అనేకసార్లు మూత్రం... అతికష్టం మీద విసర్జన... ఎందుకిలా? | Urine several times ... Lay down on a rocky ... Why? | Sakshi
Sakshi News home page

అనేకసార్లు మూత్రం... అతికష్టం మీద విసర్జన... ఎందుకిలా?

Published Thu, Dec 26 2013 10:53 PM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

అనేకసార్లు మూత్రం... అతికష్టం మీద విసర్జన... ఎందుకిలా?

అనేకసార్లు మూత్రం... అతికష్టం మీద విసర్జన... ఎందుకిలా?

నా వయసు 62. గత ఐదేళ్ల నుంచి షుగర్, బీపీ వ్యాధులున్నా,  కంట్రోల్‌లోనే ఉంటున్నాయి. గత కొద్దికాలంగా మూత్రంలో మంట, ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సి రావడం జరుగుతోంది. ఉదయం లేవగానే మూత్రం వచ్చినట్లు ఉంటుందిగాని... మూత్రవిసర్జన కోసం చాలాసేపు పడుతోంది. ఇలా మూత్రం సరిగా రాకపోతే మంచిదికాదని, కిడ్నీ సమస్య రావచ్చని ఫ్రెండ్స్ చెప్పారు. దీనికితోడు నా కాళ్లకు వాపులు వచ్చాయి. దాంతో నాకు కిడ్నీ చెడిపోయిందేమోనని ఆందోళనగా ఉంటోంది. తగిన సలహా ఇవ్వగలరు.
 - ఎస్.కె.బి., చెన్నై

 
 వయసు పెరిగిన వాళ్లలో ముఖ్యంగా చలికాలంలో మూత్రం ఎక్కువసార్లు వస్తుంటుంది. మీరు చెబుతున్నట్లుగా ఇలా మూత్రం ఎక్కువగా వస్తూ, ధార సరిగా రాకపోవడం ప్రోస్టేట్‌గ్రంథి వాపును సూచిస్తోంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించుకోండి. ఆ పరీక్ష ద్వారా మూత్రాశయ సామర్థ్యం, విసర్జన తర్వాత ఎంత మూత్రం మిగులుతోందన్న విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రోస్టేట్ పరిమాణం కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది.

సాధారణంగా ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం 20 గ్రాములు ఉంటుంది. ఒకవేళ ఆ పరిమాణం 40 గ్రాముల కంటే ఎక్కువగా ఉండి, విసర్జన తర్వాత మూత్రాశయంలో 50 ఎం.ఎల్. కంటే ఎక్కువగా మూత్రం మిగిలిపోతుంటే, అంత మంచి సూచన కాదు. అందుకే ఈ పరీక్షలు చేయించుకుని, డాక్టర్‌ను సంప్రదించండి. ఇక కిడ్నీ పనితీరు సరిగా ఉందో లేదో తెలుసుకోవడానికి క్రియాటినిన్, బ్లడ్ యూరియా అనే సాధారణ పరీక్షలు చేయించుకోండి. మీకు షుగర్ కూడా ఉందని చెబుతున్నారు.

ఇలా షుగర్ ఉన్నవాళ్లలో పురుషాంగం చివరన ఉండే రంధ్రం మూసుకుపోవడం వల్ల కూడా మీరు చెబుతున్న లక్షణాలు కనిపించవచ్చు. అందుకే మీరు పై పరీక్షలు చేయించుకుని, యూరాలజిస్ట్‌ను కలవండి. మీ సమస్యను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. అయితే పైన పేర్కొన్న సమస్యలేమీ ఆందోళనకరమైనవి కావు. కాబట్టి నిర్భయంగా, నిశ్చింతగా ఉండండి.
 
 నా వయసు 25. రెండు నెలల క్రితం ఒక వేశ్యతో కలిశాను. ఆ తర్వాత మూత్రంలో విపరీతమైన మంట వచ్చింది. రెండు రోజుల క్రితం కుడి వృషణం బాగా వాచి, తీవ్రమైన నొప్పి వస్తోంది. అయితే జ్వరం, పురుషాంగం మీద కురుపులు వంటి లక్షణాలేమీ లేవు. నాకు ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉందా? ఆందోళనగా ఉంది. తగిన సలహా చెప్పగలరు.
 -వి.వి.ఆర్., హైదరాబాద్

 
 యుక్తవయసులో ఉన్నవారు సెక్స్ కోరికలు తీర్చుకోవడానికి వేశ్యల వద్దకు వెళ్లడం ఎంతమాత్రమూ మంచిది కాదు. ఇలా వారి వద్దకు వెళ్తే చర్మవ్యాధులు మొదలుకొని, మూత్రంలో ఇన్ఫెక్షన్... శరీరంలోని ఏ భాగంలోనైనా ఇన్ఫెక్షన్ వరకు అనేక వ్యాధులు రావచ్చు. వీటినే ఎస్‌టీడీస్... (సెక్సువల్లీ ట్రాన్స్‌మిటింగ్ డిసీజెస్) అంటారు. మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీకు మూత్రంలో ఇన్ఫెక్షన్ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) వచ్చి ఉంటుంది. అది ఒక్కోసారి వృషణాలకూ పాకవచ్చు. దాంతో ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే మీరు చెబుతున్న లక్షణాలేవీ హెచ్‌ఐవీకి సూచన కాదు. అయినప్పటికీ మీరు ఒకసారి ఎస్‌టీడీస్‌లన్నింటి కోసం తగిన నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం అవసరం. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ కల్చర్, హెచ్‌ఐవీ, హెపటైటిస్, వీడీఆర్‌ఎల్ వంటి పరీక్షలు చేయించుకోవాలి. వాటితోపాటు హెచ్‌ఐవీ లేదని రిపోర్టు వస్తేనే మీరు సురక్షితంగా ఉన్నారని భావించవచ్చు. ఎస్‌టీడీలను నివారించగలిగే కండోమ్ వంటి సురక్షితమైన విధానం పాటించకుండా సెక్స్ చేయడం మంచిది కాదు. అయితే కండోమ్ అన్నది ఎస్‌టీడీలను నివారించడానికి కాదు. మన సమాజంలో పెళ్లికి ముందు శారీరకంగా కలవడం అన్నది ఇతరత్రా అనేక సమస్యలకు దారితీయవచ్చు. పైన పేర్కొన్న అన్ని పరీక్షలూ చేయించుకుని, డాక్టర్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. మీ వయసు 25 అంటున్నారు కాబట్టి ఆర్థికంగా మీ కాళ్ల మీద మీరు నిలబడి, త్వరగా పెళ్లి చేసుకోండి.
 
 మా బాబుకు 12 ఏళ్లు. ఒకరోజు అకస్మాత్తుగా ఎడమవైపు వృషణంలో నొప్పి, వాపు వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాప్లర్ అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ పరీక్ష చేశారు. వృషణం పూర్తిగా చెడిపోయింది, తీసివేయాలని చెప్పి అప్పటికప్పుడు ఆపరేషన్ చేసి తీసేశారు. ఇప్పుడు బాబుకు ఒకటే వృషణం ఉంది. మరి వాడు పెద్దయ్యాక సెక్స్ కోసం గాని, పిల్లలు పుట్టడానికి గాని ఏమైనా ఇబ్బంది ఉంటుందా?
 - జి.కె.ఎమ్., నెల్లూరు

 
 మీరు చెబుతున్న విషయాన్ని బట్టి మీ బాబుకు టెస్టిక్యులార్ టార్షన్ (వృషణం తిరగబడటం) జరిగి ఉండవచ్చు. ఇలా వృషణం తిరగబడితే ఆరుగంటల్లోపు ఆపరేషన్ చేయించుకుంటే, వృషణాన్ని కాపాడుకోవచ్చు. సమయం మించిపోతే మాత్రం దాన్ని తీసేయాల్సి ఉంటుంది. అందువల్ల చిన్నపిల్లల్లో అకస్మాత్తుగా వృషణం నొప్పి వస్తే, వెంటనే డాప్లర్ స్కాన్ చేయించి, యూరాలజిస్ట్‌ను కలవాలి. మీ బాబు విషయంలో ఒక వృషణం మాత్రమే ఉంది కాబట్టి అది కూడా మళ్లీ తిరగబడకుండా ఫిక్స్ (ఆర్కిడోపెక్సీ) చేయాల్సి ఉంటుంది. ఒక్క వృషణం ఉన్నా కూడా భవిష్యత్తులో సెక్స్ సామర్థ్యానికి ఎలాంటి సమస్యా ఉండదు. పిల్లలు పుట్టే అవకాశం నార్మల్‌గానే ఉంటుంది. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి. అయితే మీ బాబు విషయంలో అతడి రెండోవృషణాన్ని ఫిక్స్ చేశారో లేదో తెలుసుకోవడం ముఖ్యం. ఒకసారి యూరాలజిస్ట్‌ను కలిసి, తగు సలహా, చికిత్స తీసుకోండి.
 
 డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్,
 ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్‌బి, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement