‘‘వేయిపడగల మీద .. కోటి మణుగుల నేల.. మోసి అలసిన స్వామి.. మోపిదేవి స్వామి.. హరుని కంఠం వీడి హరిని నిద్దుర లేపి కదిలిరా.. కదలిరా..’’ అంటూ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విశిష్టతను తెలియజేసే చిత్ర గీతం నేటికీ చాలా ఆలయాల్లో మార్మోగుతుంటుంది. ఈ స్వామిని దర్శించుకున్న వారికి సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మోపిదేవిని పూర్వం కుమారక్షేత్రమని, మోహినిపురమని పిలిచేవారని స్కందపురాణం ద్వారా తెలుస్తోంది. ఓ సందర్భంలో పార్వతీదేవి, తన తనయుడైన కుమారస్వామిని మందలించిందట. స్వామి పశ్చాత్తాపంతో తపస్సు చేసేందుకు భూలోకంలోని ఈ ప్రాంతానికి వచ్చి సర్పరూపం దాల్చి పుట్టలో ఉండి తపస్సు చేస్తున్నాడట. కొంతకాలానికి అగస్త్య మహర్షి కృష్ణానదీ తీరాన గల మోహినీపురం చేరుకుని నదిలో స్నానం చేసేందుకు వటవృక్షం చెంతకు చేరగా, అక్కడే ఉన్న పుట్టలో నుంచి దివ్యమైన కాంతిపుంజం కానరావడంతో దివ్యదృష్టితో శోధించగా, పుట్టలో తపస్సు చేసుకుంటున్న కుమారస్వామి దర్శనమిచ్చాడట. అగస్త్యముని స్వామి తపస్సుకు భంగం కలగకుండా, పుట్టలోపల ఉన్న శివలింగాన్ని బయటకు తీసి పుట్టపై ప్రతిష్టిస్తారు. అనంతరం ఈ ప్రాంతానికి కుమారక్షేత్రంగా నామకరణం చేసి అగస్త్యముని ఇక్కడ నుంచి వెళ్లిపోయారని, ఈ కుమారక్షేత్రమే తరువాత కాలంలో మోహినీపురంగానూ, మోపిదేవిగానూ రూపాంతరం చెందినట్టు ఆలయ చరిత్ర తెలియజేస్తోంది.
దేవతలచే పూజలందుకున్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి లింగాకృతి కొన్నేళ్ల తరువాత అదృశ్యమై ఇక్కడున్న పుట్టలో ఉండిపోయింది. ఈ పుట్టకు దగ్గరలో వీరారపు పర్వతాలు అనే భక్తునికి స్వామి కలలో కనబడగా పుట్టలో ఉన్న శివలింగాన్ని బయటకు తీసి ప్రస్తుతం ఆలయంలో ఉన్న ప్రాంతంలో ప్రతిష్టించినట్లు, అనంతరం దేవరకోట సంస్థానాధీశులైన శ్రీమంతురాజా యార్లగడ్డ వారి వంశీయులు నిత్యధూప, దీప, నైవేద్యాలతో పాటు కొంత భూమిచ్చి శిఖర, గోపుర మండపాలతో స్వామివారికి ఆలయం నిర్మించారు. నాటినుంచి స్వామివారు భక్తుల కోర్కెలు తీరుస్తూ పూజలందుకుంటున్నారు. సుబ్రహ్మణ్యషష్ఠికి స్వామికి భక్తులు విశేషపూజలు చేస్తారు.
– ఉప్పల సుబ్బారావు, సాక్షి, మోపిదేవి, కృష్ణాజిల్లా
ఇలా వెళ్లాలి
అమరావతి, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుంచి వచ్చే భక్తులు తెనాలి చేరుకుని అక్కడ నుంచి రేపల్లె రావాలి. ఇక్కడ నుంచి మచిలీపట్నం, చల్లపల్లి వెళ్లే బస్సులు ఎక్కితే ఆలయం ముందు దిగవచ్చు. రేపల్లె రైల్వేస్టేషన్ నుంచి మోపిదేవికి ఆటోలు అందుబాటులో ఉంటాయి. విజయవాడ నుంచి వచ్చే వారు కరకట్ట మీదుగా మోపిదేవి వార్పు నుంచి మోపిదేవికి 59 కి.మీ, లేదా నడకుదురు మీదుగా వయా చల్లపల్లి నుంచి మోపిదేవికి 64 కి.మీ దూరం ఉంటుంది. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నుంచి అవనిగడ్డ వెళ్లే బస్సులు ఎక్కితే ఆలయం ముందు దిగొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment