దెయ్యాల టూరిజం!
సర్వే
దెయ్యాలు ఉన్నాయి సుమా... అని భయపడేవారు కొందరు. దెయ్యాలు లేనే లేవు... అంటూనే భయపడేవారు కొందరు. రాత్రయినా సరే, పగలయినా సరే ‘దెయ్యాలున్నాయి’ అని భయపడే వారు మరికొందరు. పగలంతా ‘దెయ్యాలు లేవు’ అని గట్టిగా వాదించి రాత్రయితే చాలు ప్లేటు ఫిరాయించి కిటికీల వంక భయంగా చూసేవాళ్లు కొందరు... మొత్తానికైతే దెయ్యాల గురించి మాట్లాడకుండా ఉండలేం.
దెయ్యాలను నమ్మడం మూఢ నమ్మకమని, వెనుకబడిన దేశాలలో, వెనకబడిన ప్రాంతాలలో, నిరక్షరాస్యత ఉండేచోట ‘దెయ్యాల మీద నమ్మకం’ ఎక్కువగా ఉంటుందనేది సాధారణ అభిప్రాయం.
ప్రసిద్ధ మార్కెటింగ్ రిసెర్చ్ సంస్థ ‘హారిస్ పోల్స్’తో సహా ఇటీవల నిర్వహించిన కొన్ని సర్వేలలో మాత్రం పాశ్చాత్యదేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ దెయ్యాలను నమ్మేవారి సంఖ్య తక్కువేమీ లేదనే విషయం బయటపడింది.
దెయ్యాలను నమ్మేవారు అమెరికాలో 42 శాతం మంది ఉన్నారు. బ్రిటన్‌లో 52 శాతం మంది ఉన్నారు.
గమనించాల్సిన విషయం ఏమిటంటే ‘దెయ్యాలు ఉన్నాయి’ అని బల్లగుద్ది వాదించే వాళ్లలో విద్యావేత్తలు, వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. కొందరైతే ఏకంగా తమ స్మార్ట్ ఫోన్‌లో నిక్షిప్తం చేసుకున్న కొన్ని వింత ఫోటోలను చూపిస్తూ ‘‘ఇంతకంటే రుజువు అవసరమా?’’ అని కూడా అంటున్నారు.
సర్వేలో భాగంగా దెయ్యాలు తిరుగాడే ప్రాంతాల గురించి అడిగినప్పుడు రకరకాల దేశాల్లో రకరకాల పేర్లు వినిపించాయి. ఈ దెబ్బతో ‘పారానార్మల్ టూరిజం’ పెరిగిపోయింది. ఒకానొక ప్రాంతంలో ఎలాంటి చూడదగిన ప్రదేశమూ లేకపోయినా ‘అక్కడ దెయ్యం ఉంది’ అనే నమ్మకంతో వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగిపోయింది. అలా పర్యటించిన వారికి దెయ్యాలు కనిపించాయో లేదోగానీ- ‘నేను మరియు ఆ దెయ్యం’లాంటి హాట్ హాట్ యాత్రాకథనాలు రాయడం మొదలు పెట్టారు కొందరు. హతవిధీ!