
‘ప్రతి వస్తువుకూ ఏదో ఒక జకాత్ ఉన్నట్లుగానే, శరీరానికీ జకాత్ ఉంది. అదే ’రోజా’ అని మహాప్రవక్త సెలవిచ్చారు. రమజాన్ నుండి రమజాన్ వరకు ప్రతినెలా మూడురోజులు పాటించడం పుణ్యఫలం రీత్యా సదా ఉపవాసాలు పాటించడంతో సమానమని ప్రవక్త మహనీయులు చెప్పారు. అంటే రమజాన్ నెలలో పాటించే 30 రోజాలు కాకుండా ప్రతినెలా మూడురోజులు రోజా పాటించడం ఎంతో పుణ్యప్రదం. శాశ్వతపుణ్యఫలం పొందాలనుకునేవారు నెలకు మూడురోజులు ఉపవాసాలు పాటించే అలవాటు చేసుకోవాలి. ధార్మిక దృష్టికోణంలోనే కాకుండా నెలకు మూడురోజులు ఉపవాసాలు చేయడం ఆరోగ్య పరిరక్షణకూ దివ్య ఔషధంగా ఉపకరిస్తుంది.
ఈ విషయం అబూజర్ (ర)కు ఉపదేశిస్తూ..‘నువ్వు నెలకు మూడురోజాలు పాటించాలనుకుంటే .. పదమూడు, పద్నాలుగు, పదిహేను తేదీల్లో పాటించు.’అని చెప్పారు. వీటిని ధార్మిక పరిభాషలో ‘అయ్యామె బైజ్ ’ అంటారు. ఈ తేదీల్లో పాటించడం వీలుకాకపోతే ఎప్పుడైనా పాటించవచ్చు. ఎలాంటి తప్పూ లేదు. ప్రవక్తవారు కూడా నఫిల్ రోజాలను అప్పుడప్పుడూ పాటించేవారు.. అప్పుడప్పుడూ వదిలేసేవారు. అయితే షాబాన్ నెలలో మాత్రం ఆయన అధికంగా నఫిల్ రోజాలు ఆచరించే వారు. దీనికి అనేక కారణాలున్నాయి. కొన్ని హదీసుల్లో సూచన ప్రాయంగా చెప్పబడిన ప్రకారం.. ప్రవక్తవారిని ఈవిషయమై అడిగినప్పుడు ఆయన ఇలా చెప్పారు.
‘షాబాన్ నెలలో అల్లాహ్ దివ్యసన్నిధిలో దాసుల కర్మలు ప్రవేశ పెట్టబడతాయి. ఆ క్రమంలో నా కర్మలు కూడా ప్రవేశపెట్టబడినప్పుడు రోజా స్థితిలో ఉండాలన్నది నా కోరిక.’ అన్నారు. హజ్రత్ ఆయిషా సిద్దీఖా(ర.అన్ హా)గారి హదీసు ఇలా ఉంది. ‘ప్రవక్తవారు షాబాన్ నెలలో ఇంత అధికంగా రోజాలు ఎందుకు పాటించే వారంటే, సంవత్సరం మొత్తంలో మరణించబోయేవారి జాబితాను ఈనెలలోనే మలకుల్ మౌత్ (ప్రాణాలు తీసే దూత)కు సమర్పించడం జరుగుతుంది. అయితే ఆ దూత ప్రవక్త వారి వద్దకు వచ్చినప్పుడు రోజా స్థితిలో ఉండాలని ఆయన కోరుకునేవారు.’
అంతేగాక, రాబోయే రమజాన్ (షాబాన్ తరువాత రమజాన్ )నెలతో, దాని ప్రత్యేక శుభాలతో సాన్నిహిత్యం, మానసిక, ఆత్మీయ సంబ«ందాన్ని ఏర్పరచుకోవాలన్న ప్రత్యేక శ్రద్ధాసక్తులు కూడా బహుశా దీనికి కారణం కావచ్చు.
షాబాన్ రోజాలతో రమజాన్ రోజాలకు ఉన్న సంబంధం ఎలాంటిదంటే, ఫర్జ్ నమాజులకు ముందు చేయబడే నఫిల్ నమాజులకు ఫర్జ్ నమాజులతో ఉన్న సంబంధం లాంటిది. కనుక రాబోయే రమజాన్‌కు స్వాగతం పలకడానికి మనసును మానసికంగా సంసిద్ధం చేసుకోడానికి షాబాన్ నెల నఫిల్ రోజాలు, ఆరాధనలు ఇతోధికంగా దోహదపడతాయి. అందుకని వీలైనంత అధికంగా ఈనెలలో రోజాలు పాటిస్తూ ఆత్మను శరీరాన్ని సంసిద్ధం చేసుకోడానికి ప్రయత్నించాలి. తద్వారా ప్రవక్త వారి ఆచరణా విధానాన్ని పాటించిన వారమై, అల్లాహ్ సామీప్యతను, ప్రేమను పొందగలుగుతాము. అందరికీ రమజానుకు ఘనస్వాగతం పలికే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం.
ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్