కవలలు...కలలు...
అమర్‌నాథ్‌లు, గవాస్కర్‌లు...పటౌడీలు, పఠాన్‌లు...ఇలా ఎంతో మంది తండ్రీ కొడుకులు, అన్నదమ్ములు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కొంత మంది సోదరులు కలిసి ఒకే మ్యాచ్‌లో ఆడితే, మరి కొందరు తమ తరంలో జట్టులో భాగమయ్యారు. అయితే కవల సోదరులు మాత్రం ఎప్పుడూ టీమిండియా తరఫున ఆడలేదు. అయితే చెన్నైకి చెందిన బాబా అపరాజిత్, బాబా ఇంద్రజిత్ భవిష్యత్తులో ఆ ఘనతను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నారు. భారత్‌లో ఫస్ట్ క్లాస్ స్థాయి క్రికెట్ మ్యాచ్ ఆడిన తొలి కవలలుగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు జాతీయ జట్టుకూ అలాగే కలిసి ఆడాలని కలలు కంటున్నారు.
ఒకరి తర్వాత మరొకరు...
ఈ బాబా బ్రదర్స్ తండ్రి డాక్టర్ ఆర్‌ఎన్ బాబా తమిళనాడు క్రికెట్ సంఘంలో సీనియర్ సభ్యుడు. సహజంగానే తండ్రి కారణంగా వీరిద్దరు క్రికెట్ వైపు ఆకర్షితులయ్యారు. వీరిలో ఇంద్రజిత్ ముందుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. టాపార్డర్ బ్యాట్స్‌మన్‌గా, లెగ్‌స్పిన్నర్‌గా అతను తన ప్రతిభను ప్రదర్శించాడు. తమిళనాడు అండర్-16, అండర్-19 జట్లకు అతను కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే 2012 అండర్-19 ప్రపంచకప్ ప్రాబబుల్స్‌లో ఇంద్రజిత్ పేరున్నా...అసలు జట్టులో చోటు దక్కలేదు. మరో సోదరుడు అపరాజిత్‌కు మాత్రం ఆల్‌రౌండర్ కోటాలో అనూహ్యంగా స్థానం దక్కింది. అంతకు ముందు ఏడాదే తమిళనాడు తరఫున రంజీ ట్రోఫీలో కూడా ఆడి ఉండటం అపరాజిత్‌కు కలిసొచ్చింది.
కలిసికట్టుగా...
గత ఏడాది డిసెంబర్‌లో రంజీ ట్రోఫీలో భాగంగా చెన్నైలో తమిళనాడు, సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంద్రజిత్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. రెండేళ్లనుంచి జట్టులో ఉన్న అపరాజిత్ కూడా ఈ మ్యాచ్‌లో భాగం కావడంతో... ఈ జోడి భారత దేశవాళీ క్రికెట్‌లో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ కలిసి ఆడిన తొలి భారత కవలలుగా బాబా బ్రదర్స్ గుర్తింపు తెచ్చుకున్నారు.