ఇప్పుడు దేశంలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులవాళ్లు, మైనారిటీలు ఎక్కువగా అంబేడ్కర్‌ను ఆరాధించటం వెనుక ఆయన సిద్ధాంతాల వల్ల తమ రక్షణ ఉంటుందని విశ్వసించడమే కారణం.
ఆచార్య కొలకలూరి ఇనాక్
భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామ కాలంలో తమ శక్తియుక్తుల్ని, ధన మాన ప్రాణాల్ని, సమయ సామర్థ్యాల్ని, విద్యావిజ్ఞాన వివేకాల్ని పణంగా పెట్టి, తృణప్రాయంగా భావించి, పోరాడిన ఎందరినో మర్చిపోయినా భారతీయులు అంబేడ్కరును మర్చిపోలేదు. ఆ మాటకొస్తే బ్రిటిష్ పాలకులూ అంబేడ్కర్‌ను ప్రేమించారు.
అంబేడ్కర్ విద్యావేత్తగా, మేధావిగా, ఆలోచనాపరుడుగా, ప్రపంచ విజ్ఞానఖనిగా, సామాజిక దార్శనికుడుగా, దీనజనోద్ధారకుడిగా చైతన్యమూర్తి అవుతున్న దశలో బ్రిటిష్ పాలకులు అంబేడ్కరును ప్రోత్సహించారు. తాము తలపెట్టిన హరిజనోద్యమ సారథిగా అతన్ని గుర్తించారు. సాహు మహరాజ్ కూడా అంబేడ్కర్‌ను ప్రోత్సహించారు. విద్య పూర్తయి వచ్చిన అంబేడ్కర్‌కు తన సంస్థానంలో ఉన్నత పదవినిచ్చిన ఆ సంస్థానాధీశుడికి, ఒక ఆయుధం అంబేడ్కర్ రూపంలో దొరికింది. ఆ ఆయుధంతో అస్పృశ్యతా నిర్మూలన అవకాశం దొరికిందని అంబేడ్కర్‌ను ప్రేమించాడు సాహు.
ఇక నెహ్రూ... అంబేడ్కర్ మేధావి అని, విద్యాసంపన్నుడని, తేజస్సంపన్నుడనే కాక, హరిజనులందరూ ఆనందిస్తారని తన మంత్రివర్గంలో ‘లా’ మంత్రిగా నియమించుకున్నాడు. అది అతడి అవసరం కావటంతో పాటు మిత్రుడన్న ప్రేమకూడా పనిచేసి ఉండాలి.
భారతీయుల ప్రేమ అంబేడ్కర్‌కు అందివచ్చిన వరం. పాకిస్తాన్ ఏర్పడేప్పుడు భారతీయులు సంచలించిపోయారు. భారతదేశం మరిన్ని ముక్కలు కాకుండా కాపాడటంలో అంబేడ్కరు దీక్ష అచంచలం. రాష్ట్రాల ప్రతిపత్తి చెడకుండా, దేశ సమగ్రత, సమైక్యత కాపాడేట్లుగా, రాజ్యాంగ రచన చేయటం కత్తిమీది సాము. స్వతంత్ర, స్వయం సత్తాక దేశంగా భారతదేశం ఉండటమేకాదు, రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తితో ప్రవర్తిల్లేట్లు రాజ్యాంగం రాసి భారతీయుల మన్ననలు పొందాడు అంబేద్కర్. తాను జీవితమంతా పోరాడిన హిందూమతానుయాయులు అంబేడ్కరును ఆరాధించటం విశేషాంశం. హిందూమతంతో అంబేడ్కరు పేచీ పడ్డాడు. వర్ణ వ్యవస్థను తిరస్కరించాడు. అస్పృశ్యుల కోసం ఆరాటపడ్డాడు. సాంఘిక పౌరుడుగా, రాజకీయ యోధుడుగా రాటుదేలాడు. వేదపురాణ ఇతిహాసాలేకాదు, ధర్మశాస్త్రాలన్నీ తిరస్కరించిన తత్త్వవేత్త. తాను హిందువుగా చావనని ప్రతిజ్ఞచేసి బౌద్ధమతంలోకి చేరి దీక్ష తీసుకొన్నాడు. అనుచరులకు దీక్ష ఇప్పించాడు.
ఇప్పుడు దేశంలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులవాళ్లు, మైనారిటీలు ఎక్కువగా అంబేడ్కర్‌ను ఆరాధించటం వెనుక ఆయన సిద్ధాంతాల వల్ల తమ రక్షణ ఉంటుందని విశ్వసించడమే కారణం. తమను అందరితో సమానంగా చూడటం, న్యాయం, స్వాతంత్య్రం, సమానత్వం, సోదరత్వం అందరికీ కాంక్షించటం, అందరికీ ఒక్క ఓటు - ఒక్క విలువ ప్రతిపాదించటం, ప్రభుత్వ సహాయ సహకారాలు పేదలకు అందేట్టు చూడటం, దళితులకు, గిరిజనులకు విద్యా ఉద్యోగాది రంగాలలో ప్రాధాన్యం కలిగించటం, వల్ల వీళ్లకు అంబేడ్కరు విముక్తిదాత, తమ నేత, రక్షణకర్తగా మారాడు.
అంబేడ్కరు పేదవాడుగా పుట్టి, పేదవాడుగా పరమపదించాడు. బొంబాయి హిందూకాలనీలో ఉన్న ఇల్లు ఇల్లు కాదు, గ్రంథాలయం. అది అనుచరుల చందాలతో కట్టిన భవనం. అంబేద్కరు సంపాదించినదంతా పుస్తకాలు, కలాలు. అంబేడ్కరు పార్థివ దేహాన్ని ఢిల్లీ నుంచి బొంబాయి పంపటానికి చిల్లి గవ్వలేదు. జగజ్జీవన్‌రాం ఆ ఏర్పాట్లు చేశాడు. అంతిమ సంస్కారం స్థానికులు చందాలతో సాగింది. దేశ చరిత్ర స్థితినీ, గతినీ శాసించిన మహోన్నతవ్యక్తి నిర్ధయుడుగా గతించాడు. ఈ పరిస్థితిని ఎవరైనా, ఇప్పుడు ఎవరితోనైనా పోల్చి చూస్తే అంబేడ్కర్ ఎంత త్యాగజీవో, ధన్యజీవో అర్థమవుతుంది.
(వ్యాసకర్త ప్రముఖ రచయిత, పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఫోన్: 9440243433)
అంబేడ్కర్‌ని ఎందుకని అందరూ ప్రేమిస్తారు?
Published Tue, Apr 14 2015 12:12 AM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM
Advertisement
Advertisement