
ట్రూ ఇండియన్
సంప్రదాయం
గాలిలో ఉన్న ఈ మల్లయోధురాలి పేరు డకోటా కాయ్. దేశం.. న్యూజిలాండ్. ఇక ఆమెను గాలిలోకి ఎత్తిపట్టుకున్న ‘మల్లమ్మ’.. మన అమ్మాయి కవిత! ‘ది గ్రేట్ కాళి’ దిలీప్ సింగ్ (పంజాబ్) శిష్యురాలు. యు.ఎస్.లో జూలైలో మొదలై నిన్నటితో ముగిసిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్ మెంట్ పోటీలలోని ‘మే యంగ్ క్లాసిక్’ స్మారక ఈవెంట్‌లో గత నెల కవిత, కాయ్‌తో తలపడింది. ఆ పోటీలో ఓడిపోయినప్పటికీ.. చుడీదార్ వేసుకుని, నడుముకు దుపట్టా చుట్టుకుని, బూట్లు ధరించి బరిలోకి దిగిన కవిత తన ప్రత్యర్థిని ఎత్తిపట్టుకుని పై చెయ్యి సాధించిన దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్‌లో భారతీయ ఆత్మను రెపరెపలాడిస్తోంది.
అఫిషియల్ యూట్యూబ్ చానల్‌లో ఈ ఫైటింగ్ వీడియోను ఆగస్టు 31న అప్‌లోడ్ అయినప్పటి నుంచీ ఇప్పటి వరకు 48 లక్షల మంది వీక్షించారు! ఈ తరహా వరల్డ్ రెజ్లింగ్ లో పాల్లొన్న తొలి భారతీయ యువతిగా కన్నా కూడా, భారతీయ వస్త్రధారణతో పోటీలో పాల్గొన్న అచ్చమైన ఇండియన్‌గా కవిత ప్రశంసలు పొందుతున్నారు. కవిత రెజ్లర్ మాత్రమే కాదు. వెయిట్ లిఫ్టర్ కూడా. 2016లో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో 75 కిలోల విభాగంలో స్వర్ణపతకాన్ని గెలుచుకున్నారు. ఈ నెల 20న కవిత పుట్టినరోజు. రెజ్లింగ్‌లో గెలిచి ఉంటే అదొక మంచి సందర్భం అయిఉండేది. అయితే అంతకంటే మంచి కానుకను ఆమె ఫైటింగ్ కాస్ట్యూమ్స్ ఆమెకు తెచ్చిపెట్టాయి.