మార్చని శిక్షలు | Unchangeable punishments | Sakshi
Sakshi News home page

మార్చని శిక్షలు

Published Sun, May 27 2018 12:35 AM | Last Updated on Sun, May 27 2018 12:35 AM

Unchangeable punishments - Sakshi

జునైద్‌ బగ్దాదీ అనే ధార్మిక పండితుడు తన వ్యక్తిత్వంతో ఎంతోమంది కరుడుగట్టిన నేరగాళ్లలో సైతం పరివర్తన తీసుకువచ్చారు. ఆయన కాలంలోనే ఒక గజ దొంగ ఉండేవాడు. తన దోపిడీలు, దొంగతనాలతో ప్రజలకు ముచ్చెమటలు పట్టించేవాడు. ఆ గజదొంగ పేరు వింటేనే ప్రజలు వణికిపోయేవారు. ఎన్నిసార్లు బంధించి ఎన్ని శిక్షలు విధించినా తన దొంగబుద్ధిని మాత్రం మార్చుకోలేదు. చివరికి హస్త ఖండన చేసినప్పటికీ ఒంటిచేత్తో కూడా దొంగతనాలకు పాల్పడేవాడు. ఒకసారి ఈ గజదొంగ జునైద్‌ బగ్దాది ఇంట్లో జొరబడ్డాడు.

జునైద్‌ బగ్దాది విదేశాల నుంచి ఎంతో ఇష్టంగా తెప్పించుకున్న ఖరీదైన బట్టలపై ఆ దొంగ దృష్టిపడింది. ఆ బట్టలన్నీ ఒక మూటకట్టి ఒంటిచేత్తో తలకెత్తుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడు. అంతలోనే జునైద్‌ బగ్దాది రాత్రి నమాజ్‌ కోసం లేచి చూస్తే దొంగ కనిపించాడు. గజదొంగ జునైద్‌ను ఇంటి నౌకరుగా భావించి, మూటను తలకెత్తుకుని తనతో రావాలని బెదిరించాడు. జునైద్‌ మారుమాట్లాడకుండా ఆ బట్టల మూటను తలకెత్తుకొని గజదొంగను అనుసరించారు.

జునైద్‌ బక్కపల్చగా ఉండటం వల్ల మూటను మోయలేకపోయారు. వేగిరంగా నడవమని జునైద్‌ ను దొంగ తొందర పెట్టసాగాడు. ఎట్టకేలకు దొంగ ఇంటివద్ద ఆ బట్టల మూటను దించి, జునైద్‌ బగ్దాది తన ఇంటికి చేరుకున్నారు. రాత్రంతా ఆ గజదొంగ గుర్రుపెట్టి నిద్రపోయాడు. తెల్లారి లేచిన తరువాత గజదొంగకు భయం పట్టుకుంది. తన మూటను ఎత్తుకొచ్చినతను తన చిరునామా యజమానికి చెబుతాడేమోనన్న దిగులు పట్టుకుంది. ఆ ఇంటికి వెళ్లి ఆ నౌకరును బెదిరించి తన దారికి తెచ్చుకోవాలని బయలుదేరాడు. ఆ ఇంటి సమీపానికి చేరుకోగానే ఎంతోమంది ప్రముఖులు, సంపన్నులు, మహా మహా పండితులు ఆ ఇంటివద్ద బారులు తీరి ఉన్నారు.

ఇదంతా గమనించిన దొంగకు ఆ ఇల్లు ఒక గొప్ప పండిత  వారి ఇల్లు అని అర్థమైంది. ఆ పండిత మహాశయుడిని ఎలాగైనా  చూడాలనే కోరిక కలిగింది. తన ఒంటి చేయి ఎవరికీ కనపడకుండా చొక్కాలో దాచుకుంటూ ఇంట్లోకి జొరబడ్డాడు. ఇంట్లోకి చేరుకోగానే దొంగ బిత్తరపోయాడు. ‘రాత్రి తాను నౌకరనుకుని మూట మూయించి హింసించిన వ్యక్తే ఆ మహాపండితుడని, ఆయనే ఆ ఇంటి యజమాని అని అర్థమైపోయింది. ఆయనను చూడగానే దొంగలో పరివర్తన వచ్చింది. పశ్చాత్తాపంతో కుంగిపోయాడు. పండితుల వారు దొంగకు విద్యాజ్ఞానాలు బోధించి మహామనిషిగా తీర్చిదిద్దారు. ఎన్ని శిక్షలు విధించినా కలగని మార్పు ఒక మంచి వ్యక్తిత్వంతో సాధ్యమవుతుందని ఈ సంఘటన రుజువు చేస్తుంది.

– అబ్దుల్‌ మలిక్‌

Advertisement

పోల్

Advertisement