీలలో ఎక్కువుండటం వల్ల వారిలో భావోద్వేగాలు ఎక్కువగా పనిచేస్తాయని తేల్చారు. అందుకే వారు సులువుగా ఏడుస్తారు. ఈ రెండింటి సమన్వయం పురుషుల్లో అంత వేగంగా, సులువుగా జరగకపోవడం వల్ల మగాళ్లు వెంటనే భావోద్వేగాలకు గురికారని సైకియాట్రిస్టులు చెబుతారు. అదండీ కథ. ప్రపంచంలో ప్రతి విజయం వెనుక కొన్ని త్యాగాలుంటాయి. అలాగే, పురుష సమాజం విజయం వెనుక కూడా ఇలాంటి త్యాగాలెన్నో ఉంటాయి, ఉన్నాయి!
 - ప్రకాష్ చిమ్మల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement