అంకితభావంతో శ్రమించండి..! | u.b.desai interview | Sakshi
Sakshi News home page

అంకితభావంతో శ్రమించండి..!

Published Sun, Mar 23 2014 10:24 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

అంకితభావంతో శ్రమించండి..! - Sakshi

అంకితభావంతో శ్రమించండి..!

ఇంజనీరింగ్.. నేటి యువత క్రేజీ కోర్సు. తమ పిల్లలను ఐఐటీల్లో చేర్పించాలని తపించని తల్లిదండ్రులు ఉండరంటే అతిశయోక్తికాదు. మరోవైపు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలు.. కోర్సు పూర్తిచేసుకొని బయటకు వస్తున్న విద్యార్థుల్లో నాణ్యతలేమి.. సరికొత్త సమస్యకు దారితీస్తోంది. మన ఇంజనీరింగ్ విద్యార్థులు జాబ్‌రెడీ స్కిల్స్ సొంతం చేసుకోవాలంటే.. ఏం చేయాలి! పరిశోధనలు, పీహెచ్‌డీల పట్ల  విద్యార్థులు ఆసక్తి చూపకపోవడానికి కారణమేంటి? మన విద్యావిధానంలో రావాల్సిన మార్పులేమిటి..  ఉద్యోగం, స్వయం ఉపాధిలో యువత దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి.. జీవితంలో విజయం సాధించడానికి విద్యార్థులు అనుసరించాల్సిన మార్గమేంటి తదితర అంశాలపై ఐఐటీ-హైదరాబాద్ డెరైక్టర్ ప్రొఫెసర్ యు.బి.దేశాయ్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ..
 
ఇంజనీరింగ్ కోర్సుల విషయంలో ప్రధాన విమర్శ..నాణ్యత లేమి. వీటిపై మీ అభిప్రాయం?
ఇంజనీరింగ్ విద్యార్థి స్పూన్ ఫీడింగ్ కోరుకోవడం సరికాదు. నైపుణ్యాలు సొంతం చేసుకునే విషయంలో అధ్యాపకుల పాత్ర ఎంత ఉంటుందో.. అంతకుమించి విద్యార్థులు కూడా మమేకం కావాలి. విద్యార్థులు తరగతి గదిలో బోధించిన అంశాలపై కేవలం పుస్తకాలు లేదా ప్రయోగశాలలకే పరిమితం కాకూడదు. ఎప్పటికప్పుడు ఆయా అంశాలకు సంబంధించి తాజా మార్పులపై లోతుగా అధ్యయనం చేయాలి. ప్రస్తుత యువతకు అందివచ్చిన వరం.. ఇంటర్నెట్. ఎన్నో పరిశోధనలు, ఆవిష్కరణల గురించిన సమగ్ర సమాచారం ఇప్పుడు ఒక్క క్లిక్‌తో మనకు అందుబాటులోకి వస్తోంది. కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంటర్నెట్‌ను సద్వినియోగం చేసుకోవాలి. అధ్యాపకులు కూడా  తమ డొమైన్ ఏరియాల్లో విద్యార్థుల ఉత్సుకత పెరిగే విధంగా బోధించాలి. కేవలం తరగతి గదిలో బోధనతోనే తమ బాధ్యత పూర్తయిందని భావించకూడదు. మెంటార్స్‌గానూ వ్యవహరిస్తూ ముందడుగు వేసేలా ప్రోత్సహించాలి.
 
 ఇతర దేశాలతో పోల్చితే మన విద్యా విధానంలో ముఖ్యంగా ఇంజనీరింగ్‌లో తేడా ఏంటి?
 అమెరికా, కెనడా, జపాన్ తదితర దేశాల్లో సరళమైన(ఫ్లెక్సిబుల్) లెర్నింగ్ విధానం అమలవుతోంది. కానీ మన దగ్గర స్ట్రక్చరల్ తరహా బోధన సాగుతోంది. ఒకే సిలబస్, కరిక్యులంను కొన్నేళ్లపాటు బోధిస్తున్నారు. మెమొరీ బేస్డ్ విధానానికి ప్రాధాన్యం ఇచ్చేలా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాంతో మార్కులు, పర్సంటేజి, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం.. ఇవే మన విద్యార్థుల ప్రధాన లక్ష్యాలుగా మారుతున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించాలి. ప్రాక్టికాలిటీకి, ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా క్షేత్రస్థాయి నైపుణ్యాలు పొందేందుకు ప్రాధాన్యమివ్వాలి.
 
 విద్యార్థుల్లో జాబ్ రెడీ స్కిల్స్ ఉండట్లేదనే వ్యాఖ్యలపై మీ కామెంట్?
 పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఉండే విద్యార్థుల సంఖ్య 20 నుంచి 25 శాతమే అనే మాటల్లో వాస్తవం లేకపోలేదు. అయితే, ప్రస్తుత పోటీ ప్రపంచంలో మార్కెట్ అవసరాలు రోజురోజుకీ మారుతున్నాయి. దాంతో మానవ వనరుల నైపుణ్యాల విషయంలోనూ పరిశ్రమ అవసరాలు నిరంతరం మారుతున్నాయి. కంపెనీల అవసరాలకు అనుగుణంగా.. జాబ్‌రెడీ స్కిల్స్‌ను విద్యార్థులకు అందించలేకపోవడానికివిద్యావిధానం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు.
 
 ఆర్ అండ్ డీ విషయంలోనూ మన విద్యార్థులు వెనుకంజలో ఉండటానికి కారణం?
 రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విషయంలో విద్యార్థులు వెనుకంజలో ఉండటానికి రెండు ప్రధాన కారణాలు.. అవి.. అకడెమిక్ స్థాయిలో సరైన అవగాహన కల్పించకపోవడం.. రెండు.. ఇన్‌స్టిట్యూట్‌లు, పరిశ్రమ వర్గాల మధ్య ఆశించిన స్థాయిలో ఒప్పందాలు లేకపోవడం. ఐఐటీలు, ఐఐఎస్‌ఈఆర్, ఐఐఎస్‌సీ వంటి కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లలో ఇండస్ట్రీ స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అందిస్తున్నప్పటికీ.. ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు లేదా కాలేజీలలో ఇది కొరవడింది. ఈ సమస్యకు పరిష్కారం.. మన విద్యా విధానంలో మార్పు ద్వారానే సాధ్యం. అంతిమంగా ప్రాక్టికల్ అప్రోచ్‌కు పెద్దపీట వేసేలా కరిక్యులం రూపొందించాలి.
 
 విద్యార్థులు ఆర్ అండ్ డీ, పీహెచ్‌డీల వైపు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎందుకు?
 పీహెచ్‌డీలో చేరితే కెరీర్‌లో స్థిర పడటానికి ఏళ్ల తరబడి పడుతుందనే భావన సరికాదు. పీహెచ్‌డీ, ఆర్ అండ్ డీల దిశగా అడుగులు వేస్తే అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. పీహెచ్‌డీలో ప్రవేశించిన విద్యార్థుల కోసం ఎన్నో ఫెలోషిప్‌లు, స్కాలర్‌షిప్‌లు  ఉన్నాయి. ఇవి వాళ్ల పరిశోధనలకు సరిపోవడమే కాకుండా కొంత మొత్తం కుటుంబ అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి పరిశోధనల పట్ల నిజమైన ఆసక్తి కలిగిన విద్యార్థులు పీహెచ్‌డీ వైపు దృష్టి సారించాలని నా సూచన.
 
 నేటి యువత.. ఉద్యోగం, స్వయం ఉపాధి.. వీటిలో దేనికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది?
 ఇది ఆయా విద్యార్థుల వ్యక్తిగత ఆసక్తులు, అభిరుచులు, అవసరాలపై ఆధారపడి ఉంటుంది.  నా అభిప్రాయంలో స్వయం ఉపాధి కోరుకునే విద్యార్థులు ముందుగా కొన్నేళ్లు సంబంధిత రంగంలో అనుభవం గడించాలి. తద్వారా ఆ రంగంలోని లోటుపాట్లపై వారికి పూర్తి అవగాహన లభిస్తుంది. ఆ తర్వాతే స్వయం ఉపాధి దిశగా ప్రయత్నించాలి. ఇటీవల కాలంలో బాగా పాపులర్ అవుతున్న మాట.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్ట్-అప్స్! ఔత్సాహిక విద్యార్థులకు వీటి గురించి గ్రాడ్యుయేషన్ స్థాయి నుంచే అవగాహన కల్గించాలి. ఇప్పటికే ఐఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంటర్‌ప్రెన్యూర్-సెల్స్, ఎంటర్‌ప్రెన్యూర్ ఇంక్యుబేటర్స్ వంటివి ఏర్పాటు చేసి ఆ తరహా శిక్షణ అందిస్తున్నారు. ఐఐటీ-హైదరాబాద్‌లో బీటెక్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ఒక మైనర్ సబ్జెక్ట్‌గా అందిస్తున్నాం.
 
 మన ఐఐటీలు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో వెనుకంజలో ఉండటానికి కారణం?
 ర్యాంకుల నిర్ధారణకు వినియోగించే రెండు పరామితులు.. ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్.. ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీని నియమించుకోవాలంటే వారికి అత్యున్నత వేతనాలు అందించాలి. కానీ మన ఐఐటీల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయా పే కమిషన్ల సిఫార్సు పరిమితికి మించి వేతనాలు అందించలేం. అదేవిధంగా ప్రభుత్వ విధానాల వల్ల అంతర్జాతీయ విద్యార్థులకు అనుమతులిచ్చే శాతం కూడా పరిమితంగా ఉంటుంది.
 
 జేఈఈ ఔత్సాహికులకు మీ సూచన?

 జేఈఈ.. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ఇంజనీరింగ్ కోర్సు అభ్యసించడానికి మార్గం. దాదాపు 15 లక్షల మంది పోటీ పడుతుంటారు. ఐఐటీల్లో  చదివితేనే రాణించగలం అనే భావన ఏర్పరచుకుని.. మానసిక ఒత్తిడికి గురి కాకూడదు.  ఇంజనీరింగ్ అంటే ఐఐటీలు, ఎన్‌ఐటీలే కాదు. మరెన్నో మంచి ఇన్‌స్టిట్యూట్‌లు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ఐఐటీల్లో చదవకుండా ఉన్నత స్థానాలు అధిరోహించిన వారెందరో ఉన్నారు. ఇందుకు తాజా నిదర్శనం.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి.
 
 విద్యార్థుల విజయానికి మీరిచ్చే సలహా?

 1950లు, 1960ల నుంచి 1970ల ద్వితీయార్థం వరకు మన దేశంలో న్యాయశాస్త్రం ప్రధానమైన కోర్సుగా ఉండేది. ఇంజనీరింగ్ పట్ల 1970ల ద్వితీయార్థం నుంచి క్రేజ్ పెరిగింది.


 అంటే.. వాస్తవ అవసరాలకు అనుగుణంగా ఆయా కోర్సుల డిమాండ్ మారుతుంది. అంతేకానీ కేవలం ఒక్క కోర్సుతోనే భవిష్యత్తు అనుకోకూడదు. ఏ కోర్సయినా.. విద్యార్థులు నిజాయతీ, నిబద్ధత, ఆసక్తి, అంకిత భావంతో అభ్యసిస్తే, శ్రమిస్తే అవకాశాలకు కొదవుండదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement