ఈ బుల్లెట్ ఎక్కి హిమాలయాలకు వెళ్లండి....
యాత్రా సాహిత్యం
ఎక్కడో కొన్ని పర్వతాలుంటాయి. మరెక్కడో కొన్ని నదులు. కొన్ని చోట్ల చెట్లు ఆకాశంపై గీతలు గీస్తూ తలలు కదుపుతూ ఉంటాయి. కొన్ని చోట్ల బండరాళ్లు పరుపుల కంటె సుఖంగా మారి సేద దీరేందుకు సిద్ధమై ఉంటాయి. కొన్ని చోట్ల కల్మషం లేని గాలి హృదయాన్ని కడగడానికి రూపాయి అక్కర్లేకుండా రెడీగా ఉంటుంది. కొన్నిచోట్ల నిగూఢమైన సరస్సులు మిమ్మల్ని మబ్బులతో పాటు ప్రతిబింబించడానికి మౌనంగా ఎదురుచూస్తుంటాయి. చాలాచోట్ల ప్రకృతి శక్తులు మీ రాక కోసం ఎదురు చూస్తూ మిమ్మల్ని ఆశీర్వదిద్దామని కాచుకొని ఉంటాయి. కాకపోతే మనం వెళ్లం అంతే. ఆఫీసు, ఇల్లు, కూరగాయల మార్కెట్టు, అడపా దడపా గుడో గోపురమో... ఇంతేనా? కాని కొందరు అదృష్టవంతులు ఈ సంకెలలను ఛేదించుకుంటారు. కాళ్లకు చక్రాలు కట్టుకుంటారు. భుజాలకు రెక్కలు. మరి తుర్రుమంటూ ఎక్కడెక్కడికో ఎగిరిపోతుంటారు. చలనం మనిషికి మూలశక్తి. ప్రయాణం అందుకు చోదక శక్తి. నిలువనీరులా ఎంతకాలం? ప్రవహించి చూడటంలోనే ఉంది ప్రాణాధారం.
పూణెలో స్పీచ్ థెరపిస్ట్‌గా పని చేసే అజిత్ హరిసింఘాని తన ఐదు పదుల వయసులో 2004లో ఒక ప్రయాణం చేశారు. అదీ బస్సులోనో రైల్లోనో కాదు. జన సమృద్ధంగా ఉంటే మానవ కాంక్రీటు నగరాల్లోకి కాదు. హిమాలయాలలోకి. వందల కిలోమీటర్ల పాటు నరమానవుడు కనిపించని లేహ్ మైదానాలలోకి. ప్రాణాంతకమైన కొండఅంచు దారుల్లోకి. మనిషిని గడ్డ కట్టించే చలిలోకి. ఆక్సిజన్ సరిగా అందని ఉన్నత అంతస్తుల్లోకి. ఒక్కడే ఒక బుల్లెట్ ఎక్కి వెనుక కొన్ని సామాన్లు కట్టుకొని అలా వెళుతూ వెళుతూ ఆయన ఏం చూశారు? నిర్మలమైన మనుషుల్ని చూశారు. వినయం ఉట్టిపడే ప్రకృతిని చూశారు. అంతేనా? మనుషులు ఎన్ని రకాలుగా బతుకుతారో చూశారు. తన బతుకును వారి బతుకుతో బేరీజు వేసుకొని తానెంత అదృష్టవంతుడినో కదా అని సృష్టికర్తకు కృతజ్ఞతలు చెప్పారు. 4,300 కిలోమీటర్ల పాటు ఒక్కళ్లమే ప్రయాణించడం, మనతో మనం మాత్రమే ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే మనసుకు పట్టిన చాలా మకిలి వదిలిపోతుంది. అది తుడిచిన అద్దంలా మారుతుంది. జీవం కొత్త శక్తుల్ని ఇముడ్చుకుంటుంది.
అతడు ఇంతకు ముందరి మనిషి ఎంత మాత్రం కాదు. పరిణతి చెందుతాడు. ప్రయాణమే పరిణతి. దర్శించడమే పరిణతి. బాహ్య ప్రయాణం, అంతర్గత ప్రయాణం రెండూ ఈ పుస్తకంలో మనం చూస్తాం. ఇంత సాహసం చేస్తే? చాలా గొప్ప. చేయలేనివారు ఈ పుస్తకం చదివితే? కనీసం ఆ గొప్పను పరోక్షంగా అయినా ఆస్వాదించవచ్చు. కొల్లూరి సోమసుందర్ అనువాదం చాలా సరళంగా సూటిగా మూల రచయిత స్వయంగా తెలుగులో రాసినంత ప్రభావవంతంగా ఉంది. దాసరి అమరేంద్ర ముందుమాట బోనస్.
డైరీ
డిసెంబర్ 14 ఆదివారం హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉ. 10 గం. నుంచి విప్లవ కవి జ్వాలాముఖి వర్ధంతి సభ. డాక్టర్ జతిన్, కె.కె.రంగనాథాచార్యులు, డి.పాపారావు, నిఖిలేశ్వర్ తదితరులు పాల్గొంటారు.
డిసెంబర్ 14 ఆదివారం విశాఖ పౌరగ్రంథాలయం (విశాఖ)లో కవయిత్రి జగద్ధాత్రి కవితా సంపుటి ‘సహచరణం’ ఆవిష్కరణ. సయ్యద్ సలీం, ఎల్.ఆర్.స్వామి, చందు సుబ్బారావు తదితరులు పాల్గొంటారు.
డిసెంబర్ 14 ఆదివారం హైదరాబాద్ లా మకాన్‌లో సాయంత్రం ఆరుగంటలకు రచయిత వేంపల్లి గంగాధర్‌కు వాసిరెడ్డి సీతాదేవి కథాపురస్కార ప్రదానోత్సవం. గ్రంథి భవానీప్రసాద్, ఆవుల మంజులత, ఓల్గా తదితరులు పాల్గొంటారు.
డిసెంబర్ 14 ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతి సమావేశమందిరంలో ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు ప్రఖ్యాత నవలా రచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహారావు శతజయంతి ముగింపు సందర్భంగా చర్చా సదస్సు. నిర్వహణ: సాహిత్య అకాడమీ, కిన్నెర ఆర్ట్ థియేటర్స్. ద్వా.నా.శాస్త్రి, ఎస్.వి.సత్యనారాయణ, సి.మృణాళిని, లింగాల రామతీర్థ తదితరులు పాల్గొంటారు. కొవ్వలి కుమారులు కొవ్వలి లక్ష్మీనారాయణ, కొవ్వలి నాగేశ్వరరావు కూడా పాల్గొంటారు. అదే సందర్భంలో సాయంత్రం 5.30 గం.లకు సుప్రసిద్ధ రచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌తో ‘కథా సంధ్య’ కార్యక్రమం ఉంటుంది. ఆయన తన కథను చదివి పాఠకులతో ముచ్చటిస్తారు.
సాక్షి సాహిత్యం: సాక్షి సాహిత్యం పేజీపై మీ అభిప్రాయాలను, సూచనలను, సలహాలను రాయండి: sakshiliterature
@gmail.com సమీక్షకు రెండు కాపీలు పంపాలి. రచనలు అందాల్సిన చిరునామా: ఎడిటర్, సాక్షి,
రోడ్ నం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34.