ర్యాంప్అందాల పూలదారి
సరిగ్గా రెండ్రోజుల క్రితం గ్లామర్ పపంచంలో భారతీయ అందం మరోసారి త‘లుక్’మంది. ఏకంగా అమెరికా దేశపు అందాల కిరీటాన్ని స్వంతం చేసుకున్న విజయవాడ అమ్మాయి నీనా దావులూరి మరోసారి మన గ్లామర్ సత్తాను ప్రపంచానికి చాటింది. రకరకాల భయాలను, బిడియాలను త్వరత్వరగా వదుల్చుకుంటున్న తెలుగమ్మాయిలు మోడలింగ్‌లో రాణిస్తున్నారు. మరెందరో అమ్మాయిలు ‘మోడల్స్’గా మెరిసేందుకు రాచబాట పరుస్తున్నారు.
మోడలింగ్ అంటే అదేదో కేవలం అందాల ప్రదర్శన మాత్రమే అనుకునేవారు ఒకప్పుడు. అయితే మిగిలిన అన్ని రంగాల తరహాలోనే అటు అందం ఇటు ఆత్మ విశ్వాసం, తెలివితేటలు అన్నీ ఉంటేనే మోడల్‌గా వెలుగొందడం సాధ్యమని గ్రహిస్తున్నారు. మోడల్‌గా మంచి అవకాశాలు దక్కించుకోవడం అనేది సినిమాలకు రెడ్‌కార్పెట్ అని కూడా అర్థం అవడంతో ఇటువైపు రావడానికి మరింతమంది ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ రంగంలో రాణిస్తున్న కొందరు హైదరాబాద్‌కు చెందిన ఔత్సాహిక మోడల్స్‌ను పలకరించినప్పుడు ఇలా స్పందించారు.
- ఎస్. సత్యబాబు
ఎన్నో రిహార్సల్స్...
కంప్యూటర్‌సైన్స్‌లో ఇంజినీరింగ్ చేస్తున్నాను. ఒక మంచి జాబ్ ఎంత అవసరమో మనల్ని మనం ఇతరత్రా నిరూపించుకునే యాక్టివిటీ కూడా అంతే అవసరం కదా! అలాంటిదే మోడలింగ్. చదువుతో పాటు, జాబ్ చేస్తూనే మానసిక సంతృప్తి కోసం మోడల్‌గానూ కొనసాగాలనేది నా ఆశయం. పెద్ద సంఖ్యలో జనం మనల్ని చూస్తూ హర్షధ్వానాలు చేస్తుంటే వచ్చే ఆనందం వేరు కదా! ఆ ఆనందాన్ని పొందేందుకే మోడల్‌గా మారాను. అయితే జనం ముందు కనపడే ఆ మెరుపుల వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ర్యాంప్ మీద మెరిసేందుకు ఎన్నోసార్లు రిహార్సల్స్ చేయాల్సి ఉంటుంది. ఎన్నిచేసినా ఒక్కసారి టాప్ మోడల్ అనిపించుకుంటే ఇక అన్నీ మర్చిపోతాం. తప్పనిసరిగా వారంలో ఐదు రోజుల పాటు రోజుకు గంటన్నర చొప్పున వ్యాయామం చేయడం దగ్గర్నుంచి ప్రపంచవ్యాప్తంగా గ్లామర్ రంగంలో వస్తున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం దాకా మా గెలుపు వెనుక ఎంతో కృషి ఉంటుంది. ఈ రంగంలో నన్ను ఎంతమంది నిరుత్సాహపరచాలని చూసినా మా అమ్మ మాత్రం ప్రోత్సహించింది. టీవీలో, మేగ్‌జైన్‌లో, షోస్‌లో నన్ను చూసినప్పుడల్లా చుట్టుపక్కలవారికి చూపించి మురిసిపోతుంటుంది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ తరహాలో ఈ రంగంలో నా ప్రస్థానాన్ని సాగించాలనుకుంటున్నాను.
- మోనిక.టి
ఏ రంగంలో పనిచేసినా...
మోడలింగ్‌ను దేనితోనూ పోల్చలేం. ఎందుకంటే అందులో ఉండే గ్లామర్, ఆ రంగానికి ఉన్న ఆకర్షణ అలాంటివి. ప్రస్తుతం ప్రముఖ చానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్నాను. టీనేజ్ నుంచి ఉన్న ఆసక్తితో మోడలింగ్‌లో ప్రయత్నాలు ప్రారంభించాను. ఈ ప్రొఫెషన్‌లో రాణించడానికి చక్కని ఫిజిక్ తప్పనిసరి. దీనికోసం ప్రతిరోజూ జిమ్‌కు వెళ్లడం, డైట్ ఫాలో అవడం చేస్తున్నాను. ఫిజికల్ ట్రైనర్ కూడా ఉన్నారు. ఈ రంగం మీద ఉన్న రకరకాల వ్యాఖ్యానాలను పట్టించుకోకుండా మా తల్లిదండ్రులు నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుండడం నా అదృష్టం. వారే నాకు ప్రథమ విమర్శకులు కూడా. ఏ రంగంలో ఉన్నా మన విద్యార్హతలను ఎప్పటికప్పుడు పెంచుకోవాల్సిందే! ఆ క్రమంలోనే నేను ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ (ఇంగ్లీష్) చేస్తున్నాను.
- వింధ్య
అందచందాలు మాత్రమే సరిపోవు...
ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చేస్తూ ఇంటీరియర్ డిజైనింగ్ కూడా చేస్తున్నాను. గ్లామర్ రంగంలో అందం అనేది ఒక ప్రాథమిక అర్హత మాత్రమే. చూడచక్కని రూపంతో బాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం వంటివి సైతం ఉంటేనే గ్లామర్ రంగంలో ఎదగగలం. నేను ఈ రంగానికి వచ్చి రెండేళ్లవుతోంది. చదువుకుంటున్నప్పుడే మోడలింగ్‌లోకి రావాలనుకుని దానికి అవసరమైన శిక్షణ కోసం హైదరాబాద్‌లోని లఖోటియా మోడలింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జేరాను. శిక్షణానంతరం ప్రసాద్ బిడప్ప మోడలింగ్ హంట్‌లో పాల్గొన్నాను. గత జూలైలో జరిగిన లఖోటియా ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేశాను. ప్రస్తుతం పలు సంస్థల ఫొటో షూట్స్‌లో పాల్గొంటున్నాను. పలు బ్రాండ్స్‌కు వర్క్ చేస్తున్నాను. ర్యాంప్ షోలలో పాల్గొంటున్నాను. టాప్ మోడల్‌గా ఎదగాలని, బాలీవుడ్‌లో అవకాశాలు దక్కించుకోవాలని ఆశిస్తున్నాను.
- ప్రియాంక