Venugopal Swamy
-
వేయి పడగల మీద.. కోటి మణుగుల నేల..మోపిదేవి స్వామి
‘‘వేయిపడగల మీద .. కోటి మణుగుల నేల.. మోసి అలసిన స్వామి.. మోపిదేవి స్వామి.. హరుని కంఠం వీడి హరిని నిద్దుర లేపి కదిలిరా.. కదలిరా..’’ అంటూ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విశిష్టతను తెలియజేసే చిత్ర గీతం నేటికీ చాలా ఆలయాల్లో మార్మోగుతుంటుంది. ఈ స్వామిని దర్శించుకున్న వారికి సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మోపిదేవిని పూర్వం కుమారక్షేత్రమని, మోహినిపురమని పిలిచేవారని స్కందపురాణం ద్వారా తెలుస్తోంది. ఓ సందర్భంలో పార్వతీదేవి, తన తనయుడైన కుమారస్వామిని మందలించిందట. స్వామి పశ్చాత్తాపంతో తపస్సు చేసేందుకు భూలోకంలోని ఈ ప్రాంతానికి వచ్చి సర్పరూపం దాల్చి పుట్టలో ఉండి తపస్సు చేస్తున్నాడట. కొంతకాలానికి అగస్త్య మహర్షి కృష్ణానదీ తీరాన గల మోహినీపురం చేరుకుని నదిలో స్నానం చేసేందుకు వటవృక్షం చెంతకు చేరగా, అక్కడే ఉన్న పుట్టలో నుంచి దివ్యమైన కాంతిపుంజం కానరావడంతో దివ్యదృష్టితో శోధించగా, పుట్టలో తపస్సు చేసుకుంటున్న కుమారస్వామి దర్శనమిచ్చాడట. అగస్త్యముని స్వామి తపస్సుకు భంగం కలగకుండా, పుట్టలోపల ఉన్న శివలింగాన్ని బయటకు తీసి పుట్టపై ప్రతిష్టిస్తారు. అనంతరం ఈ ప్రాంతానికి కుమారక్షేత్రంగా నామకరణం చేసి అగస్త్యముని ఇక్కడ నుంచి వెళ్లిపోయారని, ఈ కుమారక్షేత్రమే తరువాత కాలంలో మోహినీపురంగానూ, మోపిదేవిగానూ రూపాంతరం చెందినట్టు ఆలయ చరిత్ర తెలియజేస్తోంది. దేవతలచే పూజలందుకున్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి లింగాకృతి కొన్నేళ్ల తరువాత అదృశ్యమై ఇక్కడున్న పుట్టలో ఉండిపోయింది. ఈ పుట్టకు దగ్గరలో వీరారపు పర్వతాలు అనే భక్తునికి స్వామి కలలో కనబడగా పుట్టలో ఉన్న శివలింగాన్ని బయటకు తీసి ప్రస్తుతం ఆలయంలో ఉన్న ప్రాంతంలో ప్రతిష్టించినట్లు, అనంతరం దేవరకోట సంస్థానాధీశులైన శ్రీమంతురాజా యార్లగడ్డ వారి వంశీయులు నిత్యధూప, దీప, నైవేద్యాలతో పాటు కొంత భూమిచ్చి శిఖర, గోపుర మండపాలతో స్వామివారికి ఆలయం నిర్మించారు. నాటినుంచి స్వామివారు భక్తుల కోర్కెలు తీరుస్తూ పూజలందుకుంటున్నారు. సుబ్రహ్మణ్యషష్ఠికి స్వామికి భక్తులు విశేషపూజలు చేస్తారు. – ఉప్పల సుబ్బారావు, సాక్షి, మోపిదేవి, కృష్ణాజిల్లా ఇలా వెళ్లాలి అమరావతి, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుంచి వచ్చే భక్తులు తెనాలి చేరుకుని అక్కడ నుంచి రేపల్లె రావాలి. ఇక్కడ నుంచి మచిలీపట్నం, చల్లపల్లి వెళ్లే బస్సులు ఎక్కితే ఆలయం ముందు దిగవచ్చు. రేపల్లె రైల్వేస్టేషన్ నుంచి మోపిదేవికి ఆటోలు అందుబాటులో ఉంటాయి. విజయవాడ నుంచి వచ్చే వారు కరకట్ట మీదుగా మోపిదేవి వార్పు నుంచి మోపిదేవికి 59 కి.మీ, లేదా నడకుదురు మీదుగా వయా చల్లపల్లి నుంచి మోపిదేవికి 64 కి.మీ దూరం ఉంటుంది. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నుంచి అవనిగడ్డ వెళ్లే బస్సులు ఎక్కితే ఆలయం ముందు దిగొచ్చు. -
పదవికి వన్నె తెస్తా
శివ్వంపేట: తెలంగాణ అసెంబ్లీ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయడంతో పాటు పదవికి వన్నె తీసుకవస్తానని డిప్యూటీ స్వీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని దొంతి వేణుగోపాలస్వామి ఆలయాన్ని ఆమె దర్శించుకున్నారు. దొంతి వేణుగోపాలస్వామి మహిమగల దేవుడని డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటి సారిగా వేణుగోపాలస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. పద్మక్కగానే ఆదరించండి జిల్లా ప్రజల ప్రేమానురాగాల వల్లనే తెలంగాణ రాష్ట్ర మొదటి డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యానని, అందుకు జిల్లా ప్రజలకు జీవిత కాలం రుణపడి ఉంటా నిని పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నిక కావడం తన అదృష్టంగా భావిసున్నానన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరి సహ కారం, అండదండలు అవసరమన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. భారీ ర్యాలీ, సన్మానం డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికై మొదటి సారిగా జిల్లాకు వచ్చిన పద్మాదేవేందర్‌రెడ్డికి టీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి, సన్మానం చేశారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ పద్మాదేవేందర్‌రెడ్డి డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నిక కావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కమలపూల్సింగ్ నాయకులు దేవేందర్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, మన్సూ ర్, కల్లూరి హరికృష్ణ, చంద్రాగౌడ్, పిట్ల సత్యనారాయణ, ఆనందరావు, నాగేశ్వర్రావు, లక్ష్మినర్సయ్య, మాధవరెడ్డి, అంజయ్య ఉన్నారు. అవమానాలను ఎదుర్కొన్నాం తూప్రాన్: సమైక్య రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులుగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నామని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తూప్రాన్ ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి మాట్లాడుతూ రకరకాల ఇబ్బందికరమైన జీఓల తో తెలంగాణలోని వనరులను దోచుకవెళ్లే విధంగా ఎన్నో ఎత్తుగడలు శాసన సభలో జరిగేవన్నారు. అప్పుడు శాసన సభ్యురాలిగా తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం చేశామన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజల 60 సంవత్సరాల స్వప్నం నేరవేరిందన్నారు. కల నేరవేరిన సందర్భంగా ప్రజలు స్వేచ్ఛా వాయివులు ఆ స్వాదిస్తూనే మరో వైపు తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. తెలంగాణ కోసం కృషి చేస్తామన్నారు. ప్రతి విషయంలోను ప్రతి పక్షాల సూచనలు, సలహాలు తీసుకుని శాసన సభ వ్యవహారాలు, సాంప్రదాయ బద్ధంగా అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. శాసన సభలో రైతు రుణమాఫీపై సీఎం స్పష్టమైన హా మీ ఇచ్చారన్నారు. రూ.లక్ష లోపు వ్యవసాయ రుణాలు మాఫీ కానున్నాయ న్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా శాసన సభలో ఏకగ్రీవం తీర్మానం చేశామన్నారు. అంతకు ముందు డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టి తొలిసారి తూప్రాన్‌కు వచ్చిన సందర్భంగా స్థానిక సర్పంచ్ చిట్టిమిల్ల శివ్వమ్మ ఆమెను సన్మానించారు. అలాగే నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని సన్మానం చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, నాగులపల్లిర్పంచ్ శ్రీలం యాదవ్, మధుసూదన్‌రెడ్డి, చంద్రారెడ్డి, షపీయొద్ధీన్ తదితురులు పాల్గొన్నారు. -
వేడుకగా చక్రస్నానం
కార్వేటినగరం, న్యూస్‌లైన్: కార్వేటినగరం వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం ఉదయం చక్రస్నానం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్కంధ పుష్కరిణిలో కంకణభట్టు సుందరవరదాచార్యులు, కిరణ్ భట్టాచార్యులు శాస్త్రోక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, అర్చన, శుద్ధి, కొలువు, మొదటి గంట, నిత్యకైంకర్యాలు నిర్వహించారు. అనంతరం వేణుగోపాలస్వామిని ఓ వైపు, రుక్మిణీ సత్యభామలను మరో వైపు పల్లకిలో అధిష్టింపజేశారు. చక్రత్తాళ్వారు ముందు వెళుతుండగా వెనుక ఉభయ దేవేరులతో స్వామివారు పురవీధుల్లో ఊరేగుతూ పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. ఉభయనాంచారుల సమేతుడైన వేణుగోపాలస్వామికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, తేనె, పసుపు, చందనం, నెయ్యి, తైలం, నారికేళి జలాలతో అభిషేకించారు. స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. ప్రత్యేక పూజల అనంతరం చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మేళతాళాలు, మత్రోచ్ఛారణల మధ్య స్కంధ పుష్కరిణిలో స్వామివారి ఇష్టాయుధమైన (చక్రత్తాళ్వారుకు) చక్రానికి స్నానం చేయించారు. ఆ సమయంలో పుష్కరిణిలో స్నానం చేయడానికి భక్తులు పోటీపడ్డారు. సాయంత్రం స్వామికి తిరివీధి ఉత్సవం , రాత్రి కుంభప్రోక్షణ, పూర్ణాహుతి, ధ్వజావరోహణంతో వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. డెప్యూటీ ఈవో హరినాథ్, సూపరింటెండెంట్ పీతాంబరరాజు, ఆలయాధికారి సిద్దారెడ్డి, జమేదార్ శివకేశవులు, వోఎస్డబ్ల్యూ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
చిన్నశేషునిపై వేణుగోపాలుడు
కార్వేటినగరం, న్యూస్‌లైన్: కార్వేటినగరంలోని వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం ఉదయం స్వామివారు చిన్నశేష వాహనంపై విహరించారు. వేకువజామున ఐదు గంటలకు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి అర్చన, తోమాల, శుద్ధి, అభిషేకం, నిత్యకైంకర్య పూజలు చేశారు. 7.30 నుంచి 9 గంటల వరకు స్వామివారు చిన్నశేష వాహనంపై ఊరేగారు. భక్తులు కర్పూర హారతులు పట్టారు. గజ, వృషభాలు, చిన్నారుల చెక్కభజనలు, కోలాటం, భజన కీర్తనల నడుమ ఊరేగింపు అత్యంత వైభవంగా సాగింది. ఘనంగా స్నపన తిరుమంజనం రుక్మిణి సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి ఉత్సవమూర్తులకు గురువారం స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. పసుపు, చందనం, పా లు, పెరుగు, నారికేళ జలాలు వంటి సుగంధ ద్రవ్యాలతో ఉత్సవమూర్తుల ను అభిషేకించారు. వేద పండితులు సుందరవరదాచార్యులు, కిరణ్భట్టాచార్యులు, దీక్షితాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. రమణీయంగా ఊంజల్ సేవ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఊంజల్ సేవను సాయంత్రం ఐదు గంటలకు రమణీయంగా నిర్వహించారు. సంకీర్తనాలాపన, వేద మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 8 గంటలకు పట్టువస్త్రాలు, సుగంధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన ఉభయ దేవేరులతో వేణుగాన లోలుడు పురవీధుల్లో విహరించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో హరినాథ్, సూపరింటెండెంట్ పీతాంబరరాజు, ఆలయాధికారి సిద్దారెడ్డి, జమేదార్ శివకృష్ణ, ఓఎస్డబ్ల్యూ శ్రీనివాసులు, పీఎన్.మూర్తి. ఆలయ సిబ్బంది, పెద్ద ఎత్తును భక్తులు పాల్గొన్నారు.