పరమాత్ముడు పరమ ఆప్తుడు | Tomorrow krishnashtami | Sakshi
Sakshi News home page

పరమాత్ముడు పరమ ఆప్తుడు

Published Sun, Sep 2 2018 12:24 AM | Last Updated on Sun, Sep 2 2018 12:24 AM

Tomorrow  krishnashtami - Sakshi

కిట్టనివాళ్లు మాయగాడు అన్నారు. ఓరిమితో సహించాడు. శృంగార పురుషుడన్నారు... కిమ్మనలేదు. కొంటెకృష్ణుడని ఆడిపోసుకున్నారు... ఆగ్రహించలేదు. నల్లనివాడనీ, వెన్నదొంగ అనీ అన్నారు. కిమ్మనలేదు. తాత్వికుడన్నారు. కాదనలేదు. పరమాత్ముడవంటూ పూజలు చేశారు, కాదు పొమ్మనలేదు, తామరాకు మీది నీటిబొట్టులా దేనికీ చలించకుండా ఎవరు ఏ దృష్టితోచూస్తే ఆ దృష్టితో దర్శనమిచ్చాడు. పుట్టింది మొదలు అవతార పరిసమాప్తి వరకు అడుగడుగునా అనేక లీలలను ప్రదర్శించాడు. అందుకే పురాణాలు శ్రీకృష్ణుని లీలామానుష విగ్రహునిగా పేర్కొన్నాయి. నదులన్నీ సముద్రంలో చేరినట్లు కృష్ణుడు అందరికీ ఆప్తుడయ్యాడు. పరమాత్ముడయ్యాడు.

త్రేతాయుగంలో దుష్టశిక్షణ అంతా మానవ ధర్మానికి కట్టుబడి జరిగిందే. అయితే ద్వాపరయుగానికి వచ్చేసరికి పరిస్థితులలో పెనుమార్పులు వచ్చాయి. దాంతో శ్రీహరి ఆయా పరిస్థితులకు అనుగుణంగా జవాబు చెప్పవలసి వచ్చింది. లక్ష్యం లోకోత్తరమైనది కాబట్టి ఏ మార్గాన్ని అనుసరించినా, అందులో లక్ష్యసాధనే ప్రధాన ధ్యేయం. అంటే వజ్రాన్ని వజ్రంతో కోసినట్లు అధర్మాన్ని అధర్మంతోనే జయించి, ధర్మాన్ని రక్షించడమే కృష్ణావతార ధ్యేయం. అందుకే కొన్ని సందర్భాలలో శ్రీకృష్ణుడు అవలంబించిన విధానాలు అధర్మంగా అగుపించవచ్చు. అయితే అవి యుగధర్మానుసారం జరిగినవే!

పూర్ణ పురుషుడు...
ఒక పురుషునిలో ఏమేమి లక్షణాలుంటే స్త్రీలందరికీ నచ్చుతాడో ఆయనకు బాగా తెలుసు. అందుకే తాను పరమాత్ముడయినప్పటికీ, ఒక సాధారణ బాలకునిలా ఎన్నోచిలిపి చేష్టలు చేశాడు. అమాయక బాలునిలా మన్ను తిన్నాడు. అదేమని అడిగిన అమ్మకు నోటిలో పదునాలుగు భువనభాండాలు చూపించాడు. అమ్మ ప్రేమపాశానికి లొంగిపోయి, గంధర్వులకి శాపవిముక్తి కావించాడు. మేనమామ కంసుడు పంపిన రాక్షసులను మర్ధించి, వారికి మోక్షం ప్రసాదించాడు. గోవులు కాచాడు. గోవర్థనగిరిని చిటికెన వేలిపై నిలిపి గోకులాన్ని రక్షించాడు. కాళియుడి పీచమణిచాడు. ఉట్టికొట్టాడు, వెన్న దొంగిలించాడు. గోపికల చీరలు ఎత్తుకెళ్లాడు. తోటిగోపాలకుల ఆనందం కోసం మురళి వాయించాడు. రాధను ప్రేమించాడు. 

తండ్రి బలవంతం మేరకు ఇష్టంలేని పెండ్లికి తలవంచిన రుక్మిణి కోసం యుద్ధం చేశాడు. ఇష్టసఖి సత్యభామ కోపంతో తన్నినా చిరునవ్వే సమాధానంగా చూపాడు. చివరకు ఆమెకోసం తులాభారం తూగాడు. ద్రౌపదికి మానసంరక్షణ చేశాడు. సుభద్రాతనయుడైన అభిమన్యుని ప్రేమను గెలిపించాడు. పాండవులకు అన్నింటా తానే అయి నిలిచాడు. వారికోసం దౌత్యం కూడా నడిపాడు. చివరికి అర్జునునికి రథసారథిగా మారాడు. ఆత్మస్థైర్యం కోల్పోయిన అర్జునుని కోసం గీతాచార్యునిగా మారి కొన్ని తరాల పాటు గ్రోలినా తరగనటువంటి వంటి గీతామృతాన్ని మానవాళికి ధారపోశాడు.

గోపాలకృష్ణుడెలా అయ్యాడు?
‘గో’ అంటే ఆవు అని సామాన్యార్థం. గోపాలకుడు అంటే గోవులను కాసే వ్యక్తి. అయితే ‘గో’ అనే శబ్దానికి కిరణాలు, భూమి, పంచభూతాలు, జీవుడు అన్నవి విశేషార్థాలు. కాబట్టి గోవులను పాలించేవాడు అంటే సంరక్షించేవాడు కాబట్టి ఆయన గోపాలకృష్ణుడయ్యాడు.

కృష్ణుడు అంటే క్లేశాలను, కష్టాలను పోగొట్టేవాడని అర్థం. చూపరులను సమ్మోహనం చేసే చిరునవ్వు, అందరినీ ఆనంద పరవశులను చేసే మురళీగానం, మనోల్లాస కరమైన సంభాషణలతో అందరినీ అలరించాడు. పుట్టింది మొదలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, దేనికీ భయపడకుండా, ఎవరికీ లొంగకుండా పరిస్థితులను ఎదిరించి పోరాడాడు. చేపట్టిన ప్రతిపనిలోనూ విజయం సాధించాడు. నమ్మినవారికి అండగా నిలిచాడు. ఆ స్వామిని సేవించిన వారికి మాయ అంటదని శ్రీమద్భాగవతం చెబుతోంది.

మోహన రూపం
శ్రీకృష్ణునిది మేఖశ్యామల వర్ణం. అంటే చామన చాయ. నల్లని రంగు దేనికీ తక్కువ కాదని చాటటమే అందులోని అంతరార్థం. బంగారు పిందెల మొలతాడు, సరిమువ్వగజ్జెలు, శిఖలో పింఛం, పట్టు దట్టి, కస్తూరీ తిలకం, వక్షస్థలంలో కౌస్తుభమణి... ఇవన్నీ ఆయన విభవానికి చిహ్నాలు. నాయనమ్మ అలంకరించిన నెమలి పింఛాన్ని ఆమె ప్రీతికోసం ఎల్లప్పుడూ ధరించేవాడు. చేతిలోని మురళి గోవులను, గోపబాలకులను అలరించేందుకు ఉద్దేశించినదే.

మానవునిగా జన్మించినందుకు యశోద వాత్సల్యాన్ని నిండుగా అనుభవించాడు. పసితనంలోని అమాయకత్వాన్ని, నిర్మలత్వాన్ని మెండుగా గ్రోలాడు. బాల్యంలోని మాధుర్యాన్ని హాయిగా ఆస్వాదించాడు. లోకానికి కంటకంగా మారిన కంస, నరకాసురాది రక్కసులను సంహరించాడు. చివరకు తానే దూర్వాసుని శాపానికి కట్టుబడి సామాన్య మానవునిలా బోయవాని చేతిలో మరణించాడు.

కృష్ణాష్టమిని ఎలా జరుపుకోవాలి?
కృష్టజన్మాష్టమీ వ్రతం చేసుకునేవారు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, షోడశోపచారాలతో కృష్ణుని పూజించాలి. పగలంతా ఉపవసించి సాయంకాలం చిన్నికృష్ణుని విగ్రహాన్ని పూజించి, తర్వాత ఊయలలో ఉంచి, ఊపాలి.దేవకీదేవి బాలకృష్ణునికి స్తన్యమిస్తున్నట్లుగా ఉండే విగ్రహాన్ని పూజిస్తే మంచిది. కృష్ణునికి ప్రీతికరమైన పాలు, వెన్న, పండ్లు, అటుకులు మొదలైన వాటిని నైవేద్యం పెట్టి, వాటిని ప్రసాదంగా ఆరగించడం వల్ల అన్నింటా జయం సిద్ధిస్తుందని పురాణోక్తి. ఈ పుణ్యతిథి నాడు కృష్ణుని పూజించి, భాగవత గ్రంథాన్ని పఠించినా, దానం చేసినా సకల పాపాలూ తొలగి, చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయని భాగవతోక్తి.

వెన్న ఎందుకు దొంగిలించాడు?
వెన్న నల్లని కుండలలో కదా ఉండేది. మృణ్మయ రూపమైన మనుష్యశరీరమే మృత్తికారూపమైన వెన్నకుండ. మన మనస్సే కుండలోని వెన్న. అజ్ఞానానికి సంకేతం నల్లని కుండ. వెలుగుకు, విజ్ఞానానికి చిహ్నం తెల్లని వెన్న. తన భక్తుల మనసులోని అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును నింపడం కోసమే కన్నయ్య వెన్న తినేవాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement