నాస్తికుల కోసం టీవీ చానల్!
నమో నాస్తికా!
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి టీవీ చానల్‌లోనూ భక్తి కార్యక్రమాలు ప్రసారం అవుతుంటాయి. కేవలం భక్తికి మాత్రమే పరిమితమై, ఇరవై నాలుగు గంటలూ భక్తి విశేషాలనే ప్రసారం చేస్తుండే చానళ్లూ ఉన్నాయి. అయితే మొట్టమొదటిసారి ఒక నాన్-భక్తి చానల్ రాబోతోంది. అంటే నాస్తికుల చానల్ అని! జూలైలో అమెరికాలో మొదలు కాబోతున్న ఈ చానల్‌కు ఇంకా పేరు నిర్ణయించలేదు.
ఈ నెల మొదటి వారంలో ‘అమెరికన్ అఫీయిస్ట్స్’ (అమెరికా నాస్తికులు) సంస్థ అధ్యక్షుడు డేవిడ్ సిల్వర్‌మేన్ ఈ విషయాన్ని ప్రకటించినప్పుడు అమెరికాలోని యువ నాస్తికులు, విశాల దృక్పథం గల ఆలోచనాపరులు హర్షం వ్యక్తం చేశారట! ‘‘ఎందుకు మేమీ చానల్‌ను ప్రారంభిస్తున్నామో మీకు తెలుసా?’’ అని అడిగి, సమాధానం కోసం ఎదురు చూడకుండానే, ‘‘మనం ఎక్కడికైతే వెళ్లలేమో అక్కడికి వెళ్లే వ్యూహంలో భాగంగానే ఈ కొత్త చానల్‌ను తెస్తున్నాం’’ అని సిల్వర్‌మేన్ అన్నారు.
దీని అర్థం ఏమిటో ఆయన సభకు హాజరైన నాస్తిక మిత్రులకే తెలియాలి. ‘రొకు’ అనే ఇంటర్నెట్ ప్లేయర్‌ను కేబుల్ బాక్సులా టీవీలకు అమర్చుకోవడం ద్వారా నాస్తిక చానల్ కార్యక్రమాలను చూడవచ్చని; రోజుకు 24 గంటలు, 365 రోజులూ నిర్విరామంగా జరిగే ఈప్రసారాలు తొలి విడతగా 70 లక్షల మంది అమెరికన్లకు ఉచితంగా అందుబాటులోకి వస్తాయని సిల్వర్‌మేన్ చెబుతున్నారు.
వీడియోలు, ప్రసంగాలు, వ్యక్తిగత అనుభవాల రూపంలో కార్యక్రమాలను రూపొందించే పని ఇప్పటికే మొదలయిందని కూడా ఆయన తన సభకు హాజరైన నాస్తికులను ఉత్సాహపరిచారు. వారిలో ఒక ఔత్సాహికుడు ‘‘రేడియో చానల్ ను కూడా తెస్తే బాగుంటుంది కదా’’ అని సూచించినప్పుడు ‘‘బ్రిలియంట్ ఐడియా’’ అని సిల్వర్‌మేన్ అతడిని అభినందించారు.
‘‘మీ కోసం తప్పకుండా తెస్తాం’’ అని హామీ కూడా ఇచ్చారు. ప్రస్తుతం అమెరికాలో ప్రముఖంగా 100 క్రైస్తవ టీవీ చానళ్లు, 4 యూదుల టీవీ స్టేషన్లు ఉన్నాయి. వాటికి దీటుగా ప్రజల్లో నాస్తికత్వాన్ని పెంపొందించడానికి సిల్వర్‌మేన్ కృషి చేస్తున్నారు. చూడాలి ఎంతమంది ఆయన ప్రయత్నాన్ని ఆదరిస్తారో.