త్రయంగ్ ముఖైక పశ్చిమోత్థానాసనం
‘త్రయంగ్’ అనగాపిరుదులు, మోకాలు, మడమలు అనే మూడు భాగాలు. ‘ముఖైక పాద’ ఒకే కాలిపైన ముఖాన్ని ఆన్చడం, వీపును సాగదీసి ఉంచే ఈ పద్ధతిని మహర్షులు ‘త్రయంగ్ ముఖైక పాద పశ్చిమోత్థానాసనము’ అన్నారు.
ఎలా చేయాలి?
రెండు కాళ్లను చాపి రెండు చేతులు మోకాళ్లపై ఉంచి వెన్నెముక నిటారుగా పెట్టి సమస్థితిలో కూర్చోవాలి.
కుడికాలును మోకాలు వద్ద మడిచి కుడి పిరుదు కిందగా కానీ పక్కగా కానీ ఉంచాలి. ఇప్పుడు రెండు చేతులను నిటారుగా పైకి లేపి పూర్తిగా శ్వాస తీసుకుని శరీరాన్ని పైకి లాగినట్లు చేయాలి.
ఇప్పుడు శ్వాసను నిదానంగా వదులుతూ ముందుకి వంగి గడ్డాన్ని ఎడమ మోకాలుకు ఆనించి రెండు చేతులతో ఎడమపాదాన్ని పట్టుకోవాలి. ఈ స్థితిలో రెండు మోచేతులు నేలకు తాకాలి. ఛాతీని కాలిపైన అదిమి ఉంచాలి. ఈ స్థితిలో శ్వాసను వదిలి ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత మెల్లగా యథాస్థితికి రావాలి.
ఇదే క్రమాన్ని ఎడమ మోకాలిని వంచి కుడిపాదాన్ని పట్టుకుని కూడా చేయాలి. ఇలా రోజుకు మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.
ఉపయోగాలు
తొడల్లో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. మోకాళ్లు శక్తిమంతం అవుతాయి.
వెన్నెముక సరళతరంగా మారుతుంది.
అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్దకం పోతాయి.
హైబీపీ అదుపులోకి వస్తుంది.
ఒత్తిడి కారణంగా వచ్చే తలనొప్పి, పార్శ్వపు నొప్పిని నివారించవచ్చు.
జాగ్రత్తలు!
మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్లు, అధికబరువు ఉన్నవాళ్లు చేయకూడదు.
మడమలకు సంబంధించిన సమస్య ఉన్నవాళ్లు జాగ్రత్తగా చేయాలి.
వెన్నునొప్పితో బాధపడుతున్న వాళ్లు చేయరాదు.
మోడల్
ఎస్. దుర్గాహర్షిత,
నేషనల్ యోగా చాంపియన్
బీరెల్లి చంద్రారెడ్డి
యోగా గురువు, సప్తరుషి యోగ విద్యాకేంద్రం, హైదరాబాద్
ఫొటోలు: శివ మల్లాల