సమీర మహమూద్ జాగిర్దార్
ట్రాన్స్‌జెండర్లు ఒక్కో అవరోధాన్నీతొలగించుకుంటూ వస్తున్నారు.అయితే ఇంకా అనేక రంగాలు వీరికోసం చట్టబద్ధమైన సాంకేతిక నిబంధనలు సడలించవలసి ఉంది.
ఏ అప్లికేషన్ పూర్తి చేయాలన్నా అందులో మేల్, ఫిమేల్ కాలమ్‌లో టిక్ చేయాలి. మరి ట్రాన్స్‌జెండర్లు ఏం చేయాలి? ఏదో ఒకటి టిక్ చేసేస్తే సరిపోతుందా? సరిపోదు. అందుకే తమకు ప్రత్యేక కాలమ్ కేటాయించాలని ట్రాన్స్‌జెండర్లు చాలా కాలంగా అనేక శాఖలతో పోరాడుతున్నారు. ఒక్కో పోరాటం చేస్తూ, ఒక్కో హక్కు సాధించుకుంటున్నారు. 1994లో ఓటుహక్కు కోసం పోరాడారు, 2013 నాటికి అది ఆచరణలోకి వచ్చింది. ఓటర్ ఐడీ కార్డులో థర్డ్ జెండర్ లేదా ఇతరులు అని కాలమ్ పెట్టారు.అందుకోసం ట్రాన్స్‌జెండర్లంతా కలిసి ఓ పెద్ద ప్రదర్శననే చేయవలసి వచ్చింది. ఆ క్రమంలోనే ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. పుదుచ్చేరిలో ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారిక పోర్టల్‌లో ఇన్‌కమ్‌ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఇంతవరకూ లేని ట్రాన్స్‌జెండర్ కాలమ్‌ని ఎట్టకేలకు పొందుపరుచుకోగలిగారు. ఈ విజయం వెనుక ఉన్నది డాక్టర్ సమీర మహమూద్ జాగిర్దార్. వృత్తిరీత్యా ఆమె డాక్టరు. పుదుచ్చేరి మహాత్మాగాంధీ మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఎమర్జన్సీ వార్డులో పనిచేస్తారు. ఇక్కడే చట్టబద్ధంగా తనను ‘అమ్మాయి’ నుంచి, ‘ట్రాన్స్‌జెండర్’గా మార్చుకున్నారు.
అయితే పాన్‌ను ఆధార్‌కి జతపరిచేటప్పుడు పాన్‌లో ఆమె ‘మేల్’ అనీ, ఆధార్‌లో ‘ట్రాన్స్‌జెండర్’ అనీ ఉండటంతో సమీర జత చేయలేకపోయారు. అప్పుడే సమీర ఇంకో విషయం కూడా గ్రహించారు. ఇన్‌కమ్‌ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కూడా అందులో థర్డ్ జెండర్ ప్లేస్‌లో ట్రాన్స్‌జెండర్ కాలమ్ లేదని! ముందుగా ఇన్‌కమ్‌ట్యాక్స్ ఫామ్‌లో ట్రాన్స్‌జెండర్ కాలమ్ పెట్టించాలనుకున్నారు. ఇందుకోసం సమీర ఎన్నోసార్లు విజ్ఞప్తులు పెట్టుకున్నారు. లాభం లేకపోయింది. చివరి ప్రయత్నంగా, పుదుచ్చేరి ఇన్‌కమ్‌ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ జహనాబ్ అక్తర్‌ని నేరుగా కలిశారు. సమీర ఆలోచనను అర్థం చేసుకున్న జహనాబ్ అక్తర్ వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చి, సమీర అభ్యర్థనను మన్నించారు. ఐటీ రిటర్న్స్‌లో ‘ట్రాన్స్‌జెండర్’ కాలమ్ పెట్టించారు. అలాగే పాన్ ఆధార్ లింక్ విషయంలో ట్రాన్స్‌జెండర్ కాలమ్ పెట్టేవరకు వారు లింక్ చేసుకోనక్కర్లేదు అనే మినహాయింపు ఇచ్చారు.
- డాక్టర్ సమీర జహంగీర్ మహమూద్ జాగిర్దార్
Comments
Please login to add a commentAdd a comment