వందన సూఫియా కటోచ్
గ్రేడ్‌లు..తెలివితేటలను కొలవలేవు. మార్కులు, ర్యాంకులు.. అంటూ పిల్లలను ఊదరగొడుతున్న నేటి పోటీ ప్రపంచంలో ఒక అమ్మగా ఇది నేను నమ్మిన సత్యం. – వందన సూఫియా కటోచ్
డిసెంబర్ దాటిందంటే.. పదో తరగతి పిల్లలకు, వాళ్ల పెద్దవాళ్లకూ ఫైనల్ ఎగ్జామ్స్ మూడ్ (ఫోబియా అనాలేమో!) వచ్చేస్తుంటుంది. ‘కార్పొరేట్ విద్యాసంస్థల మాయాజాలంలో పడవద్దు. పిల్లలను ఒత్తిడికి గురి చేయవద్దు. తెలివితేటలు ర్యాంకుల్లో ఉండవు. పిల్లల్లో మేధాశక్తిని వికసించనివ్వండి. వాళ్లకు ఇష్టమైన కోర్సుల్లో చేరనివ్వండి. పదో తరగతి ఆ తరగతికే కానీ పరీక్ష జీవితానికి కాదు’ అని నెటిజన్‌లు ఒక పాత పోస్ట్‌ను తెరమీదకు తెచ్చారు. అదిప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది! దాని గురించి తెలుసుకోవలసిందే.
తనయులు ఆమెర్ (ఎడమ), ఆయాన్‌లతో వందన.
చదువు వ్యాపారమైపోయి దాదాపుగా మూడు దశాబ్దాలవుతోంది. మన పిల్లలు ఏం చదవాలన్నది కార్పొరేట్ స్కూళ్లు నిర్ణయించేస్తున్నాయి. పిల్లల మార్కులు తొంబైకి తగ్గితే పేరెంట్స్‌ని పిలిచి క్లాస్‌లు పీకుతున్నాయి. టెన్త్ క్లాస్, ట్వల్త్ క్లాస్ రిజల్ట్స్ వస్తున్నాయంటే పిల్లల వెన్నులో వణుకు మొదలవుతుంటుంది. తల్లిదండ్రుల్లో ఆందోళన. ఇక రిజల్డ్స్‌కి ముందు ఇంట్లో ఆందోళనతో కూడిన మౌనం రాజ్యమేలుతుంటుంది. మార్కులు తగ్గితే అమ్మానాన్నలు తన మీద పెట్టుకున్న ఆశలకు విఘాతం కలుగుతుందేమోనని పిల్లలు నలిగిపోతుంటారు. మార్కులు తగ్గితే మంచి కాలేజ్‌లో సీట్ రాదేమో, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని అమ్మానాన్నల గుండెలు పల్పిటేషన్‌కు గురవుతుంటాయి. ఇలాంటి రోజుల్లో... ఢిల్లీకి చెందిన వందన ‘స్ట్రెస్ బస్టర్’ విప్లవాన్ని తెచ్చారు. తల్లిదండ్రులందరూ వందనలాగానే ఆలోచిస్తే పిల్లల్లో చదువు ఒత్తిడి కానే కాదు. రాబోతున్న పరీక్షల సీజన్‌లో కూడా ఆడుతూ పాడుతూ హాయిగా చదువుకుంటారు.
వందన ఏం చేసిందంటే
గత ఏడాది (2018–19 విద్యా సంవత్సరం) వందన కొడుకు ఆమెర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో పదోతరగతి పరీక్షలు రాశాడు. మే నెలలో రిజల్ట్స్ వచ్చాయి. వందనకు తన కొడుకు తొంబైలతో పాస్ కాడని తెలుసు. మొత్తానికైతే పాస్ అయి తీరుతాడనీ తెలుసు. తన కొడుకు తెలివితక్కువ వాడేమీ కాదు. ఎన్ని తెలివితేటలుంటే మాత్రం ‘చేప చెట్టెక్కుతుందా’ అనేది ఆమె ఫిలాసఫీ. ‘తనకు ఇష్టం లేని సబ్జెక్టులన్నీ చదవమంటే ఎన్నింటినని బలవంతంగా బుర్రలో దాచుకుంటాడు’ అని కూడా కొడుకు తరఫున వాదిస్తుంది. టెన్త్ పరీక్షలకు మూడు నెలల ముందు నుంచే ఆమె కొడుకు మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఫెయిల్ కాకుండా ఉండడానికి మాత్రమే కొడుకు ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టిందామె. ఆ పిల్లాడు తన శక్తి కొద్దీ కష్టపడ్డాడు కూడా. అరవై శాతం మార్కులతో పాసయ్యాడు.
కొడుకు ముఖం చిన్నబుచ్చుకోకూడదని రిజల్ట్స్ రోజు, రిజల్ట్స్ ప్రకటించే సమయానికి వందన కూడా స్కూల్‌కెళ్లారు. అప్పటికే తొంభైశాతం స్టూడెంట్స్ అంతా ఒకరినొకరు అభినందించుకుంటూ కనిపించారు. తల్లిని చూడగానే వందన వాళ్లబ్బాయి దీనంగా ముఖం పెట్టి ‘‘సిక్స్‌టీ పర్సెంట్ అమ్మా’’ అన్నాడు. వందన అమాంతం కొడుకుని దగ్గరకు తీసుకుని ‘‘యూ మేడ్ మమ్మా ప్రౌడ్’’ అని ముద్దు పెట్టుకున్నారు! అదే విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ‘‘మా అబ్బాయి సిక్స్‌టీ పర్సెంట్‌తో టెన్త్‌క్లాస్ పాసయ్యాడు. నాకు చాలా గర్వంగా ఉంది.
మీరేమీ పొరబడడం లేదు. 90 పర్సెంట్ అని రాయబోయి ఆ అంకె పొరపాటున 60గా కంపోజ్ కాలేదు. నిజంగా 60 శాతమే. ఇష్టం లేని సబ్జెక్టు కోసం కష్టపడమని పిల్లలను వేధించడం కూడా తప్పే. మన విద్యావిధానంలో పదోతరగతి వరకు ఇష్టం ఉన్నా లేకపోయినా అన్ని సబ్జెక్టులనూ చదవాల్సిందే. టెన్త్ గట్టెక్కడం కోసం మాత్రమే మా అబ్బాయికి ఇష్టంలేని సబ్జెక్టులను కూడా దగ్గరుండి చదివించాను. ఇప్పుడా గండం గట్టెక్కేశాడు. ఇక మా వాడు ఫ్రీ. తనకు ఇష్టమైన సబ్జెక్టుల్లోనే ప్లస్ వన్ చదువుకుంటాడు’’ అని ఆమె పెట్టిన పోస్ట్‌ని దాదాపుగా తొమ్మిది వేల మంది లైక్ చేశారు. పన్నెండు వేల మంది సానుకూలమైన కామెంట్ చేశారు. మరో ఐదు వేల మందికి పైగా ఆ పోస్ట్‌ను షేర్ చేశారు. అరవై శాతం మార్కులను తక్కువగా చూసే వాళ్లకు ఇదో పాఠం అనే కామెంట్‌లు కూడా వచ్చాయి. – మంజీర
Comments
Please login to add a commentAdd a comment