
చైనా పార్కులో కోడిపుంజు చెట్టు
సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి వచ్చేస్తేనే సంక్రాంతా?! పట్టణాలన్నీ పల్లెలకు చేరుకున్నా సంక్రాంతే. మన సంక్రాంతి ఈ మధ్యే వచ్చి వెళ్లింది. పండక్కి పల్లెలకు వచ్చినవాళ్లూ తిరిగి వెళ్లిపోయారు. ఇప్పుడిక చైనా సంక్రాంతి! అక్కడ సిటీల్లో ఉన్న వాళ్లంతా నిన్నటికే చిన్ననాటి ఊళ్లకు చేరుకున్నారు. ఈ రోజు చైనాలో న్యూ ఇయర్స్ డే! ‘ఇయర్ ఆఫ్ రూస్టర్’. కొక్కొరొకో ఇయర్ అన్నమాట. ఏడాదికో థీమ్ ఉంటుందక్కడ. ఈ ఏడాది థీమ్ కోడిపుంజు.
మామూలుగానైతే పిడుగులు పడ్డా బీజింగ్, షాంగై నగరాల నుంచి కదలని వాళ్లంతా జనవరి 28కి ఒక రోజు ముందే సొంతూళ్లకు వెళ్లిపోయారు. వీళ్లందరినీ చేర్చడానికి చైనా రవాణా శాఖ జనవరి 13 నుంచి ఇప్పటి వరకు 300 కోట్ల ట్రిప్పులు తిప్పింది. రైల్వేస్టేషన్‌లైతే అలసిసొలసి సంతృప్తిగా నిట్టూర్చాయి. నిర్విరామంగా తల్లుల చెంతకు బిడ్డల్ని చేర్చడం ఎంత గొప్ప కార్యం! అందుకే ఆ సంతృప్తి.
ఇక చైనా షాపింగ్ మాల్స్‌లో.. అమ్మానాన్నల కిచ్చే గిఫ్టులన్నీ ఒక్కటి కూడా లేకుండా క్లియర్ అయిపోయాయి! ‘ఇవన్నీ సరేరా.. కోడలు పిల్లను ఎప్పుడు తెస్తావ్’ అని అడిగే తల్లిదండ్రుల్ని మాయ చెయ్యడానికి ఈ రెండు వారాలూ చైనాలోని జి.పి యాప్ క్షణం తీరిక లేకుండా పని చేసింది! ఒకరోజుకు గర్ల్‌ఫ్రెండ్‌ని అద్దెకు సమకూర్చిపెట్టే ఈ యాప్ పుణ్యమా అని.. చైనా అబ్బాయిలు ఆ గర్ల్ ఫ్రెండ్‌ని తమ పేరెంట్స్‌కి చూపించి, ‘ఇదిగో ఈ అమ్మాయే మీ కాబోయే కోడలు’ అని చెప్పి ఆ వృద్ధ కపోతాల కళ్లల్లో ఆనందం చూసేందుకు బస్సులు, రైళ్లు ఎక్కేశారు. కొత్త సంవత్సంలోనైనా పాపం ఈ అబ్బాయిలకు అద్దె ఫ్రెండ్ కాకుండా, సొంత గర్ల్‌ఫ్రెండ్ దొరికితే బాగుండు.
అన్నట్లు చైనా ఒక్కటే కాదు.. హాంగ్‌కాంగ్, మకావ్, మలేషియా, సింగపూర్, తైవాన్, వియత్నామ్... ఆ బెల్టుబెల్టంతా ఇవాళ న్యూ ఇయర్.
ఇయర్ ఆఫ్ రూస్టర్: కోడిపుంజు డ్రెస్‌లోన్యూ బేబి