మూతిముడుచుకున్న మానులు సైతం...
చైత్రంలో కొత్త చిగురులు తొడుక్కుంటాయి.
మూగబోయిన కోకిల స్వరం వికసిత పుష్పమవుతుంది.
అరమెరపుతో అల్లాడిన రేరాజు వెలుగుల రేడుగా విరాజిల్లుతాడు.
ఓ వైపు గాలుల పరిమళం మరో వైపు పక్షుల కలస్వనం ఒకదానిని మించి ఒకటి పోటీపడుతుంటే ప్రకృతికాంత ఈ కొత్త సింగారాలతో హొయలుపోతుంది.
కావ్యకాంత ఆ నయగారాలకు వంతపాడుతుంది.
పచ్చని సిరులను పరికిణీలుగా కావ్యపు ఝరులను పయ్యెదగా మార్చి
చిగురులకు సొబగులు అద్దేది మేమే సుమా అంటూ మగువలు ధీటైన సమాధానమిస్తే అది ఉగాది.
నట్టింటికి కళ తీసుకువస్తే అది యుగాది.
తెలుగింటి పండగకు తోరణమయ్యేపదహారణాల పడతులకు జయనామ సంవత్సరాన జయం... జయం..!
1- ఆమనికి కొత్త వెలుగు వచ్చినట్టుగా కనువిందు చేస్తోంది ఈ పరికిణీ, వోణీ. నీలిరంగు నెట్ లెహెంగాకు బ్రొకేడ్, వెల్వెట్ అంచులను జత చేసి పైన అంతా స్టోన్ వర్క్ చేశారు. అదే కాంబినేషన్‌లో వోణీని తీర్చిదిద్ది, బెనారస్ బ్లౌజ్‌ను జత చేశారు.
2- చూపుతిప్పుకోనివ్వని అమరికతో ఈ పరికిణీ వోణీ రాయంచకళతో ఆకట్టుకుంటోంది. గంధపు రంగు లెహెంగాకు చాకోలెట్ రంగు అంచు, దానిపైన యాంటిక్‌స్టోన్ వర్క్‌తో తీర్చిదిద్దారు. అదే రంగు బ్రొకెడ్ బ్లౌజ్‌ను, చాకోలెట్ రంగు నెట్ వోణీ జత చేశారు.
3- ఆకర్షణీయంగా కనువిందు చేస్తోంది వంగపండు రంగు లెహెంగా వోణీ! బెనారస్ నెట్ లెహెంగాపై జర్దోసి, పిస్తావోవర్క్ చేశారు. ఎరుపు రంగు నెట్ వోణీని, వెల్వెట్, గోల్డ్ టిష్యూ కాంబినేషన్ గల బ్లౌజ్‌ను జత చేశారు.
4- పసుపు రంగు బెనారస్ లెహంగాపైన వీవింగ్, ప్యారెట్ డిజైన్‌తో జర్దోసి, వైట్‌స్టోన్ వర్క్ చేశారు. గులాబీ రంగు నెట్ ఓణీపై గోల్డెన్ స్టోన్స్.. లంగాకు మ్యాచ్ అయ్యేలా యాంటిక్ బెనారస్ టిష్యూ బార్డర్‌తో అదనపు హంగులను అద్దారు.
5- గులాబీ రంగు లెహెంగాపై పువ్వులు లతలు వచ్చేలా జర్దోసీ వర్క్, అంచుకు యాంటిక్ స్టోన్ వర్క్ చేశారు. ఈ పరికిణీకి ఆకుపచ్చని వోణీ, బ్రొకేడ్ బ్లౌజ్‌ను జత చేయడంతో పండగ కళ వచ్చింది.
కాంబినేషన్ ముఖ్యం
ముందుగా ఫ్యాబ్రిక్, కాంబినేషన్ చూసుకోవాలి.
లెహంగా వోణీల డిజైన్ సాధారణంగా ఉంటే జాకెట్టు పై వర్క్ ఎక్కువ ఉండేలా జాగ్రత్తపడాలి.
లావుగా ఉన్నవారు సింపుల్ ఉండే లంగా వోణీలను ఎంచుకోవాలి.
సన్నగా ఉన్నవారు లెహెంగా కింది భాగంలో ‘క్యాన్‌క్యాన్’ మెటీరియల్‌ను వేయాలి. దీనివల్ల కుచ్చిళ్లు పరుచుకున్నట్లు కనిపిస్తాయి.
పదహారణాల పండగ
Published Wed, Mar 26 2014 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 5:12 AM
Advertisement
Advertisement