నా కెరీర్ మొత్తం లేవడం పడడం... పడడం లేవడమే! | totally my career up and down | Sakshi
Sakshi News home page

నా కెరీర్ మొత్తం లేవడం పడడం... పడడం లేవడమే!

Published Sat, Dec 21 2013 11:57 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

totally my career up and down

ఎమ్మెస్ రాజు ఎమ్మే ఎకనమిక్స్.
 అర్థశాస్త్ర పట్టభద్రుడు ఎలా ఉండాలి? పైగా నిర్మాత!
 ఎలా ఉండాలి?
 ఎంత పెట్టి, ఎంత రాబట్టాలో తెలిసుండాలి.
 పోగొట్టుకున్నదుంటే, తిరిగి పోగేసుకుని లాభపడాలి. అవునా?
 ఈయనేం చేశారో చూడండి!
 ఒక హీరో కన్నా ఎక్కువగా దుస్సాహసాలు చేశారు.
 ఒక దర్శకుడి కన్నా ఎక్కువగా ప్రయోగాలు చేశారు.
 హిట్లనుంచీ ఫ్లాపుల్లోకి... ప్లాఫుల్లోంచి హిట్లలోకి...
 అత్యంత ప్రమాదకరమైన విన్యాసాలు ఎన్నో చేశారు.
 అన్నీ డబ్బుతోనే!
 ఏం చేసినా - తనే కష్టపడ్డారు, తనే నష్టపడ్డారు.
 తెలిసి చేసిన మిస్టేక్‌లు కొన్ని, తెలియక జరిగిపోయినవి కొన్ని.
 ‘‘ఎందుకండీ రాజుగారూ ఇలా?!’’ అంటే -
 ‘‘మిస్టేక్‌లు జరక్కుండా ఎలా నేర్చుకుంటామండీ’’ అంటారు!
 ఇంతకీ నిర్మాత నేర్చుకోవలసిందేమిటి?
 ఎమ్మెస్ రాజుకు పాతికేళ్ల సినీ జీవితం నేర్పిందేమిటి?
 చదవండి... ఈవారం ‘తారాంతరంగం’.

 
 మీ నుంచి సినిమా వచ్చి చాలాకాలమైంది. సెలైంట్ అయ్యారేం?

 ఎమ్మెస్ రాజు: ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ తర్వాత ఎందుకో.. నా ఆలోచనలు యూత్‌కి కాస్త దూరంగా జరిగాయేమో అనిపించింది. అందుకే.. మళ్లీ వారికి దగ్గర కావాలనుకుంటున్నాను. ప్రస్తుతం యూత్ ఇష్టపడే కథను తయారుచేసే పనిలో ఉన్నాను. ఇందులో  భాగంగానే.. నేటి యువతరం పోకడలను వారికి తెలీకుండా వారి మధ్యే ఉండి గమనిస్తున్నా. త్వరలో నా నుంచి ఓ అద్భుతమైన యూత్‌స్టోరీని మీరు ఆశించొచ్చు.


  ఒక్కసారి మీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళదాం. నిర్మాత కొడుకు కాబట్టే మీరు నిర్మాత అయ్యారా?
 ఎమ్మెస్ రాజు: మా నాన్న రాయపరాజుగారు... కృష్ణంరాజు, చిరంజీవి కాంబినేషన్‌లో ‘ప్రేమతరంగాలు’ సినిమా తీశారు. అప్పట్లో పెద్దగా ఆడలేదు. తర్వాత చిరంజీవిగారితో ‘ప్రియ’ తీశారు. అది కూడా నష్టాలనే తెచ్చింది. అయితే... దాసరిగారి దర్శకత్వంలో తీసిన ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’ మాత్రం మాకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నాన్న తీసిన కొన్ని చిత్రాలు అనుకున్నట్లు ఆడలేదు. దాంతో ఆయన ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయారు. ఇక నా విషయానికొస్తే... చిన్నతనం నుంచీ నేను సినీ నేపథ్యంలోనే పెరిగినా.. ఏనాడూ యాక్టింగ్ సైడ్‌కానీ, డెరైక్షన్ సైడ్ కానీ, రచన సైడ్ కానీ ఆలోచించలేదు. పైగా అప్పటి పరిస్థితుల్లో నాకు నాన్నను ఫాలో అవ్వడం తప్ప వేరొకటి తెలీదు.  అందుకే నిర్మాతగా మారాను.

 24 శాఖల్లోనూ నిర్మాతలు ఇన్వాల్వ్ అయ్యే నాగిరెడ్డి, చక్రపాణి నాటి రోజులు పోయి, నిర్మాత అంటే... కేవలం డబ్బు పెట్టేవాడు మాత్రమే అన్నట్లు పరిస్థితులు తయారవుతున్న తరుణంలో నిర్మాతగా మారారు. నాటి చరిత్రను పునరావృతం చేసి, ప్రతి శాఖలో మీ ముద్ర చూపించారు.
 
ఎమ్మెస్ రాజు: అది కరెక్ట్ కాదండీ. నాగిరెడ్డి, చక్రపాణి తర్వాత రామానాయుడు ఉన్నారు. విజయావారి ట్రెండ్‌ని నాయుడుగారు కొనసాగించారు. నాయుడుగారి తర్వాత సి.అశ్వనీదత్ కూడా ప్రతిశాఖలో తన ముద్ర చూపించారు. అలాగే శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, ఇప్పటి నిర్మాతల్లో దిల్ రాజు. లేటెస్ట్‌గా చెప్పాలంటే దామోదరప్రసాద్.. ఇలా మంచి నిర్మాతలు ఎప్పుడూ ఉన్నారు. పర్సంటేజ్ తక్కువ అంతే.


 బాల్యం నుంచి సినిమాతో అటాచ్‌మెంట్ ఉండేదా?
 ఎమ్మెస్ రాజు: నేను చిన్నప్పట్నుంచీ ఎన్టీఆర్‌గారి అభిమానిని. సినిమాపై నాకు అభిమానం మొదలైంది ఆయన సినిమాల నుంచే. మా రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు స్టార్‌హీరోలు. వారి సినిమాలంటే.. అప్పట్లో రీ-రన్స్ ఉండేవి. అందుకే.. మాగ్జిమమ్ వారి సినిమాలు చూసేశాను. కొన్నిరోజులు గడిచాక వీసీఆర్‌ల యుగం వచ్చింది. వాటి పుణ్యమా అని నేను పుట్టక ముందు వచ్చిన ఇతర భాషలకు చెందిన క్లాసిక్స్ అన్నీ చూసేశాను. అయితే సినిమాను టైంపాస్‌గా చూసేవాణ్ణి కాదు. ఓ సినిమాను ‘హిట్’ అంటే, అది ఎందుకు హిట్ అయ్యింది? దానిలో ఉన్న ప్లస్ పాయింట్‌లేంటి? ఎందుకు ఆ సినిమా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది?’ అనే విషయాలు తెలుసుకోవడానికి మళ్లీ మళ్లీ చూసేవాణ్ణి. అలాగే సినిమా ఫ్లాప్ అయితే.. ఆడియన్స్‌కి ఇందులో నచ్చని అంశం ఏంటని పరిశీలించి మరీ తెలుసుకునేవాణ్ణి. ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశాక కూడా.. ఉద్యోగం చూసుకోవాలని నాకు అనిపించలేదు. సినిమాలపైనే ధ్యాస. నాన్న ప్రొడక్షన్ ఆపేద్దామనుకుంటున్న టైమ్‌లో ధైర్యంగా నిర్మాతగా మారాను.


  మీరు పుట్టింది, పెరిగింది ఎక్కడ?
 ఎమ్మెస్ రాజు: మాది పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని ఓ పల్లెటూరు. పుట్టింది మాత్రం రాజమండ్రిలో. కొంతవరకూ అక్కడే చదువుకున్నాను. వ్యాపారరీత్యా కృష్ణాజిల్లా గుడివాడకు షిఫ్టయ్యాం. అక్కడే హైస్కూల్ చదువు పూర్తి చేసి, ఏఎన్నార్ కాలేజ్‌లో ఇంటర్ జాయినయ్యాను. కొన్నాళ్లకు నాన్న నిర్మాత కావడంతో మకాం మద్రాస్‌కు మారింది. అక్కడి వివేకానంద కాలేజ్‌లో పీజీ పూర్తి చేశాను. ఆ రోజుల్లో సినిమాల తర్వాత నాకు అత్యంత ఇష్టమైంది క్రికెట్. నేను ఓపెనింగ్ బ్యాట్స్‌మేన్‌ని కూడా.


     నిర్మాతగా మీ తొలి అడుగు?
 ఎమ్మెస్ రాజు: ‘మనవడొస్తున్నాడు’. మా తమ్ముడు కూడా ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యాడు. ఎస్.ఎస్.ఫిలిం సర్క్యూట్ పతాకంపై ఆ సినిమా తీశాం. ‘మనవడొస్తున్నాడు’ నిర్మాణం విషయంలో మా కజిన్ కొంతవరకూ హెల్ప్ చేశాడు. నాన్నకు ఇండస్ట్రీలో మంచి గుడ్‌విల్ ఉంది. ఎన్ని కష్టాల్లో ఉన్నా... రుణం మాత్రం ఉంచుకునేవారు కాదు. ఉన్నదాన్ని అమ్మి మరీ ఇచ్చేసేవారు. నాదీ అదే రక్తం కావడంతో డిస్ట్రిబ్యూటర్లు చాలామంది అండగా నిలిచారు. దాంతో ‘మనవడొస్తున్నాడు’ పూర్తి చేయగలిగాను.


     కోడి రామకృష్ణగారితో బంధం ఎలా మొదలైంది?
 ఎమ్మెస్ రాజు: కోడిరామకృష్ణగారిది దాసరిగారి స్కూల్. పైగా నిర్మాతల దర్శకుడని అప్పట్లో ఆయనకు పేరు. నాన్నగారితో ఆయనకు మంచి అనుబంధం ఉంది. అందుకే, ‘మనవడొస్తున్నాడు’ సినిమాకు దర్శకునిగా ఆయన్నే తీసుకున్నాం. కోడి రామకృష్ణగారు పట్టిందల్లా బంగారం అవుతున్న టైమ్‌లో ‘మనవడొస్తున్నాడు’ విడుదలై.. ఆయన విజయ పరంపరలో ఒకటిగా నిలిచింది. ఆ సినిమా విడుదలైంది 1988లో. అంటే... నిర్మాతగా నాకు 25 ఏళ్లన్నమాట. ఆ సినిమా తర్వాత 1991లో మా అబ్బాయి సుమంత్ అశ్విన్ పేరు మీద ‘సుమంత్ ఆర్ట్స్’ని స్థాపించి ‘శత్రువు’ తీశాను. నా ఫస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ అది. నేను చిన్నప్పట్నుంచీ ఎన్టీఆర్‌గారి మాస్ సినిమాలు చూస్తూ పెరిగినా... నాలో ఎక్కడో హాలీవుడ్ సినిమా ప్రభావం ఉండేది. ఆ ప్రభావం ‘శత్రువు’ సినిమాలో కనిపిస్తుంది. నా అభిరుచికి తగ్గట్టుగా, స్టయిలిష్‌గా కోడి రామకృష్ణగారు ఆ సినిమాను తీసిపెట్టారు. ఆయన సృజన, నా అభిరుచి  కలిసిందే ‘శత్రువు’. ఆ సినిమా తర్వాత ఆయన దర్శకత్వంలోనే ‘పోలీస్ లాకప్’ తీశాను. అది కూడా హిట్. సినిమా స్క్రిప్ట్ ఇలా ఉండాలి, కలర్ ఇలా ఉండాలి, పాత్రల తీరుతెన్నులు ఇలా ఉండాలి.. వంటివన్నీ కోడి రామకృష్ణ దగ్గరేనేర్చుకున్నాను. నేను ఓ నిర్మాత, ఆయన ఓ దర్శకుడు అనడం కంటే.. ఆయన గురువు, నేను శిష్యుడు అనడం కరెక్ట్.


     నిర్మాతగా మీ తొలి ఎదురుదెబ్బ?
 ఎమ్మెస్ రాజు: ‘స్ట్రీట్‌ఫైటర్’... నిర్మాతగా మూడు విజయాలతో నేను సంపాదించింది మొత్తం ఆ సినిమాతో ఊడ్చుకుపోయింది. ‘స్ట్రీట్ ఫైటర్’ అని టైటిల్ పెట్టడం వల్లే స్ట్రీటున పడ్డావ్’ అని కొందరన్నారు.


     ఆ సినిమా తర్వాత మీరు అనుభవించిన స్ట్రగుల్స్?
 ఎమ్మెస్ రాజు: నిజానికి ‘స్ట్రీట్‌ఫైటర్’ నాకు పెద్ద ఎదురుదెబ్బ అనిపించలేదు. కారణం... నేను మా నాన్నగారిని దగ్గరుండి చూసినవాణ్ణి. జీరో దగ్గర కెరీర్ మొదలుపెట్టి, ఈ స్థాయికి వచ్చిన వాణ్ణి. అందుకే... మళ్లీ పూర్వవైభవం వస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. పైగా ఆ టైమ్‌లో కోడిరామకృష్ణగారు అందించిన మోరల్ సపోర్ట్ మరచిపోలేను. ‘ఏం బాధ పడకు... నా సినిమాలు కూడా ఫ్లాపయ్యాయి. నేనేమన్నా కృంగిపోయానా. ధైర్యంగా ఉండు’ అని నాలో స్ఫూర్తిని నింపారు. కొన్నాళ్లకు ఆయనే మా ఆఫీస్‌కొచ్చి, పాము నేపథ్యంలో సినిమా చేద్దాం అన్నారు. అదే ‘దేవి’.


     కెరీర్‌లో ఎదురుదెబ్బ తగిలితే.. నెక్ట్స్ స్టెప్‌గా ఎవరైనా సేఫ్ జోన్‌నే ఆశ్రయిస్తారు. కానీ మీరు ‘దేవి’రూపంలో రిస్కీ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఏంటి మీ ధైర్యం?
 ఎమ్మెస్ రాజు: ‘స్ట్రీట్‌ఫైటర్’ తర్వాత వెంకటేష్‌ని కలిస్తే డేట్స్ ఇచ్చేవారేమో! కానీ, నాకు అలా వెళ్లడం సుతరామూ ఇష్టం లేదు. ఒక హిట్ తర్వాత వెంకటేష్‌తో ‘శత్రువు’ చేశాను. అప్పుడు నా గౌరవం వేరు. ఇప్పుడు ఫ్లాప్‌లో ఉండి ఆయన దగ్గరకెళితే... నాకు గౌరవం దక్కుతుందా? అనేది నా ఫీలింగ్. అందుకే హిట్ కొట్టాకే ఆయన్ను కలవాలనుకున్నా. నాకు తెలిసి నిజమైన స్టార్ అంటే.. కథ మాత్రమే. కథ, కథనాలు సరిగ్గా ఉండే ఏ సినిమా అయినా ఆడుతుందని నా నమ్మకం. ఆ ధైర్యంతోనే ముందుకెళ్లాను. అప్పట్లో కోడి రామకృష్ణగారి ‘అమ్మోరు’ సెన్సేషన్ క్రియేట్ చేసి ఉంది. అదే ప్యాట్రన్‌లో కాస్త భిన్నంగా వెళ్తే సినిమా విజయం తథ్యమని కోడి రామకృష్ణ ధైర్యం చెప్పారు. అందుకే రిస్క్ చేసి ‘దేవి’ నిర్మాణానికి పూనుకున్నాను.‘అమ్మోరు’లో గ్రాఫిక్స్ ఓ పది నిమిషాలుంటాయి. కానీ ‘దేవి’లో 26 నిమిషాలు గ్రాఫిక్స్. కేవలం స్పెషల్ ఎఫెక్ట్స్‌కే కోటీ యాభై లక్షలు ఖర్చయ్యాయి. పైగా అది మా అబ్బాయి ఎదుగుతున్న టైమ్. ఎక్కడ కెరీర్ స్టార్ట్ చేశానో, మళ్లీ అక్కడే ఉన్నా. అయినా ధైర్యంతో ‘దేవి’ని స్టార్ట్ చేశా. ఆ సినిమా పూర్తి చేయడానికి రెండున్నరేళ్లు పట్టింది.


     ‘దేవి’ ఎలాంటి అనుభవాన్నిచ్చింది?
 ఎమ్మెస్ రాజు: దైవబలం వల్లే కొన్ని ప్రాజెక్టులు స్టార్టవుతాయి. ‘దేవి’ అలాంటి సినిమానే. తెలుగులో వన్ ఆఫ్‌ది బెస్ట్ స్క్రీన్‌ప్లే ‘దేవి’. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ స్టార్లు ఎవరూ ఉండరు. కేవలం కథ, కథనం, టెక్నాలజీ ఇవే ఈ సినిమాకు అఖండ విజయాన్ని తెచ్చిపెట్టింది. తెలుగులోనే కాదు, తమిళం, హిందీలో కూడా విజయం సాధించిందీ సినిమా. రెండున్నరేళ్లు పడ్డ ఫైనాన్షియల్ టెన్షన్ మొత్తం దూదిపింజెలా ఎగిరిపోయింది. ఆ సినిమా ఇప్పుడు తీయాలంటే వితవుట్ స్టార్‌కాస్ట్ పాతికకోట్లు అవుతుంది.


     సరే నెక్ట్స్ సినిమా ‘దేవీపుత్రుడు’ సంగతేంటి?
 ఎమ్మెస్ రాజు: ‘దేవి’ సక్సెస్ అని తెలియగానే వెంకటేష్ నాకు ఫోన్ చేసి మరీ అభినందించారు. ఆ తర్వాత ఇద్దరం చెన్నయ్‌లో కలుసుకున్నాం. ‘ఏదైనా మంచి సబ్జెక్ట్ ఉంటే చూడు.. సినిమా చేద్దాం’ అన్నారు. నా నుంచి ‘దేవి’ లాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ సినిమానే ఆయన ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్లు మాటల్లో నాకనిపించింది. అందుకే స్పెషల్ ఎఫెక్ట్స్‌తోనే ఏదైనా కొత్తగా వెళదాం అనుకున్నాను. అప్పుడు రచయిత జొన్నవిత్తుల ఇచ్చిన సజెషనే  ‘దేవీ పుత్రుడు’. నీటిలో ద్వారక మునిగిపోవడం, ఒక ఆర్కియాలజిస్ట్ ఆ రహస్యాన్ని ఛేదించడం... ఇవన్నీ ఆయనే చెప్పారు. ఆయన చెబుతున్నప్పుడు ఆది ఆడియన్స్‌కి హెవీ అవుతుందని నాకు అనిపించలేదు. ప్రేక్షకుల మేథస్సును ఎందుకు తక్కువ చేసి చూడాలి? సరిగ్గా తీస్తే ప్రయోగాలను ప్రేక్షకులు ఎందుకు చూడరు? అనే మొండి పట్టుదలతో ‘దేవి పుత్రుడు’ తీశాం. అయితే... సంక్రాంతికి విడుదల చేయాలని చివర్లో కాస్త హడావిడి పడ్డాం. సినిమా చూసినవారందరూ మంచి ఎఫర్ట్ అని అభినందించారు. కానీ డిస్ట్రిబ్యూటర్లను మాత్రం డిజప్పాయింట్ చేసింది. ఆ సినిమాకు విపరీతంగా ఖర్చుపెట్టాం. స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం చేయని లొకేషన్‌లేదు. తిరగని దేశం లేదు. చివరకు ఫ్లాప్‌ని మూటకట్టుకున్నాం. మళ్లీ ‘దేవి’కి ముందు పరిస్థితి. ఎక్కడ మొదలయ్యానో మళ్లీ అక్కడికే చేరుకున్నాను.


     ఆ పరిస్థితుల్లో చేదు అనుభవాలేమైనా ఎదురయ్యాయా?
 ఎమ్మెస్ రాజు: కొన్ని చెప్పుకోకూడదు. ఇప్పుడు అందరం కలిసే ఉన్నాం కాబట్టి, అవన్నీ నెమరువేసుకోవడం ఇప్పుడు పద్ధతి కాదు. అయితే... పంపిణీదారుల్ని ముంచేశానని కొందరన్న మాటలు మాత్రం నాకు బాధను కలిగించాయి. అవి నాలో కసిని పెంచాయి. ఇండస్ట్రీకి వచ్చి పన్నెండేళ్లు అయ్యింది. ఏం సాధించాం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉంది పరిస్థితి. ఇలా కాదు... తక్కువ బడ్జెట్‌లో సినిమా తీసి, భారీ విజయం కొట్టాలి. ఇదే నా ఆలోచన. అలా ‘మనసంతా నువ్వే’ మొదలు పెట్టాను. ఆ సినిమాకు పరుచూరి బ్రదర్స్ నాకు హెల్ప్ అవుతారని ఎవరూ అనుకోలేదు. కానీ హెల్ప్ అయ్యారు. వీఎన్ ఆదిత్యను దర్శకునిగా పరిచయం చేశాను. నేనే సొంతంగా రిలీజ్ చేసుకున్నాను. నిజంగా ఆ సినిమా నాకు పెద్ద జాక్‌పాట్. ‘దేవిపుత్రుడు’ వల్ల ఇబ్బంది పడ్డ డిస్ట్రిబ్యూటర్లందరినీ పిలిచి ఎవరి డబ్బులు వాళ్లకు ఇచ్చేశాను.


     మీ హవా మొదలైంది అప్పట్నుంచే అనుకుంటా?
 ఎమ్మెస్ రాజు: అవును... ఆ తర్వాత నీ స్నేహం, ఒక్కడు చిత్రాలు ప్యార్లర్‌గా మొదలయ్యాయి. ‘ఒక్కడు’ స్టార్ట్ అవ్వడం వెనుక కొన్ని ఆసక్తికర సంఘటనలు జరిగాయి. అవేంటంటే... 2001 సంక్రాంతి పోటీలో నా ‘దేవీపుత్రుడు’తో పాటు నరసింహనాయుడు, మృగరాజు చిత్రాలు కూడా నిలిచాయి. ఆ పోటీలో నేనెంతో కష్టపడి తీసిన ‘దేవీపుత్రుడు’ ఫ్లాప్ అయినప్పుడు నేను ఆర్థికంగా ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్నీఇన్నీ కావు. అదే టైమ్‌లో విడుదలైన ‘మృగరాజు’ది కూడా సేమ్ సిట్యుయేషన్. అందుకే, నాకెందుకో దేవీవరప్రసాద్‌గారిని ఒక్కసారి కలవాలనిపించి ఆయన ఇంటికెళ్లాను. ‘మృగరాజు’ డెరైక్టర్ అయిన గుణశేఖర్‌తో కూడా  ఫోన్ చేసి మాట్లాడాను. ఆయనతో కలిసి సినిమా చేయాలని కూడా అప్పుడు నాకు లేదు. మాటల్లో మాట ఆయన వెంకటేష్‌గారితో ‘లవకుశ’ లాంటిదేదో తీస్తే బావుంటుందని చెప్పాడు. అయితే.. దాని గురించి నేను సీరియస్‌గా ఆలోచించలేదు. అప్పటికి ఆ టాపిక్ ముగిసింది. అలాంటి టైమ్‌లోనే ‘మురారి’ సినిమా విడుదలైంది. నాకు సినిమా తెగ నచ్చేసింది. ఆ విషయమే కృష్ణగారికి చెప్పాను. మహేష్‌తో ఓ సినిమా చేయాలని ఉందని ఆయనతో అన్నాను. మాటల్లో మాట దివిసీమ నేపథ్యంలో ఓ ప్రేమకథ చేస్తే బావుంటుందని కృష్ణగారితో చెప్పాను. ఆయన కూడా బావుంటుందన్నారు. మహేష్‌తో కూడా ఆ టైమ్‌లో కొన్ని డిస్కషన్స్ జరిగాయి. ‘మనసంతా నువ్వే’ కథ కూడా మహేష్‌కి చెప్పాను. కానీ ఆయన పెద్ద ఇంట్రస్ట్ చూపలేదు. అదే టైమ్‌లో మహేష్‌కి గుణశేఖర్ ఓ కథ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని, కథానుగుణంగా ఓ భారీ సెట్‌ని నిర్మించాలని, దాంతో ఆ సినిమాను హ్యాండిల్ చేయడానికి నిర్మాతలెవరూ ముందుకు రావడం లేదని తెలిసింది. సరిగ్గా అప్పుడే గుణశేఖర్ ఫోన్ చేసి, ‘నేను మహేష్‌బాబు దగ్గర ఉన్నాను.. ఓసారి వస్తారా.. మాట్లాడాలి’ అన్నాడు. సరేనని వెళ్లాను. ‘ముగ్గురం కలిసి ఓ ప్రాజెక్ట్ చేద్దాం’ అన్నాడు గుణశేఖర్.  అదే ‘ఒక్కడు’. ‘మీ ఫుల్ ఎఫర్ట్ పెట్టండి రాజుగారూ... చేద్దాం’ అన్నాడు మహేష్. ‘ఫుల్ ఎఫెర్ట్ పెట్టడం అంటే... ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులేదు. ఈ సినిమా నేను హ్యాండిల్ చేసేదీ... చేయందీ నా ‘మనసంతా నువ్వే’ విజయంపైనే ఆధారపడి ఉంది. ఆ సినిమా హిట్ అయితే.. వచ్చిన డబ్బంతా మీ సినిమాకు పెడతాను. హిట్ కాకపోతే.. మాత్రం మీ సినిమాను నేను హ్యాడిల్ చేయలేను’ అని మహేష్‌కి నిర్మొహమాటంగా చెప్పేశాను. కానీ మహేష్ మాత్రం ససేమిరా అన్నాడు. ‘మనసంతా నువ్వే’ హిట్ అయినా... అవ్వకపోయినా ‘ఒక్కడు’ మీరే తీయాలి’ అని పట్టుపట్టాడు. ‘చార్మినార్ సెట్ వేయడమే ఆ సినిమాకు భారం అనుకుంటే... ఆ సెట్టే వేయొద్దు. అవసరం అనుకుంటే... రియల్ చార్మినార్ దగ్గరే షూటింగ్ చేద్దాం. అప్పుడు బడ్జెట్ కూడా తగ్గిపోతుంది’ అన్నాడు. నేను అన్యమనస్కంగానే అంగీకరించాను. లక్కీగా ‘మనసంతా నువ్వే’ భారీ విజయం సాధించింది. ఆ సినిమాకు వచ్చిన డబ్బు మొత్తం ‘ఒక్కడు’కి పెట్టేశాను. ప్రేక్షకులను అబ్బుర పరిచే రేంజ్‌లో చార్మినార్ సెట్ వేయించాను. నిర్మాతకు కేరక్టర్ ఎంత ముఖ్యమో... డబ్బు కూడా అంతే ముఖ్యమని, ఓ భారీ ప్రాజెక్ట్ నిర్మించాలంటే... నిర్మాతకు వెనుక ఓ విజయం ఉండాలని ‘మనసంతా నువ్వే’ విజయంతో నాకు తెలిసొచ్చింది. ఆ సినిమా హిట్ అవ్వకపోతే.. ‘ఒక్కడు’ తీయగలిగేవాణ్ణి కాదు. ‘ఒక్కడు’తో మా తలరాతలే మారిపోయాయి. ‘నీ స్నేహం’ చిత్రానికి కొంత మేర నష్టం వాటిల్లితే... ‘ఒక్కడు’ దాన్ని పూడ్చేసింది. అంత పెద్ద విజయాన్ని మహేష్‌తో తీసిన నేను, మళ్లీ ఆయనతో సినిమా చేయకపోవడమేమిటనేది ఇప్పటికీ నాకు సమాధానం దొరకని ప్రశ్న.


     {పభాస్‌తో ‘వర్షం’ ఎలా మొదలైంది?
 ఎమ్మెస్ రాజు: ‘ఒక్కడు’ పోస్ట్‌ప్రొడక్షన్ టైమ్‌లో ప్రభాస్ నాన్నగారైన సూర్యనారాయణరాజుగారు.. ఫోన్ చేస్తే వెళ్లి కలిశాను. అప్పుడే ప్రభాస్‌తో సినిమా చేస్తానని మాటిచ్చాను. అదే ‘వర్షం’. ‘అర్జున్’ సినిమా ఆఫీస్‌లో త్రిష స్టిల్స్ చూసి, ఆమెను ‘వర్షం’ హీరోయిన్‌గా తీసుకున్నాం.


     ‘బాబీ’ లాంటి ఫ్లాప్ సినిమాను తీసిన శోభన్‌ని ఏ ధైర్యంతో ‘వర్షం’కి డెరైక్టర్‌గా తీసుకున్నారు?
 ఎమ్మెస్ రాజు: సినిమా హిట్, ఫ్లాప్ ఎవరి చేతిలో ఉండవని నమ్ముతాన్నేను. శోభన్ మంచి రైటర్. ‘బాబీ’ టైమ్‌లోనే ఇద్దరం కలిసి పనిచేద్దాం అని అతనికి మాటిచ్చాను. కానీ ‘బాబీ’ ఫ్లాప్ అవ్వడంతో అతను నన్ను అడగడానికి ధైర్యం చేయలేకపోయాడు. కానీ, ‘వర్షం’కు డైలాగ్‌లు రాస్తానని అడిగాడు. ‘డైలాగులు రాయడం దేనికి.. డెరైక్ట్ చేయ్’ అన్నాను. ‘జోక్ చేయకండి సార్..’ అన్నాడు. ‘జోక్ కాదు నిజంగానే చెబుతున్నా.. ‘వర్షం’కి నువ్వే డెరైక్టర్’ అని కన్‌ఫర్మ్ చేసి చెప్పాను. ఆ టైమ్‌కి ఏది అనిపిస్తే... అది చేసేయడం నాకలవాటు.


     ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ఆలోచనెలా వచ్చింది?
 ఎమ్మెస్ రాజు: ‘మైనే ప్యార్‌కియా’ ప్రేరణతో ఈ కథ అల్లుకున్నాం. హీరోగా ఓ ఫ్రెష్ కుర్రాడు కావాలి. లండన్ నుంచి దిగొచ్చిన వాడిలా ఉండాలి. అలాంటి అబ్బాయి కోసం వెతుకుతున్న తరుణంలో అనుకోకుండా చెన్నయ్‌లో ‘బోయ్స్’ సినిమా పాటను ఓ టీవీలో చూశాను. ఈ సినిమాకు ఈ కుర్రాడు బావుంటాడేమో అనిపించింది. త్రిష మేనేజర్ నజీర్‌కి ఫోన్ చేసి సిద్దార్థ్ గురించి అడిగాను. ‘మీరెక్కడున్నారో చెప్పండి... వచ్చి కలుస్తాను’’ అన్నాడు నజీర్. ఫలానా చోట ఉన్నానని చెప్పాను. అంతే అయిదునిమిషాల్లో నజీర్ నా ముందున్నాడు. అతని వెనుకే సిద్దార్థ్ కూడా. ఆ తర్వాత కథ మీకు తెలిసిందే.


     ‘పౌర్ణమి’ సినిమాక్కూడా కథ మీరే అనుకుంటా?
 ఎమ్మెస్ రాజు: అవును.. ‘నువ్వొస్తానంటే..’ తర్వాత ‘పౌర్ణమి’ తీశాను. నెక్ట్స్ సినిమా కూడా నాతోనే చేస్తానని ప్రభుదేవా పట్టుపట్టడంతో.. ప్రభాస్ డేట్స్ కూడా రెడీగా ఉండటంతో ఆ సినిమా మొదలుపెట్టాను. అందరికీ తెలిసిందే... ఆ సినిమా పేరుకే ‘పౌర్ణమి’కానీ... నాకు మాత్రం అమావాస్యగానే పరిణమించింది. టెక్నికల్‌గా అది ఫార్వార్డ్ థాట్‌తో తీసిన సినిమా. ‘వర్షం’లో ప్రభాస్‌ని హీమ్యాన్‌లా చూపించాను. మళ్లీ తనతో సినిమా అంటే... జనాల అంచనాలు కూడా ‘వర్షం’ రేంజ్‌లో ఉంటాయి. కానీ ‘పౌర్ణమి’లో ప్రభాస్‌ని సాఫ్ట్‌గా చూపిస్తాడు. అది కూడా సినిమా పరాజయానికి కారణం అయ్యిందనుకుంటా. జీవితంలో నేను చేసిన ఖరీదైన తప్పు ‘పౌర్ణమి’. ఆ తప్పు తర్వాత వెంటనే నేను చేసిన మరో తప్పు ‘ఆట’.


     కథ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే మీరు ‘ఆట’ విషయంలో ఎందుకు తడబడ్డారు?
 ఎమ్మెస్ రాజు: నిజానికి ఆ సినిమా టైమ్‌లో నా దగ్గర కథ లేదు. సిద్దార్థ్ ఏమో.. ‘ఎంతమంది అడిగినా సరే.. మీ సినిమా చేశాకే మరో సినిమా చేస్తాను’ అని పట్టుపట్టాడు. దాంతో ‘ఆట’ తీయక తప్పలేదు. ఇలా నా కెరీర్ మొత్తం లేవడం పడడం... పడటం లేవడమే అయిపోయింది. ఇప్పుడు మీకు ఇంటర్‌వ్యూ ఇచ్చే సమయానికి అన్ సక్సెస్‌ఫుల్‌గా, మళ్లీ సక్సెస్ కొట్టాలనే కసితో ఉన్నాను. త్వరలోనే సక్సెస్ కొట్టి చూపిస్తా...


     మీ అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ మీరు చేసిన ‘తూనీగ తూనీగ’ అనుకున్నట్లు ఆడనప్పుడు మీరెలా ఫీలయ్యారు?
 ఎమ్మెస్ రాజు: ఆ సినిమా ఆడకపోవచ్చు... కానీ వాడికి యాక్టర్‌గా పేరు తెచ్చింది. ఆ సినిమా వల్లే వాడికి సెకండ్ సినిమా వచ్చింది. వేరే నిర్మాత తీసిన ఆ సినిమా బాగా ఆడింది. ప్రస్తుతం వాడు హీరోగా రెండుమూడు సినిమాలు తయారవుతున్నాయి. ‘తూనీగ తూనీగ’ విషయంలో నాకు బాధ అనిపించింది ఒక్కటే. ఇన్నాళ్లూ నా సినిమాల వల్ల ఆనందాన్ని కానీ, బాధల్ని కానీ నేనొక్కడ్నే అనుభవించాను. కానీ ఆ సినిమాకు నిర్మాతలు వేరే వారు అవ్వడం, అనుకున్న స్థాయిలో ఆ సినిమా ఆడకపోవడం నన్ను ఆవేదనకు లోనుచేసిన అంశం. ఒక నిర్మాతగా అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఓ హిట్ తగలడమే ఆలస్యం... నా సినిమాల వల్ల నష్టపోయిన పంపిణీదారులకు డబ్బును వెనక్కు ఇచ్చేసేవాణ్ణి నేను. అలాగే..  మళ్లీ హిట్ కొట్టి ఆ సినిమా నిర్మాతల నష్టాన్ని పూడ్చేయాలనుకుంటున్నా.


     {పేమకథ అంటున్నారు. మీ అబ్బాయితోనే చేస్తారా?
 ఎమ్మెస్ రాజు: నా సినిమా అనగానే... మా అబ్బాయే హీరో అనుకుంటారు. ఏ హీరోని నా అంతట నేను అడగనని ఇంతకు ముందు చెప్పాను కదా. అలాగే మా అబ్బాయిని కూడా అడగను.


     సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువ. కానీ మీరేమో అందుకు భిన్నంగా ఫ్లాపుల్లో ఉన్నవాళ్లకు పిలిచి అవకాశం ఇస్తారు. దేనికి?
 ఎమ్మెస్ రాజు: మనిషి ప్రతిభను ఒక ఫ్లాప్‌తో అంచనా వేయలేం. ఈ సారి నేను ఓ ఫ్లాప్ డెరైక్టర్‌తో సినిమా చేయబోతున్నాను. అతనెవరో తెలుసా? నేనే.


     ఉన్నట్టుండి బాగా చిక్కిపోయారేంటి?
 ఎమ్మెస్ రాజు: వర్క్‌లో ఉన్నప్పుడు మనకు పెద్దగా తెలీదు కానీ... కాస్త రిలాక్సయ్యాక మన ఆరోగ్య పరిస్థితేంటో మనకు తెలుస్తుంది. ఓ సారి ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు నేను హెవీ బరువు పెరిగానా అనిపించింది. సక్సెస్ మనం తెచ్చుకోగలం. కానీ హెల్త్ ఒక్కసారి పాడైతే మళ్లీ మనం తెచ్చుకోలేం. అందుకే తగ్గాలని గట్టిగా నిర్ణయించుకొని 30, 40 కేజీలు తగ్గాను. వాకింగ్, డైట్... ఈ రెండిటినీ క్రమం తప్పకుండా మూడేళ్ల పాటు చేశాను.
 - బుర్రా నరసింహ
 
  మీ వల్ల స్టార్స్ అయిన వారు చాలామంది ఉన్నారు. మీరు ఫ్లాప్స్‌లో ఉన్నప్పుడు వాళ్లొచ్చి మిమ్మల్ని కలవడం కానీ, కలిసి సినిమా చేద్దాం అని అడగడం కానీ చేశారా?  
 ఎమ్మెస్ రాజు: ఆకాశంలో చుక్కల్ని చూస్తూ కూర్చోవడమే నాకు ఆనందం. అంతే తప్ప ఆ చుక్కలు కిందకొచ్చి నన్ను కూడా తీసుకెళ్లి వాటి సరసన కూర్చోబెట్టాలని మాత్రం కోరుకోను. నా నైజం అది కాదు. ఒకవేళ వాళ్ళొచ్చి అడిగినా... సరే అనే... తేలికైన వ్యక్తిత్వం కాదు నాది. ‘స్ట్రీట్ ఫైటర్’ ఫ్లాప్ తర్వాత వెంకటేష్‌బాబుని కలవమని కొందరు చెప్పినా కూడా... ‘దేవి’ తీసిన తర్వాతే ఆయన్ను కలిశాను. అప్పుడు నా కేరక్టర్ ఎలా ఉందో, ఇప్పుడూ అలాగే ఉంది. 2014లో నేను భారీ హిట్ ఇవ్వబోతున్నాను. తర్వాత మళ్లీ ఎమ్మెస్‌రాజు వైభవం మొదలవుతుంది. ఇది కాన్ఫిడెంట్‌గా చెబుతున్న మాట.
 
     కొరియోగ్రాఫర్ ప్రభుదేవాలో ఓ మంచి డెరైక్టర్ ఉన్నాడని మీరెలా పసికట్టారు?
 ఎమ్మెస్ రాజు: ‘శత్రువు’ సినిమా టైమ్‌లో సుందరం మాస్టార్‌కి  కాస్త హెల్త్ బావుండకపోతే... తన బదులుగా ఆయన ప్రభుదేవాను పంపాడు. తనను చూడగానే నాకు భయమేసింది. ‘చూస్తే చిన్నపిల్లాడిలా ఉన్నాడు. వీడేం కొరియోగ్రఫీ చేస్తాడు’ అని అనుమానించాను. కానీ... అందరికీ పెద్ద షాక్ ఇచ్చేశాడు. ‘పొద్దున్నే వచ్చింది చందమామ’ పాటకు మైండ్ బ్లోయింగ్ అయ్యేలా కొరియోగ్రఫీ చేశాడు. ఇప్పటికీ నా సినిమాల్లో బెస్ట్ కొరియోగ్రఫీ అంటే ఆ పాటే చెబుతా. అప్పట్నుంచీ ప్రభు నాకు పరిచయం. తాను ‘ప్రేమికుడు’ సినిమాతో హీరో అయ్యాక కూడా ఇంటికెళ్లి అభినందించా. తరచూ ఇద్దరం రెస్టారెంట్లలో కలుస్తూ కబుర్లు చెప్పుకునేవాళ్లం. వయసు పరంగా మా ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అయినా రాత్రుళ్లు డిస్కోథెక్‌లకు కూడా వెళ్లేవాళ్లం. తాను డాన్స్ చేస్తుంటే నేను చూస్తూ ఎంజాయ్ చేసేవాణ్ణి. అప్పుడప్పుడు తను సరదాగా కథలు కూడా చెబుతుండేవాడు. బేసికల్‌గా కొన్ని పొరపాట్లు ఉన్నా... చెప్పే విధానం మాత్రం బావుండేది. అయితే.. దాన్ని సీరియస్‌గా మాత్రం తీసుకోలేదు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అనుకున్న తర్వాత డెరైక్ట్ చేసిపెట్టమని ఎస్.గోపాల్‌రెడ్డిగారిని ఆడిగాను. ఆయన సొంత సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో చేయలేనని చెప్పేశారు. డెరైక్టర్‌గా ఎవర్ని తీసుకోవాలా? అని ఆలోచిస్తున్న టైమ్‌లో క్యాజువల్‌గా ప్రభుదేవా ఫోన్ చేశాడు. ‘సార్... ఓ కథ చెబుతా వింటారా’ అన్నాడు. ‘నువ్వు కాదు... నేనే ఓ కథ చెబుతా వింటావా’ అన్నాను. ‘ఏం కథ సార్..’ అన్నాడు. ‘అదంతా నీకు అనవసరం. నీకు నా కథ నచ్చితే... ఆ కథను నువ్వే డెరైక్ట్ చేయాలి. అందుకు నువ్వు రెడీనా’ అన్నాను. వెంటనే తను హైదరాబాద్ వచ్చేశాడు. అలా తన దర్శకత్వంలో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమా మొదలైంది.
 
     దర్శకుల్ని పక్కన కూర్చోబెట్టి సినిమా అంతా మీరే తీసేస్తారని మీపై అభియోగం.
 ఎమ్మెస్ రాజు: ఎవరు అనుకున్నట్లు వాళ్లు అనుకోనీయండి. ఇప్పుడు మనం ‘కాదు’ అని చెప్పినా వాళ్లు నమ్మరు. నా సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్‌కి నేనేంటో తెలుసు. వాళ్లేంటో నాకు తెలుసు. మరొకరికి తెలియాల్సిన అవసరం లేదు.


     మేకర్‌గా కింగ్ అనిపించుకున్న మీకు ఉన్నట్లుండి దర్శకునిగా మారాలని ఎందుకనిపించింది?
 ఎమ్మెస్ రాజు: నేను సినీ జీవితాన్ని మొదలుపెట్టేటప్పుడు నా సినిమాలకు నేనే కథలు రాసుకుంటానని అనుకోలేదు. నా సినిమాల విషయంలో దర్శకులు ఓ వైపు పాటను షూట్ చేస్తుంటే... మరో వైపు నేను సీన్స్ తీసేవాణ్ణి. అలా సీన్‌ని డెరైక్ట్ చేయగలనని కూడా ఎప్పుడూ అనుకోలేదు. పైగా అవన్నీ హిట్లు. నేను దర్శకునిగా మారడమే మిస్టేక్ అని మీరంటే... ఆ తప్పు మళ్లీ మళ్లీ చేస్తాను. ఎందుకంటే, ఎన్ని మిస్టేక్‌లు చేస్తే అన్ని నేర్చుకోవచ్చు.  త్వరలో మరో మిస్టేక్ చేయబోతున్నా. దర్శకునిగా నేనేంటో నిరూపించేది ఆ సినిమానే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement