ప్రేరణ
క్రికెట్.. మనదేశంలో ఈ క్రీడను అభిమానించని వారుండరు. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఇష్టమైన ఆట క్రికెట్. ఎందరో క్రీడాకారులు క్రికెట్‌లో అద్భుతాలు సృష్టించారు. ఎందరికో అభిమానపాత్రులయ్యారు. కేవలం ఆటతీరుతోనే కాకుండా తమ జీవితం ద్వారా మంచి సందేశమిచ్చే ఆటగాళ్లూ ఉన్నారు. అలాంటి ముగ్గురి గురించి తెలుసుకుందాం..
విన్నర్ మైండ్‌సెట్‌ను అలవర్చుకోవాలి
టైగర్ పటౌడీ... నవాబుల కుటుంబంలో జన్మించాడు. ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. క్రికెట్ క్రీడాకారుడిగా కెరీర్ ప్రారంభించాడు. కేవలం 20 ఏళ్ల వయసులోనే తన ఆటతీరుతో ప్రపంచాన్ని అబ్బురపర్చాడు. కానీ, అంతలోనే ఊహించని ఆపద ఎదురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. టైగర్ తన కుడి కంటి చూపును కోల్పోయాడు. మిగిలిన ఒక కంటితో చూడడం, పనులు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కనీసం తేనీరును కూడా కప్పులో సరిగ్గా వంపుకోలేకపోయేవాడు. ఇక క్రికెట్ ఎలా ఆడగలడు?
క్రికెట్‌లో రాణించాలంటే మంచి కంటిచూపు ఉండాలి. మరి టైగర్ పటౌడీ కెరీర్ ముగిసినట్లేనా? క్రికెట్‌కు స్వస్తి చెప్పాల్సిందేనా? ఆయన మాత్రం అలా ఆనుకోలేదు. ఒక కన్ను పోయినందుకు బాధపడకుండా మరో కన్ను ఇంకా మిగిలే ఉన్నందుకు సంతోషించాడు. పోగొట్టుకున్నదాని గురించి ఆలోచించకుండా తన వద్ద ఉన్నదానిపైనే దృష్టిపెట్టాడు. విన్నర్ మైండ్‌సెట్‌ను అలవర్చుకున్నాడు. ఒక కంటితో చూస్తూ క్రికెట్ ఆడడం సాధన చేశాడు. బ్యాట్ పట్టుకొని మళ్లీ మైదానంలోకి దిగాడు. వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్లాడు. తర్వాత భారత క్రికెట్ జట్టుకు అత్యంత పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా పేరుగాంచాడు.
జీవితంలో అనుకోని ప్రమాదాలు, అపజయాలు అనివార్యం. అయితే వాటి పట్ల మనం ఎలా స్పందిస్తున్నాం అనే దాని బట్టే మన విజయం ఆధారపడి ఉంటుంది. ఈసారి పరాజయం పలకరించినప్పుడు పాతాళంలోకి కుంగిపోకుండా.. టైగర్ పటౌడీలా ఉవ్వెత్తున పైకి ఎగసిపడండి. విజయాన్ని అందుకోండి.
ఇతరులతో పోల్చుకోవద్దు
మిమ్మల్ని మీరు ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోవద్దు. శక్తి వంచన లేకుండా లక్ష్య సాధన కోసం కృషి చేయాలి. హోఖైతో జిమోమీ పేరు మీరెప్పుడైనా విన్నారా? చాలామంది విని ఉండరు. ఆయన ఒక క్రికెట్ క్రీడాకారుడు. నాగాలాండ్ రాష్ట్రంలోని యువకులకు ఆయన ఆరాధ్యదైవం. ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. గతంలో ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఎంపికయ్యాడు. నాగాలాండ్ నుంచి ఐపీఎల్‌కు ఎంపికైన మొట్టమొదటి క్రికెటర్ అయనే. జిమోమీ భారత జట్టు తరఫున ఆడి ఉండకపోవచ్చు. కానీ, తన రాష్ట్రంలో మాత్రం ఆయన హీరోనే. ఒక కుగ్రామం నుంచి వచ్చిన వ్యక్తి ఐపీఎల్‌కు ఎంపిక కావడం చిన్న విషయం కాదు.
ప్రతి ఒక్కరూ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ కాకపోవచ్చు. అందరూ సచిన్ టెండూల్కర్ కాలేరు. ఒక పెద్ద కంపెనీకి సీఈఓ కాకపోవచ్చు. అంతమాత్రాన ప్రయత్నం నిలిపివేయకూడదు. ఎవరి రంగంలో వారు ఎదిగేందుకు ప్రయత్నించాలి. ఎవరి పరుగును వారే పరుగెత్తాలి. మీలోని పూర్తి శక్తిసామర్థ్యాలను కేంద్రీకరించి పనిచేయడం ముఖ్యం. ఎవరి ప్రత్యేకత వారిదే. ఇతరులతో పోల్చుకుంటూ బాధపడొద్దు.
30 నిమిషాల అదనపు శ్రమ
ప్రతిరోజూ అదనంగా కేవలం 30 నిమిషాలు శ్రమించడం.. మీ జీవితాల్లో ఎనలేని మార్పును తీసుకొస్తుంది. భారత క్రికెట్ జట్టులో రాణించిన యూసుఫ్ పఠాన్ విషయంలో ఇది నిజమని రుజువైంది. పఠాన్ తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. తొలుత చాలా మ్యాచ్‌ల్లో ఎక్కువ పరుగులు చేయలేక చేతులెత్తేశాడు. విమర్శల పాలయ్యాడు. తన ఆటను పూర్తిగా సమీక్షించుకొని సాధనకు పదునుపెట్టాడు. తర్వాత మైదానంలో పరుగుల వరద పారించాడు. జట్టుకు విజయాలనందించాడు.
యూసుఫ్ పఠాన్‌లో మార్పు ఎలా సాధ్యమైంది. రోజూ అదనంగా 30 నుంచి 40 నిమిషాలపాటు సాధన చేయడం వల్ల మంచి క్రికెటర్‌గా పేరుతెచ్చుకున్నాడు. మైదానంలోంచి సహచరులు వెళ్లిపోయిన తర్వాత కూడా అదనంగా 30 నుంచి 40 నిమిషాలు ప్రాక్టీస్ చేసేవాడినని, ఏకాగ్రతతో బ్యాటింగ్ చేయడం అప్పుడే అలవడిందని ఓ ఇంటర్వ్యూలో పఠాన్ తెలిపాడు. శ్రమకు తగ్గ ఫలితం ఎప్పటికైనా దక్కుతుంది. మీరు కూడా రోజూ అదనంగా 30 నిమిషాలు కష్టపడండి. అది మీ కెరీర్‌లో ఎదుగుదలకు తప్పకుండా తోడ్పడుతుంది.
- ‘కెరీర్స్ 360’ సౌజన్యంతో
ముగ్గురు క్రికెటర్ల.. మూడు పాఠాలు
Published Mon, Jun 30 2014 1:13 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement